కళ్లెదుటే ఇద్దరు కుమారులు దుర్మరణం.. కోమాలోకి వెళ్లిన తల్లి

14 Nov, 2023 12:37 IST|Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ : దీపావళి ప్రతీ ఇంట్లో వెలుగులు తెస్తే.. ఆ కుటుంబంలోకి మాత్రం చీకటి తెచ్చింది. పండుగ రోజు టపాసులు కొనేందుకు తల్లి, ఇద్దరు కుమారులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు టైర్‌ కిందపడి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టేక్మాల్‌ మండలం కాద్లూర్‌ గ్రామానికి చెందిన అన్నపూర్ణ మెదక్‌ పట్టణం జంబికుంటలో నివాసం ఉంటున్నారు. భర్త శ్రీనివాస్‌ గతంలో మెదక్‌లోనే హోంగార్డ్‌గా పని చేసి, రెండేళ్ల క్రితం బొడ్మట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

అప్పటి నుంచి అన్నపూర్ణ మెదక్‌లోని కేజీబీవీలో టీచర్‌గా పని చేస్తూ ఇద్దరు పిల్లలు పృధ్వీ తేజ్‌ (9), ప్రణయ్‌ తేజ్‌ (12) చదివించుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆదివారం దీపావళి పండుగ కావడంతో టపాసులు కొనడానికి ఇద్దరు కుమారులతో కలిసి వడ్డెర కాలనీలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్దకు స్కూటీపై వెళ్తుంది. మార్గమధ్యలో స్థానిక గోల్కొండ వీధిలో ప్రధాన రోడ్డుపై వీరి స్కూటీని వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అన్నపూర్ణ రోడ్డు పక్కన పడిపోగా, స్కూటీ వెనుకాల ఉన్న పృధ్వీ తేజ, ప్రణయ్‌ టిప్పర్‌ టైర్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. కళ్ల ముందే కుమారులు చనిపోవడం చూసిన ఆ తల్లి గుండెలు అవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ వాహనాన్ని వదిలేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లి లేకుండానే అంత్యక్రియలు
టేక్మాల్‌(మెదక్‌):
మెదక్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు చిన్నారుల అంత్యక్రియ లు స్వగ్రామమైన కాద్లూర్‌లో తల్లి లేకుండానే జరిగాయి. కళ్ల ముందే కొడుకులు చనిపోవడం చూసిన అన్నపూర్ణ కోమాలోకి వెళ్లడంతో సంగారెడ్డిలోని పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందు తుంది. పండుగ రోజే ఇద్దరు మృతి చెందడంతో గ్రామ ంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో చనిపోయిన ప్రణయ్‌తేజ్‌ (12) మెదక్‌ గీతా పాఠశాలలో 7వ తరగతి, పృధ్వీ తేజ్‌ (9) తుప్రాన్‌ గీతా పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు.

మరిన్ని వార్తలు