ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతి

15 Nov, 2023 08:33 IST|Sakshi

అల్లాదుర్గం(మెదక్‌): అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాంపూర్‌ స్టేజీ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాదుర్గం మండల పరిధిలోని సీతానగర్‌ గ్రామానికి చెందిన చిన్నోల సాయికుమార్‌ (13), విజయ్‌ (16), అజయ్‌ ముగ్గురూ ఒకే బైక్‌పై రాంపూర్‌ బ్రిడ్జి కింద నుంచి సొంత గ్రామానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్‌ నుంచి బాన్సువాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాంపూర్‌ స్టేజీ వద్ద విద్యార్థుల బైక్‌ను వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సాయికుమార్‌, విజయ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, అజయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అజయ్‌ను స్థానికులు హైవే అంబులెన్స్‌లో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్‌ పెద్దశంకరంపేట ప్రభుత్వ పాఠశాలలో 9 తరగతి చదువుతుండగా, విజయ్‌ పెద్దశంకరంపేట మోడల్‌ స్కూల్‌లో 10 తరగతి చదువుతున్నారు. బస్సు డ్రైవర్‌ వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు.

బస్సు అద్దాలు ధ్వంసం
రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు, మృతుల బంధువులు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. 161 హైవేకి చెందిన మరో వాహనాన్ని సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఘటన స్థలంలో వీడియో తీస్తున్న సీఐ కార్యాలయం రైటర్‌ ఫోన్‌ను లాక్కొని పగులగొట్టారు. అలాగే, రాంపూర్‌ వద్ద 161 జాతీయ రహదారిపై గంటపాటు వాహనాలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారినా మూడు గంటలపాటు పోలీసులు రాకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. రెండు గంటలపాటు ఆయన ఘటనా స్థలంలోనే ఉన్నారు. అనంతరం పోలీసులు వచ్చి ఈ ఘటనపై కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు. బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు