కూలీలను కబళించిన మృత్యువు 

6 Nov, 2021 03:39 IST|Sakshi
లారీ ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన ఆటో

ఆటోను లారీ ఢీకొనడంతో ఆరుగురు కూలీల దుర్మరణం

మరో 8 మందికి తీవ్ర గాయాలు 

మృతులంతా మహిళలే 

అనంతపురం జిల్లా పామిడి వద్ద ఘటన  

పామిడి (అనంతపురం): సద్ది కట్టుకుని ఆటోలో బయల్దేరిన పత్తి కూలీలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని జాతీయ రహదారిపైకి వెళ్లే మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన దాదాపు వంద కుటుంబాలు వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరంతా సమీపంలోని పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో పత్తి తొలగింపు పనులకు వెళ్తుంటారు. శుక్రవారం వేకువజామున పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి పొలాల్లో పత్తి తీసేందుకు కొప్పలకొండ నుంచి 14 మంది కూలీలు తమ గ్రామానికే చెందిన డ్రైవర్‌ నల్లబోతుల లక్ష్మీనారాయణ ఆటోలో బయలుదేరారు.

ఆటో పామిడి పట్టణం మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకుంటుండగా.. హైదరాబాద్‌ వైపు నుంచి లారీ ఎదురుగా దూసుకొచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో కూలీలు గూడు చౌడమ్మ (32), గోసుల సుబ్బమ్మ (47), గోసుల సావిత్రి (37), మీనుగ నాగవేణి (47), గోసుల శంకరమ్మ (43) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కూలీలు రామలక్ష్మి, సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి, రమాదేవి, నాగవేణి, రేవంత్, జయమ్మతోపాటు ఆటో డ్రైవర్‌ లక్ష్మీనారాయణ గాయాల పాలయ్యారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నల్లబోతుల నాగవేణి (23) మృతి చెందింది. ఆటో డ్రైవర్‌ లక్ష్మీనారాయణ భార్య జయమ్మ (40) పరిస్థితి విషమంగా ఉంది.  పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సీఈవో ఆలూరి సాంబశివారెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌లు ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. 

మరిన్ని వార్తలు