రూ.100కు ఓటీపీ.. వివాహితకు వేధింపులు

25 Feb, 2021 07:59 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకోవాలన్నా..అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగించాలన్నా...ఈ తరహా సేవలు ఏది పొందాలన్నా వినియోగదారుడి ఫోన్‌కు వచ్చే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) అత్యంత కీలకం. ఆయా యాప్స్‌లో కస్టమర్‌ ఎంటర్‌ చేసిన నెంబర్‌కే ఇవి వస్తుంటాయి. సదరు యాప్స్‌ దురి్వనియోగం కాకుండా, అలా అయితే బాధ్యుల్ని ఫోన్‌ నెంబర్‌ ద్వారా గుర్తించడానికి ఈ విధానం ప్రవేశపెట్టారు. అయితే ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో ఈ ఓటీపీలను విక్రయించేస్తున్నారు. గరిష్టంగా రూ.100 వాలెట్స్‌లోకి చెల్లించి కావాల్సిన యాప్‌నకు ఓటీపీ పొందవచ్చు. ఈ విధానంలో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకున్న బీఫార్మసీ విద్యార్థి తన సమీప బంధువునే వేధించాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఆద్యంతం సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం నిందితుడిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు (20) బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడి కుటుంబం ఉండే అపార్ట్‌మెంట్‌లోనే సమీప బంధువైన వివాహిత కుటుంబంతో నివసిస్తోంది. ఆమెపై కన్నేసిన ఈ యువకుడు సోషల్‌మీడియా ద్వారా వేధించాలని నిర్ణయించుకున్నాడు. అయితే నేరుగా తన వాట్సాప్‌ నెంబర్‌తోనే అలా చేస్తే దొరికిపోతానని భావించాడు. దీంతో కొత్త నెంబర్‌తో వాట్సాప్‌ యాక్టివేట్‌ చేయాలని ప్రయతి్నంచాడు. టెలిగ్రామ్‌ యాప్‌లో ఉన్న ఓ గ్రూప్‌లో ఈ ఓటీపీలు విక్రయిస్తున్నారని తెలుసుకున్నాడు. ఆ గ్రూప్‌లో సంప్రదించడం ద్వారా రూ.20 చెల్లించి ఒడిశాకు సంబంధించిన సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఓటీపీ తీసుకున్నాడు.

దీన్ని అప్పటికే తన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసి ఉంచిన వాట్సాప్‌లోకి ఎంటర్‌ చేసి యాక్టివేట్‌ చేసుకున్నాడు. ఇలా తిరుమలగిరి యువకుడు వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌లో ఒడిశా నెంబర్‌తో కూడిన వాట్సాప్‌ పనిచేయడం మొదలైంది. దీన్ని వినియోగించి దాదాపు రెండు నెలలుగా తన సమీప బంధువైన వివాహితకు అశ్లీల సందేశాలు పంపిస్తూ వేధింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ నేతృత్వంలో ఎస్సై రమేష్‌ ఈ కేసు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు బాధితురాలి సమీప బంధువే నిందితుడిగా గుర్తించాడు. బుధవారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఓటీపీల విక్రయం విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఎప్పటికీ చిక్కనని భావించానని, అయితే తక్కువ కాలంలోనే పట్టుబడ్డానని బీఫార్మసీ విద్యార్థి చెప్పుకొచ్చాడు. నిందితుడికి సీఆరీ్పసీ 41 ఏ కింద నోటీసు జారీ చేశారు. సదరు టెలిగ్రామ్‌ గ్రూప్‌లో ఓటీపీల విక్రయంపై దృష్టి పెట్టారు. వాళ్లు వీటిని ఎలా తీసుకుంటున్నారు? ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరు? అనే అంశాలు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు