హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి

14 Jul, 2022 17:29 IST|Sakshi
కొడుకు మహేష్‌తో రమేష్‌(ఫైల్‌)

వడమాలపేట: భార్యపై కోపంలో కొడుకుపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన ఘటనలో చికిత్స పొందుతూ కోలుకోలేక బాలుడు మృత్యువొడి చేరాడు. వివరాలివీ.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగ ఆది ఆంధ్ర వాడకు చెందిన రమేష్‌కు భార్య ఐశ్వర్యతో గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవ పడటం, విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లడం జరుగుతోంది. 

అయితే గత సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోగా ఐశ్వర్య అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులోని రమేష్‌.. ఆ కోపాన్ని కుమారుడు మహేష్‌(7)పై చూపుతూ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. రెండు రోజులుగా తిరుపతి రుయాలోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం రాత్రి కన్నుమూశాడు.

కన్న తండ్రే ఇంతటి ఘాతుకానికి పాల్పడినా.. ఆసుపత్రిలో చివరి శ్వాస వరకు నాన్నను చూడాలని కోరడం, ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచిన తీరు హృదయ విదారకం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అనుమానం పెనుభూతమై ఆ కుటుంబంలో రగిల్చిన చిచ్చు ఆ ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారినే బలితీసుకోవడం శోచనీయం.

మరిన్ని వార్తలు