హత్య చేసింది ‘తమ్ముడే’

28 Mar, 2024 04:56 IST|Sakshi

నల్లమాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు 

హత్యలో రాజకీయ కోణం లేదని స్పష్టీకరణ 

వివాహేతర సంబంధమే హత్యకు కారణం 

ఏ1 ముద్దాయిగా టీడీపీ కార్యకర్త శ్రీనివాసరెడ్డి 

మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ మాధవరెడ్డి

సాక్షి, పుట్టపర్తి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగినా.. రాజకీయ రంగు పూసి సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలే హత్య చేసినా.. బురద మాత్రం అధికారపార్టీపై వేసి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలియడంతో ప్రజల్లో అభాసుపాలు అవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కుటాలపల్లిలో జరిగిన హత్య విషయంలోనూ టీడీపీ నేతల దుష్ప్రచారం బట్టబయలైంది.

కుటాలపల్లిలో ఈ నెల 24వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగినట్లు అదే రోజున పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదేమీ పట్టించుకోకుండా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శవ రాజకీయానికి తెర లేపారు. దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పల్లె రఘునాథరెడ్డితో పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సైతం అసత్య ప్రచారం చేశారు. ఈ హత్య ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్టు చేశాయి.

వివాహేతర సంబంధం కారణంగానే దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని ఎస్పీ మాధవరెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. అమరనాథ్‌రెడ్డి సమీప బంధువైన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఈ హత్య చేశారని వెల్లడించారు. అతనితో పాటు నిందితులుగా ఉన్న గుండ్రా వీరారెడ్డి, మల్లెల వినోద్‌కుమార్, రమావత్‌ తిప్పేబాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు.  

నిందితుడు టీడీపీ కార్యకర్త 
దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో కూడా కుటాలపల్లిలో చిన్న చిన్న ఘర్షణల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఇవన్నీ తెలిసినా కూడా పల్లె రఘునాథరెడ్డి అధికార పార్టీ వైపు కేసును తోసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ పెద్దలు చేసిన కుట్రలను చూసి స్థానికులు మండిపడుతున్నారు.

హత్యకు కారణాలివీ.. 
కుటాలపల్లికి చెందిన తిప్పేబాయితో కొన్నేళ్లుగా దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అమరనాథ్‌రెడ్డితో ఆమె సన్నిహితంగా ఉండ­టా­న్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఆమెను ప్రశ్నించాడు. తనకు ఆర్థిక సాయం చేశాడు కాబట్టి అతన్ని వదలలేనని తేల్చి చెప్పింది. దీంతో అమరనాథ్‌రెడ్డిని చంపేయడానికి శ్రీనివాసరెడ్డి పథ­కం రచించాడు.

తనకు సన్నిహితంగా ఉండే వీరారెడ్డితో పాటు చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన మల్లెల వినోద్‌కుమార్‌ సాయం కోరాడు. గత ఆదివారం రాత్రి అమరనాథ్‌రెడ్డి పొలం వద్దకు వెళ్లగా.. మల్బరీ ఆకులు కోసే కత్తితో మెడ, ముఖం, తలపై నరికి చంపేశారు. మరుసటి రోజు ఉదయమే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది.

Election 2024

మరిన్ని వార్తలు