పనికొచ్చే చర్చలేనా?!

18 Nov, 2023 00:26 IST|Sakshi

ఎటుచూసినా ఘర్షణలు, బెదిరింపులే రివాజుగా మారిన ప్రపంచంలో... ఏడాదిగా మాటా మంతీ లేని రెండు పెద్ద దేశాలు ఒకచోట కూర్చుని చర్చించుకున్నాయంటే కాస్త వింతగానే అనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బుధవారం కాలిఫోర్నియాలో ద్వైపాక్షిక చర్చలు జరగటం, అందులో పురోగతి సాధించామని ఇద్దరూ చెప్పటం ఉపశమనం కలిగించే పరిణామమే. ఉపశమనం మాట అటుంచి ఇద్దరూ కలవటమే ఇప్పుడు పెద్ద వార్త. అంతకు మించి ఎవరూ పెద్దగా ఆశించలేదు. ఇరు దేశాల విభేదాలతో పోలిస్తే సాధించింది అతి స్వల్పం. 

వర్తమాన ఉద్రిక్త పరిస్థితుల్లో ఎంతోకొంత సాధించామని చెప్పుకోవటం బైడెన్, జిన్‌పింగ్‌లిద్దరికీ అవసరం. రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య దాదాపు రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. కనుచూపు మేరలో అది చల్లారేలా లేదు. ఈలోగా గత నెలలో హమాస్‌ సాగించిన నరమేథంతో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఇప్పటికి దాదాపు 12,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏకపక్ష దాడులకు స్వస్తి చెప్పాలన్న వినతులను ఇజ్రాయెల్‌ బేఖాతరు చేస్తోంది. 

పర్యవ సానంగా పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది. ఈ రెండుచోట్లా కీలకపాత్ర పోషిస్తున్న రష్యా, ఇరాన్‌లను ఎలా ఎదుర్కొనాలో తెలియని అయోమయంలో అమెరికా వుంది. జో బైడెన్‌కు వచ్చే ఏడాది దేశాధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలన్న ఆరాటంలో వున్నారు. అటు జిన్‌పింగ్‌కు సమస్యలు తక్కువేం లేవు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగాక విదేశీ పెట్టుబడులు తరిగిపోయాయి. దశాబ్దాలపాటు ఎడతెగకుండా సాగిన ఆర్థిక పురోగతి మందగించింది. 

మితిమీరిన రుణభారంతో, రియలెస్టేట్‌ కుప్పకూలడంతో, ఎగుమతులు దిగజారటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే అమెరికా విధించిన ఆంక్షలు మరింత పెరగకుండా చూడటం, సాంకేతికత విక్రయంపై ఆ దేశం మరిన్ని ఆంక్షలు పెట్టకుండా చూసు కోవటం చైనాకు తక్షణావసరం. వివాదాలకు ఎక్కడో ఒకచోట ముగింపు లేకపోతే చైనా మరింత గడ్డుస్థితిలో పడుతుంది. నిజానికి దాన్ని దృష్టిలో వుంచుకునే ‘దుందుడుకు దౌత్యం’లో సిద్ధహస్తులైన చైనా విదేశాంగమంత్రి కిన్‌ గాంగ్, రక్షణమంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫూలను హఠాత్తుగా తప్పించింది. వారిద్దరి ఆచూకీ ఇప్పటికైతే తెలియదు.

ఆ దేశాల అంతర్గత సమస్యలు, ఆ రెండింటిమధ్యా వున్న వివాదాల మాటెలావున్నా ఇప్పుడున్న అనిశ్చితిలో అమెరికా, చైనా రెండూ ముఖాముఖి చర్చించుకోవటం ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకంటే ఆ రెండింటి మధ్యా తలెత్తే యుద్ధం అన్ని దేశాలకూ పెనుముప్పుగా పరిణమిస్తుంది. ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులవుతాయి. నాలుగు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం బైడెన్, జిన్‌పింగ్‌లిద్దరూ సైనిక ఉద్రిక్తతలు తలెత్తిన పక్షంలో నేరుగా సంభాషించుకునే సదుపాయాన్ని పునరుద్ధరించుకోవటానికి అంగీకరించినట్టు ప్రకటించారు. అప్పటి ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ నిరుడు తైవాన్‌ పర్యటించటాన్ని ఖండిస్తూ చైనా దీనికి స్వస్తిపలికింది. ఇది చెప్పుకోదగ్గ పురోగతే. 

అలాగే పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేయాలనుకోవటం, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో సమష్టిగా కృషి చేయాలనుకోవటం కూడా మంచిదే. అమెరికా, చైనా రెండూ ప్రపంచాన్ని కాలుష్యం బారిన పడేస్తున్న దేశాల జాబితాలో ఒకటి, రెండు స్థానాల్లో వున్నాయి. కాలుష్యంలో ఇద్దరి వాటా 38 శాతంగా వుంది. పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌ మించకుండా చూడాలన్నది పారిస్‌ ఒప్పందం సారాంశం. మప్పు ముంచు కొస్తున్నా రెండు దేశాలూ అవతలి పక్షం అమలు చేశాకే ముందుకు కదులుతామని మొండికేయటంతో ఎలాంటి పురోగతీ లేకుండా పోయింది. 

ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగాయి. భూగోళం నలుమూలలా కార్చిచ్చులు, కరువులు, వరదలు వంటి వైపరీత్యాలు తలెత్తు తున్నాయి. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారిస్తామనటం మంచిదే. అయితే కొత్తగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు స్థాపించి మరో 366 గిగావాట్ల విద్యుదుత్పాదన కు చైనా వేసుకున్న ప్రణాళికల మాటేమిటి? దాన్ని రద్దు చేయటానికి ఆ దేశం అంగీకరించిందా? ఆ ఊసే లేనప్పుడు ఇలాంటి కంటితుడుపు ప్రకటనలవల్ల ఒరిగేదేమిటి? 

కృత్రిమ మేధకు సంబంధించిన సాంకేతికతల విషయంలో పారదర్శకంగా వుండాలని, పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాల అధినేతలూ నిర్ణయించారు. కృత్రిమ మేధను సైనిక ప్రయోజనాల కోసం వినియోగించటం మొదలు పెడితే దాని పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. దేశాలమధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే ప్రమాదం వుంటుంది. అయితే ఈ అంశాలన్నిటిపైనా ఒప్పందాలేమీ లేవు. కేవలం నోటి మాటలే. వాటికి మున్ముందు రెండు దేశాలూ ఏపాటి విలువిస్తాయో తెలియదు. 

సమావేశానంతరం విడివిడి ప్రకటనలతో సరి పెట్టుకోవటం, కొన్ని  గంటలు గడిచాక జిన్‌పింగ్‌ను ఉద్దేశించి ‘ఆయనొక నియంత’ అంటూ బైడెన్‌ వ్యాఖ్యానించటం, దానికి చైనా విదేశాంగ ప్రతినిధి అభ్యంతరం తెలపటం వాస్తవస్థితికి అద్దం పడు తోంది. తైవాన్, ఫిలిప్పీన్స్‌లతో చైనా లడాయి సరేసరి. తైవాన్‌కు 10,600 కోట్ల డాలర్ల సైనిక సాయం అందించటానికి సంబంధించిన తీర్మానం అమెరికన్‌ కాంగ్రెస్‌లో పెండింగ్‌లో వుంది. అది సాకారమైతే చైనాతో సంబంధాలు మొదటికొస్తాయి. ఇన్ని అవాంతరాలున్నా అధినేతలిద్దరూ ముఖా ముఖీ మాట్లాడుకోవటం మంచిదే. ఇది ఉద్రిక్తతల ఉపశమనానికి తోడ్పడాలని ఆశించాలి.

మరిన్ని వార్తలు