గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఆరుగురు యువకులు మృతి

10 Sep, 2022 11:27 IST|Sakshi

చండీగఢ్‌: హర్యానాలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మహేంద్రగఢ్‌, సోనిపత్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన వేరు వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మహేంద్రగఢ్‌లో ఏడు అడుగుల వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కాలువలోకి దిగిన 9 మంది యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఐదుగురిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సోనిపత్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సరయూ నదిలోకి దిగిన ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయారు. ఈ విషాద ఘటనలపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లి వీరంతా ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచివేసిందని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే  సహాయక చర్యల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బందిని ప్రశంసించారు.

చదవండి: అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే..

మరిన్ని వార్తలు