9 నెలలు.. 40 మందికి ‘షోకాజ్‌’లు..

2 Oct, 2021 09:03 IST|Sakshi

సాక్షి, జగిత్యాల(కరీంనగర్‌): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని, వాటిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చడంతోపాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు మాత్రం పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలకు గాను 380 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రామాల్లోనే ఉంటూ పరిశుభ్రత, పాలనలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కానీ చిన్నపాటి తప్పిదాలకే షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత 9 నెలల కాలంలో 40 మందికి జారీ చేశారు. దీంతో కార్యదర్శులు విధులు నిర్వహించేందుకు జంకుతున్నారు. 

జీపీ కార్యదర్శులు చేసే పనులివే..
జీపీ కార్యదర్శులు నిత్యం గ్రామాల్లో ఉంటూ శానిటేషన్‌తోపాటు హరితహారం, పల్లెప్రగతి, ఉపాధిహామీ, ఇంకుడు గుంతలు, వర్మికంపోస్ట్‌ల షెడ్లు, రైతు కల్లాల నిర్మాణం తదితర పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన ప్రతీ పనిని ఫొటో తీసి, పీఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఫలితంగా తీవ్రంగా మానసికఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు.

రికార్డుల కస్టోడియన్‌తో తలనొప్పి..
గ్రామాల్లో రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత పనులు సక్రమంగా నిర్వహించడం లేదని ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో వారు ఆ నోటీసులకు సమాధానాలు ఇస్తూ రికార్డుల కస్టోడియన్‌ వంటి పనుల్లో తలమునకలవుతున్నారు. జీపీ కార్యదర్శులకు చెక్‌పవర్‌ లేకున్నా నిధుల దుర్వినియోగంలో రికార్డులు కస్టోడియన్‌ బాధ్యత ఉండటంతో వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. 

ముగ్గురి సస్పెన్షన్‌..
గతంలో జాబితాపూర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీగా పని చేసిన శ్రీవాణి ఎంబీ రికార్డులు లేకుండానే నిధులు డ్రా చేసేలా అవకాశం ఇచ్చారని ఆమెను సస్పెండ్‌ చేశారు. అలాగే ధర్మపురిలో పనిచేసిన చంద్రశేఖర్‌ 2018లో ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఇంటి నంబరు ఇచ్చారని, నెల రోజుల క్రితం సస్పెండ్‌ చేశారు. ధర్మపురి మండలం జైన పంచాయతీ నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి మహబూబ్‌ పాషా, సర్పంచ్, ఉపసర్పంచ్‌ సస్పెండ్‌ అయ్యారు.

చదవండి: తెలుగు అకాడమీలో రూ.64 కోట్ల గోల్‌మాల్‌.. 

మరిన్ని వార్తలు