ముగిసిన అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగర్‌ ప్రస్థానం | Sakshi
Sakshi News home page

ముగిసిన అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగర్‌ ప్రస్థానం

Published Sun, Apr 7 2024 1:52 PM

Maoist Santosh died on encounter - Sakshi

23 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగర్‌ 


దళసభ్యుడి నుంచి.. దండకారణ్య తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబర్‌గా ఎదిగిన నేత


చివరికి ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి..


ఆయన స్వస్థలం కాటారం మండలం అంకుషాపూర్‌


కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు 
 

హన్మకొండ: విప్లవ గీతాలకు ఆకర్షితుడై, నమ్మిన సిద్ధాంతం కోసం 23 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్‌కు చెందిన మావోయిస్టు అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగర్‌ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ పూజారి కాంకేర్‌ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగర్‌ మృతి చెందాడు. ఈ మేరకు బీజాపూర్‌ పోలీసులతో పాటు కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి.. సంతోష్‌ మృతిని నిర్ధారించారు.

18 ఏళ్ల వయసులో అడవి బాట..
కాటారం మండలం అంకుషాపూర్‌కు చెందిన అన్నె సమ్మక్క, ఐలయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె. వారిలో మొదటి కుమారుడు సంతోష్‌ కాగా, ఇద్దరు కవలలు రామ్‌ లక్ష్మణ్, కుమార్తె హైమావతి. సంతోష్‌ బాల్యం తన అమ్మమ్మ ఇంటి వద్ద మహాముత్తారం మండలం దుంపిళ్లపల్లిలో కొనసాగగా 7వ తరగతి వరకు అంకుషాపూర్‌లో చదువుకున్నాడు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్‌లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివాడు. పలు కారణాలతో చదువు మానేసిన సంతోష్‌.. డ్రైవింగ్‌ నేర్చుకుని జీప్, కారు డ్రైవింగ్‌కు వెళ్తుండేవాడు. తన 18వ ఏట దుంపిళ్లపల్లికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి పీపుల్స్‌వార్‌ విప్లవ రచనలు, గీతాలకు ఆకర్షితుడై వివాహం జరిగి ఆరు నెలలు గడవక ముందే 2001లో అడవి బాట పట్టాడు. గ్రామ పరిసరాల్లోకి అన్నలు వచ్చారనే సమాచారం తెలుసుకున్న సంతోష్‌.. అక్కడికి వెళ్లి వారితో పాటు వెళ్లిపోయాడు. విషయం తెలియని తల్లిదండ్రులు డ్రైవింగ్‌కు వెళ్లాడని అనుకోగా ఆ సమయంలో కాటారం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సదానందం గ్రామంలోకి వచ్చి మావోలతో వెళ్లినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.

23 ఏళ్లుగా పలు బాధ్యతల్లో..
2001లో మావోయిస్టుల్లో చేరిన అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగర్‌ 23 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. మొదట దళసభ్యుడిగా, కొన్ని ఏళ్ల తర్వాత అసిస్టెంట్‌ దళ కమాండర్‌గా, డివిజనల్‌ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సంతోష్‌ కమిట్మెంట్‌ను గుర్తించిన మావోయిస్టు అగ్రనాయకత్వం.. ఇటీవల దండకారణ్య తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబర్‌తో పాటు సెకెండ్‌ సీఆర్‌సీ కమాండర్‌గా బాధ్యతలు అప్పగించింది. 23 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు పోలీసులకు చిక్కని సంతోష్‌ శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసువులు బాశాడు. కాగా, ఎన్‌కౌంటర్‌లో సంతోష్‌ మృతి చెందాడనే వార్త ఉదయమే గ్రామంలో విస్తరించింది. బీజాపూర్‌ పోలీసులు సంతోష్‌గా నిర్ధారించి స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. సంతోష్‌ మృతి విషయం గ్రామంలో చక్కెర్లు కొట్టినా తల్లిదండ్రులు మాత్రం ఇందులో చనిపోయింది తమ కొడుకు కాదని ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా వారు ఐనవోలు జాతరకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. సంతోష్‌ ఫైల్‌ ఫొటో చూపించినా వారు గుర్తుపట్టలేదు. దీంతో సాయంత్రం వరకు పోలీసులు సైతం సంతోష్‌ మృతిని నిర్ధారించలేకపోయారు. చివరకు మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో సంతోష్‌ మృతిని అధికారికంగా నిర్ధారించారు.

పేదరికంలో తల్లిదండ్రులు..
వృద్ధులైన సంతోష్‌ తల్లిదండ్రులు సమ్మక్క, ఐలయ్య పేదరికంలో కాలం వెల్లదీస్తున్నారు. సరైన ఇళ్లు కూడా లేకపోవడంతో గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. చేతికి వచ్చిన కొడుకు 18 ఏళ్లలో అడవి బాట పట్టగా.. రెండో కొడుకు కొంత కాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్న కొడుకు పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నాడు. దీంతో వారు కూలీ చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.  

పోలీసుల సహకారం..
పేదరికంలో కొనసాగుతున్న సంతోష్‌ తల్లిదండ్రులకు కాటారం పోలీసులు పలుమార్లు సాకారం అందిస్తూ వస్తున్నారు. నిత్యం వారి బాగోగోలు తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తుంటారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసమైన సంతోష్‌ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు అనేకమార్లు సందేశమందించారు.

22 ఏళ్ల  క్రితం చూసినం..
మా కొడుకు అన్నల్లోకి పోయి 23 ఏళ్లు అవుతుంది. 18 ఏళ్లు ఉన్నప్పుడు అన్నల్లోకి పోయిండు. ఏడాది అయినాక ఓ రోజు రాత్రి అన్నలతోని గ్రామంలోకి వచ్చాడు. అప్పుడు చీకట్లో చూసినం. ఇది వరకు ఏ రోజు కూడా మా కొడుకు మొఖం తెల్వదు, మాట తెల్వదు. ఏదో కానరాని అడువుల్లో ఉంటాండు అని వాళ్లు, వీళ్లు చెబుతుంటే విన్నం. ఎప్పుడైన ఇటు దిక్కు వస్తే కాళ్లు పట్టుకొని ఇంటికాడనే ఉంచుకుందామని చూసినం. కానీ ఆ దేవుడు ఒక్కసారి కూడా కనికరించలే. ఏడేళ్ల కిందట పక్క రాష్ట్రంల ఎన్‌కౌంటర్‌ జరిగితే పోలీసోళ్లు మమల్ని ఠాణాకు తీసుకుపోయి మీ కొడుకేనా అని ఫొటోలు చూపించిండ్రు. మా కొడుకు కాదని వచ్చినం. ఇప్పుడు కూడా ఫొటోలో గుర్తుపట్టలేం. మా కడుపు గట్టిది అయితే మా కొడుకు బతికి ఉంటడు. లేకపోతే ఆ దేవుడి దగ్గరికి పోతడు. 
 – అన్నె ఐలయ్య, సమ్మక్క 

Advertisement

తప్పక చదవండి

Advertisement