బ్యాంకుల వద్ద మహిళలకు టోకరా

19 Nov, 2023 01:40 IST|Sakshi
విలేకర్లకు వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రజని

నిందితుడి అరెస్టు

రూ.10 లక్షల నగదు స్వాధీనం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బ్యాంకుల్లో డబ్బులు కట్టడానికి వచ్చిన అమాయక మహిళలతో పరిచయం చేసుకుని, వారు తెచ్చిన డబ్బులు కడతానని చెప్పి, నకిలీ రశీదులు ఇచ్చి, మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దిశ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ ఎం.రజని ఈ వివరాలు తెలిపారు. కొవ్వూరు మండలం పశివేదల ప్రాంతానికి చెందిన షేక్‌ నాగూర్‌ మీరావలి అనే వ్యక్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బ్యాంకుల్లో సొమ్ములు కట్టేందుకు వచ్చిన మహిళల వద్దకు వచ్చి బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకునేవాడు. బ్యాంకులో వేసేందుకు తెచ్చిన డబ్బు తీసుకుని, తాను కడతానని వారిని నమ్మించి కట్టకుండా వారికి దొంగ రశీదు ఇచ్చేవాడు. తర్వాత ఆ డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవాడు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ అమాయక మహిళలను ఎంచుకుని తాను మున్సిపల్‌ ఆఫీసులో పని చేస్తానని, ప్రభుత్వం ఇచ్చే టిడ్కో ఇళ్లను తక్కువ రేటుకు ఇప్పిస్తానని చెప్పేవాడు. దానికి ఖర్చవుతుందని నమ్మించి, వారి వద్ద డబ్బులు తీసుకుని, ఇళ్లు ఇప్పించకుండా తిరుగుతున్నాడు. షేక్‌ నాగూర్‌ మీరావలి మోసాలపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ ఆదేశాల మేరకు నిందితుడిని పట్టుకునేందుకు సౌత్‌ జోన్‌ డీఎస్పీ కె.శ్రీనివాసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కొవ్వూరు సీఐ వీఎన్‌ఎన్‌ వర్మ, టూటౌన్‌ సీఐ టి.గణేష్‌, కొవ్వూరు క్రైం సీఐ పి.రవీంద్రబాబు, పోలీసు బృందాలు నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ వెనుక ఉన్న ఓరుగంటి వారి వీధి వద్ద షేక్‌ నాగూర్‌ మీరావలిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సుమారు పదమూడేళ్లుగా నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పలు నేరాలు చేసి, జైలుకు వెళ్లి వచ్చాడని ఏఎస్పీ రజని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంతో ప్రతిభ చూపిన టూటౌన్‌ సీఐ గణే్‌ష్‌, పోలీసు బృందాలను ఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు