మళ్లీ సెంట్రల్‌ ‘క్రైమ్‌’ స్టేషన్‌!

5 Feb, 2022 07:38 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అంటే ఒకప్పుడు చోరులు, దోపిడీ దొంగలు, బందిపోట్లకు హడల్‌. జూపార్క్‌లో పులి సాఖీని చంపిన సలావుద్దీన్‌ నుంచి పాతబస్తీలోని మహంకాళి ఆలయంలో చోరీకి పాల్పడిన గౌస్, సలీంల వరకు ఎందరో కరుడుగట్టిన నేరగాళ్లను అరెస్టు చేసిన ఘన చరిత్ర దీనికి ఉంది. కొంత కాలంగా నిర్వీర్యమైన సీసీఎస్‌ క్రైమ్‌ టీమ్స్‌ను పునరుద్ధరించాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నిర్ణయించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.   

ఎన్నో విభాగాలు... 
నగరంలో చోటు చేసుకున్న సంచలనాత్మక కేసులను ఒకప్పుడు సీసీఎస్‌కు బదిలీ చేసే వాళ్లు. రూ.30 లక్షలకు పైబడిన సొత్తుతో కూడిన భారీ చోరీలతో పాటు దోపిడీ, బందిపోటు దొంగతనం, కార్ల తస్కరణ తదితరాలన్నీ ఇక్కడకే వచ్చేవి. దీనికోసం ఇందులో యాంటీ డెకాయిటీ అండ్‌ రాబరీ టీమ్, ఆటోమొబైల్‌ టీమ్, క్రైమ్‌ బృందం... ఇలా వివిధ విభాగాలు పని చేసేవి. నగర టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్‌ ఎస్‌ఓటీలతో పాటు క్రైమ్‌ వర్క్‌కు సంబంధించి అప్పట్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న గోషామహల్‌ ఏసీపీ టీమ్‌లకు పోటీగా సీసీఎస్‌ అధికారులు పని చేసే వాళ్లు. ఫలితాలు కూడా అదే స్థాయిలో సాధించారు. 

ప్రస్తుతానికి అంతర్గతంగా నియామకం... 
ఆయా జోన్లలో జరిగే భారీ నేరాలను ఈ బృందాలు దర్యాప్తు చేస్తాయి. కేసులను కొలిక్కి తీసుకువచ్చి నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. అత్యంత సంచలనాత్మక కేసులను పర్యవేక్షించడానికి మరో ప్రత్యేక టీమ్‌ పని చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఆరు టీమ్స్‌లోని సీసీఎస్‌లో పని చేస్తున్న వారినే తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారు ముందుకు రావాలంటూ అంతర్గతంగా సమాచారం ఇచ్చారు. రానున్న రోజుల్లో నగరంలోని ఠాణాలు, ఇతర విభాగాల్లో ఉన్న అనుభవజ్ఞులను నియమించడం ద్వారా సీసీఎస్‌ క్రైమ్‌ టీమ్స్‌ను దీటుగా తీర్చిదిద్దడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.   

కొన్నేళ్లుగా ఆర్థిక నేరాల కేసులతోనే..
కాలక్రమంలో సీసీఎస్‌లోని ఈ క్రైమ్‌ టీమ్‌లు తమ ఉనికిని కోల్పోయాయి. అప్పట్లో ఆర్థిక నేరాలు, మోసాల కేసులను దర్యాప్తు చేయడానికి పరిమిత సంఖ్యలో టీమ్స్‌ ఉండేవి. అయితే రానురాను ఈ తరహా కేసులు పెరగడంతో పాటు అనుభవజ్ఞలైన సిబ్బంది దూరం కావడంతో సీసీఎస్‌లో క్రైమ్‌ వర్క్‌ తగ్గింది. ప్రస్తుతం దాదాపు అన్ని బృందాలు ఈ ఆర్థిక నేరాలనే దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విషయం గమనించిన నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్‌ పరిధిలోని ఐదు జోన్లకు సంబంధించి ఐదు, ప్రత్యేకంగా మరొకటి కలిపి ఆరు క్రైమ్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు