చీటింగ్‌ కేసులో టీడీపీ నేత హరిప్రసాద్‌ అరెస్ట్‌

5 Oct, 2020 05:58 IST|Sakshi
హరిప్రసాద్‌ను పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం

అటాచ్‌లో ఉన్న భూమిని విక్రయించిన నిందితుడు

రాజంపేట, రాయచోటి: అటాచ్‌లో ఉన్న సొసైటీ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించిన కేసులో వైఎస్సార్‌ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రాజంపేట సీఐ శుభకుమార్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనగలూరు మండలం కంబాలకుంటకు చెందిన వెంకటసుబ్బయ్య 2001లో శ్రీసాయి ఎడ్యుకేషన్‌ సొసైటీని స్థాపించాడు. చార్మినార్‌ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో వెంకటసుబ్బయ్య జైలుకు వెళ్లిన సమయంలో రాజంపేటలో అటాచ్‌లో ఉన్న ఐదెకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా హరిప్రసాద్‌ విక్రయించాడు. మూర్తి, శంకర్‌నాయుడు, జోహార్‌ చౌదరి అతడికి సహకరించారు. వెంకటసుబ్బయ్య ఈనెల 1న దీనిపై రాజంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్న నిందితుడు హరిప్రసాద్‌ను ఆదివారం దేవుని కడపలో అరెస్టు చేసి రిమాండు నిమిత్తం ప్రొద్దుటూరు సబ్‌జైలుకు తరలించారు. 

బెదిరింపులకు పాల్పడుతున్నాడు
హరిప్రసాద్‌ తన భూములను ఆక్రమించడమే కాకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు వెంకటసుబ్బయ్య ఆదివారం రాయచోటిలో మీడియాతో పేర్కొన్నాడు. చార్మినార్‌ బ్యాంకులో రుణం విషయంలో తనను అరెస్టు చేయడంతో సొసైటీ తాత్కాలిక సెక్రటరీగా హరిప్రసాద్‌ను నియమించానన్నారు. ఇదే అదనుగా రాజంపేటలో భూమిని నకిలీ పేర్లతో విక్రయించినట్లు పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు