స్వామీజీల ముసుగులో గంజాయి రవాణా 

12 Dec, 2023 03:52 IST|Sakshi

రూ.1.21 కోట్ల విలువైన సరుకు స్వాధీనం

భద్రాచలం అర్బన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం టాస్క్ ఫోర్స్‌ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.1.21 కోట్ల విలువైన 484 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. కాషాయ వ్రస్తాలు ధరించి, వాహనంలో దేవతామూర్తుల విగ్రహాలతో తిరుగుతూ భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నట్లు నమ్మిస్తున్న కొందరు వ్యక్తులు అదే వాహనంలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు.

భద్రాచలం టౌన్‌ సీఐ నాగరాజురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్వామీజీల వేషధారణలో కొందరు వాహనంలో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి వాహనంలో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌ వద్ద టాస్క్ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరియాణా రాష్ట్రానికి చెందిన మున్షీరాం, భగత్, గోవింద్‌ పట్టుబడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో బల్వన్‌ అనే వ్యక్తి ప్రోద్బలంతో వీరు ఆటో కొనుగోలు చేసి దేవుడి ప్రచార రథంలా మార్చారు. ఏపీ–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కలిమెలిలో గంజాయిని కొనుగోలు చేసి హరియాణాలో విక్రయించేందుకు వీరు బయలుదేరారని సీఐ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు