‘పోలీస్ అంకుల్ మా అమ్మే నాన్న‌ను క‌త్తితో పొడిచింది’

3 Jun, 2021 09:11 IST|Sakshi

ప్రియుడి మోజులో భ‌ర్త‌ను చంపిన భార్య‌

భ‌ర్త‌ను ముక్క‌లుగా న‌రికి ఇంట్లోనే పూడ్చి పెట్టి

ముంబై: పో‘‘పోలీస్ అంకుల్.. పోలీస్ అంకుల్ మా అమ్మ‌, ఎవరో ఒక అంకులు క‌ల‌సి మా నాన్న‌ని క‌త్తితో పొడిచారంటూ ఆరేళ్ల చిన్నారి అమాయకంగా చెప్ప‌డంతో పోలీసులు చ‌లించిపోయారు. చిన్నారి చెప్పిన వివ‌రాల ఆధారంగా నిందితురాల్ని పోలీసులు క‌ట‌కటాల్లోకి నెట్టారు. ముంబై పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. ఉత్త‌రప్ర‌దేశ్ గోండా జిల్లాకు చెందిన భార్య భ‌ర్త‌లు షాహిదా షేక్‌, రీస్ షేక్‌. వాళ్లిద్ద‌రికి ఆరేళ్లు కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే  ఉపాధి నిమిత్తం కుటుంబంతో క‌లిసి ముంబైకి వ‌చ్చిన భ‌ర్త రీస్ షేక్.. ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. అదే స‌మ‌యంలో భార్య షాహిదా షేక్ ఇంటి ప‌క్క‌నే ఉన్న అమిత్ మిశ్రాతో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. 

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన షాహిదా.. భర్తను ప్రియుడితో కలిసి ఆరేళ్లు కుమార్తె ఎదుట అత్యంత కిరాతంగా హత్య చేసి, ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే పూడ్చిపెట్టింది. అనంత‌రం త‌న భ‌ర్త క‌నిపించ‌డం లేదంటూ  దహిసర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమె రీస్‌షేక్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో రీస్‌షేక్‌ సోద‌రుడు త‌న వ‌దిన తీరుపై అనుమానం వ్య‌క్తం చేశాడు.

తన అన్న అదృశ్యంలో వ‌దిన పాత్ర ఉందని, అన్న గురించి అడుగుతుంటే ఆమె పొంత‌న‌లేని స‌మాధానాలు చెబుతోందని ద‌హిస‌ర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షాహిదాను అదుపులోకి తీసుకొని ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఆరేళ్ల కుమార్తెతో మాట్లాడిన పోలీసుల‌కు విస్తుపోయే విష‌యాలు తెలిశాయి.

‘పోలీస్ అంకుల్.. మా నాన్న‌ను మా అమ్మ‌  ఆ తీగ‌తో మెడ‌కు చుట్టేసింది. ఆ త‌ర్వాత క‌త్తితో పొడిచింది. ఎవ‌రికైనా చెబితే మా నాన్న‌కి చేసినట్లుగానే నాక్కూడా చేస్తానంది’ అని చిన్నారి పోలీసులకు అమాయకంగా తెలిపాడు. దీంతో పోలీసులు చిన్నారి చెప్పిన వివ‌రాల ఆధారంగా ఇంట్లో మృతి చెందిన రీస్ షేక్ శ‌రీర భాగాల్ని వెలికి తీశారు. హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితురాలైన రీస్‌ షేక్‌ భార్య‌ షాహిదా,  ఆమె ప్రియుడు అమిత్ మిశ్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ హత్యకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసున్నామని పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్‌రేప్‌ నిందితుడు

మరిన్ని వార్తలు