ఎడతెగని వానలు

14 Oct, 2020 01:05 IST|Sakshi

వర్షాలు తగ్గి కాస్త తెరిపిన పడ్డామని అందరూ అనుకునేలోగానే మళ్లీ కుండపోత తప్పకపోవడం ఈసారి వానా కాలం సీజన్‌ ప్రత్యేకత. నైరుతి రుతుపవనాలు తమ వంతుగా కుమ్మరించి వెళ్లాయో లేదో... ఈశాన్య రుతుపవనాలు జోరందుకున్నాయి. ఈసారి ఈశాన్య రుతుపవనాలు సాధారణం గానే వుండొచ్చని దక్షిణాసియా వాతావరణ ఫోరం గత నెలాఖరున ప్రకటించింది. కానీ అందుకు భిన్నంగా వానలు మోతమోగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయు గుండంగా మారి మంగళవారం తీరం దాటడంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఏకధాటిగా పడుతున్నాయి. సాధారణ ప్రజానీకాన్ని కలవర పెడుతున్నాయి. రిజర్వాయ ర్లన్నీ నిండి...వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అన్నీ కళకళల్లాడుతున్న తీరు బాగున్నా... సాధారణ జనజీవనం మాత్రం అస్తవ్యస్తమవుతోంది. మానవ తప్పిదాల కారణంగానే వాతావరణ స్థితిగతులు ఇలా మారిపోతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

గత మూడేళ్లుగా కురు స్తున్న వర్షాలు చూస్తే ఇంచుమించు ప్రతిసారీ 20 సెంటీమీటర్ల వర్షపాతం పడటం గమనించదగ్గ అంశం. 1891– 2017 మధ్య ఏటా సగటున అయిదు తుపానులు ఏర్పడితే... 2018లో ఏడు, 2019లో 8 చొప్పున వచ్చాయి. అరేబియా సముద్రంలో అయితే నిరుడు అయిదు తుపానులు ఏర్ప డ్డాయి. దాదాపు అన్నీ పెను తుపానులే. 1902 నుంచి అక్కడ సగటున ఏటా ఒకటి మాత్రమే వచ్చేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుపానుల తీవ్రత సైతం గతంతో పోలిస్తే ఎంతో ఎక్కువైంది. గత నెల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎర్త్‌ సైన్స్‌ విభాగాన్ని కూడా చూస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ చెప్పిన జవాబు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈమధ్య ప్రతి ఏటా అంతక్రితంతో పోలిస్తే భారీ వర్షాలే ఉంటున్నాయని గణాంకసహితంగా వివరించారు. కనుక భారీవర్షాలే ఇక రివాజుగా మారతాయన్న అంచనాకు రావొచ్చు. 

ప్రకృతి వైపరీత్యాలను మనం నివారించలేకపోవచ్చు. కానీ వాటివల్ల కలిగే నష్టాలను కనిష్ట స్థాయికి తీసుకెళ్లగలం. సాంకేతికత బాగా పెరిగిన వర్తమానంలో అది తరచు రుజువవుతూనే వుంది. మూడువైపులా సముద్ర జలాలు ఆవరించివున్న మన దేశానికి అల్పపీడనాలు,  వాయు గుండాలు, తుపానులు తప్పవు. వర్షాలు ఎక్కడెక్కడ పడతాయో, వాటి తీవ్రత ఏవిధంగా వుంటుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమో అన్ని రకాల మాధ్యమాల ద్వారా ప్రజలకు సత్వరం సమాచారం అందుతోంది. ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటు న్నాయి. ఎక్కడెక్కడ సహాయ చర్యలు అవసరమవుతాయో అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా సిబ్బందిని సంసిద్ధం చేస్తున్నాయి. కనుకనే గతంతో పోలిస్తే ప్రాణనష్టం బాగా తగ్గింది. అయితే వర్షాలు పడినప్పుడల్లా నగరాలు నదుల్ని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగి అక్కడుండే పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వస్తున్నది. రోడ్లు సరేసరి.

అవి గుంతలు పడి, మ్యాన్‌హోళ్లు సక్రమంగా లేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాతావరణ మార్పులకు ప్రకృతి వైపరీత్యాలను కారణంగా చూపినంత మాత్రాన వాటివల్ల కలుగుతున్న నష్టా నికి మన బాధ్యతను విస్మరించలేం. మన దేశంలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ, సక్రమమైన రీతిలో జనావాసాల నిర్మాణం లేని కారణంగా కుంభవృష్టితో వచ్చే సమస్యలు ఇంతకింతా పెరుగుతున్నాయి. చాలా నగరాలు ఒకనాటి చిన్న చిన్న జనావాసాల కలయికతో ఏర్పడినవే. అప్పట్లో ఆ జనావాసాల అవసరాలకు అనుగుణంగా వుండే చెరువులు, కుంటలు నగరాలు ఏర్పడే క్రమంలో మాయమయ్యాయి. వాటన్నిటినీ పూడ్చి నిర్మాణాలకు వినియోగించుకునే తీరు క్రమేపీ పెరిగింది. కనుకనే వానాకాలంలో ఆ నీరంతా ఎటూపోయే దారిలేక జనావాసాల్లోకి చొరబడుతోంది. పట్టణీ కరణ, నగరీకరణ మన దేశంలో పాలకుల వైఫల్యాలకు నిదర్శనగా మారుతున్నాయి. ఉపాధి కల్ప నకు తోడ్పడే కేంద్రాలన్నీ నగరాలు, పట్టణాల్లోనే వుండటంతో ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం అందరూ వాటికే వలసపోవలసి వస్తోంది. దాంతో అవి జనంతో కిక్కిరిసి క్రమేపీ ఇరుగ్గా మారు తున్నాయి. భూముల ధరలకు రెక్కలొచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బ్రహ్మాండంగా పెరుగుతుండొచ్చు. కానీ వలసవస్తున్న లక్షలాదిమంది అవసరాలకు అను గుణంగాఉండటం లేదు. డ్రెయినేజీ సదుపాయం మొదలుకొని ఏదీ సరిగ్గా లేక సమస్యలబారిన పడుతున్నాయి.

 ప్రణాళిక అంటే వర్తమానాన్ని గమ్యరహితంగా మార్చడం కాదు...భవిష్యత్తును వర్తమానం లోకి తీసుకురావడమని అమెరికన్‌ రచయిత అలెన్‌ లెకిన్‌ అంటారు. చాలాముందు చూపుతో యోచించి అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నప్పుడే నగరాలు మెరుగ్గా వుంటాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలున్నచోట వాటికి సంబంధించిన కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నిబంధనలు వంటివి పరిగణనలోకి తీసుకుని నగరాల్లోని నిర్మాణాలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు సీఎంగా వున్నప్పుడు కృష్ణా కరకట్టపై జరిగిన అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోవా ల్సింది పోయి, తానే స్వయంగా అందులో ఒకటి ఆక్రమించుకుని నివాసమున్నారు. పైపెచ్చు తానే ప్రజావేదిక పేరిట ఒక భవనాన్ని నిర్మించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆ భవంతిని కూలిస్తే బాబు నానా హడావుడీ చేశారు. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా అమరావతి, ప్రత్యేకించి  కరకట్ట ప్రాంతం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో వున్నాయో అందరికీ కనబడుతూనే వుంది. భారీగా వరద నీరు వచ్చిచేరే అవకాశం కనబడటంతో బాబు నివాసంతోసహా కరకట్ట ప్రాంత వాసులంతా ఖాళీ చేసి వెళ్లాలని ప్రభుత్వం నోటీసులు ఇవ్వాల్సివచ్చింది. రాను రాను మన దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం వుంది గనుక పాలకులు అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఆలోచించాలి.  

మరిన్ని వార్తలు