Asian Games 2023: పతకాల శతకం

11 Oct, 2023 00:38 IST|Sakshi

కోరినది నెరవేరింది. అనుకున్నట్టే... ఆశించినట్టే... ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశం పతకాల శతకం పండించింది. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 19వ ఏషియన్‌ గేమ్స్‌లో 655 మంది సభ్యుల భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు గెలిచింది. మునుపు 2018లో జకార్తా ఏషియన్‌ గేమ్స్‌లో సాధించిన 70 పతకాల రికార్డును తిరగరాసింది.

ఆసియా క్రీడల పతకాల వేటలో మూడంకెల స్కోరుకు మన దేశం చేరడం ఇదే ప్రప్రథమం. శతాధిక పతకాల సాధనలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే చైనా, జపాన్, దక్షిణ కొరియాల సరసన అగ్ర శ్రేణి క్రీడాదేశంగా మనం కూడా స్థానం సంపాదించడం గర్వకారణం. ఈ క్రమంలో అతి సామాన్య స్థాయి నుంచొచ్చి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన మనవాళ్ళ కథలు స్ఫూర్తిదాయకం.

ఈ క్రీడోత్సవాల్లో 201 స్వర్ణాలతో సహా మొత్తం 383 పతకాలతో తిరుగులేని ప్రథమ స్థానంలో చైనా నిలిచింది. 188 మెడల్స్‌తో జపాన్, 190తో దక్షిణ కొరియా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా 2021లో జరిగిన టోక్యో–2020 వేసవి ఒలింపిక్స్‌ లోనూ చైనా, జపాన్‌లు ఇలాగే పతకాల సాధనలో రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నాయి.

ప్రపంచస్థాయి ఒలింపిక్స్‌లోనే అంతటి విజయాలు నమోదు చేసుకున్న ఆ దేశాలు ఇప్పుడు ఆసియా క్రీడోత్సవాల్లోనూ ఇలా ఆధిక్యం కనబరచడం ఆశ్చర్యమేమీ కాదు. అయితే, ఒలింపిక్స్‌ పతకాల ర్యాంకింగుల్లో ఆసియా దేశాల కన్నా వెనకాల ఎక్కడో 48వ ర్యాంకులో ఉన్న భారత్, తీరా ఏషియాడ్‌లో మాత్రం వాటన్నిటినీ వెనక్కి నెట్టి, నాలుగో ర్యాంకులోకి రావడం గణనీయమైన సాధన. 

మొత్తం 107 పతకాల్లో అత్యధిక పతకాలు (6 స్వర్ణాలతో సహా 29) మనకు అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. ఆపైన అత్యధికంగా షూటింగ్‌లో (22 మెడల్స్‌), ఆర్చరీలో (9), అలాగే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, హాకీల్లో మనవాళ్ళు ప్రపంచ శ్రేణి ప్రతిభ కనబరిచారు. హాంగ్‌జౌలోని ఈ తాజా ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశానికి మరో విశేషం ఉంది. ఈ క్రీడల పోరులో సాంప్రదాయికంగా తనకు బలమున్న హాకీ, రెజ్లింగ్, కబడ్డీ, షూటింగ్‌ లాంటి వాటిల్లోనే కాదు... అనేక ఇతర అంశాల్లో జమాజెట్టీలైన ఇతర దేశాల జట్లకు ఎదురొడ్డి భారత్‌ పతకాలు సాధించింది. పట్టున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడల్లో ప్రతిష్ఠ నిలబెట్టుకుంటూనే, ఆటల్లోని ఆసియా అగ్రరాజ్యాలను ఢీ కొని, టేబుల్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్‌ లాంటి ప్రపంచ శ్రేణి ఆటల్లోనూ పతకాలు గెలుచుకుంది. ఇది గమనార్హం. 

ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆదివారం ముగిసిన ఈ ఆసియా క్రీడా సంబరంలో మన ఆటగాళ్ళ విజయగీతిక భారత క్రీడారంగంలో అత్యంత కీలక ఘట్టం. కేవలం పతకాల గెలుపు లోనే కాక, క్రీడాజగతిలో మన వర్తమాన, భవిష్యత్‌ పయనానికీ ఇది స్పష్టమైన సూచిక. క్రీడాంగణంలోనూ మన దేశం వేగంగా దూసుకుపోతూ, రకరకాల ఆటల్లో విశ్వవిజేతల సరసన నిలవాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్న తీరుకు ఇది నిలువుటద్దం. 2018 నాటి ఏషియన్‌ గేమ్స్‌లో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్‌ ఇవాళ నాలుగో స్థానానికి ఎగబాకిందంటే, దాని వెనుక ఎందరు క్రీడాకారుల కఠోరశ్రమ, దృఢసంకల్పం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు ఆటలకు అందించిన ప్రోత్సాహమూ మరువలేనిది. 

ఆతిథ్యదేశమైన చైనా వైఖరి అనేక అంశాల్లో విమర్శల పాలైంది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్ళకు తన వీసా విధానంతో అడ్డం కొట్టి, డ్రాగన్‌ తన దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జావెలిన్‌ త్రో సహా కొన్ని అంశాల్లో చైనా అధికారిక రిఫరీలు భారత ఆటగాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసేలా విచిత్ర నిర్ణయాలు తీసుకోవడమూ వివాదాస్పదమైంది.

తొండి ఆటతో బీజింగ్‌ తన కుత్సితాన్ని బయటపెట్టుకున్నా, స్థానిక ప్రేక్షకులు ఎకసెక్కాలాడుతున్నా భారత ఆటగాళ్ళ బృందం సహనంతో, పట్టుదలతో ఈ విజయాలను మూటగట్టుకు వచ్చింది. ఆ విషయం విస్మరించలేం. అందుకే కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నా, కొందరు క్రీడాతారలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆటతీరులో నిలకడ చూపలేక పోయినా తాజా ఆసియా క్రీడోత్సవాల్లో భారత ప్రదర్శనను అభినందించి తీరాలి. వచ్చే ఏటి ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు దీన్ని ఉత్ప్రేరకంగా చూడాలి. 

మునుపటితో పోలిస్తే, క్రీడాజగత్తులో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం సంతో షకర పరిణామం. అలాగని సాధించినదానితో సంతృప్తి పడిపోతేనే ఇబ్బంది. ఇప్పటికీ జనాభాలో, అనేక ఇతర రంగాల్లో మనతో పోలిస్తే దిగువనున్న దేశాల కన్నా ఆటల్లో మనం వెనుకబడి ఉన్నాం. అది మర్చిపోరాదు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో పాటు క్రీడావ్యవస్థలోని సవాలక్ష రాజకీయాలు, పెత్తందారీ విధానాలు, క్రీడా సంఘాలను సొంత జాగీర్లుగా మార్చుకున్న నేతలు – గూండాలు మన ఆటకు నేటికీ అవరోధాలు.

మహిళా రెజ్లర్లతో దీర్ఘకాలంగా అనుచితంగా వ్యవహరిస్తున్నట్టు అధికార పార్టీ ఎంపీపై అన్ని సాక్ష్యాలూ ఉన్నా ఏమీ చేయని స్వార్థ పాలకుల దేశం మనది. అలాంటి చీకాకులు, చిక్కులు లేకుంటే మన ఆటగాళ్ళు, మరీ ముఖ్యంగా ఇన్ని ఇబ్బందుల్లోనూ పతకాల పంట పండిస్తున్న పడతులు ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో! ఏషియాడ్‌లో మనం గెల్చిన 28 స్వర్ణాల్లో 12 మాత్రమే ఒలింపిక్స్‌ క్రీడాంశాలనేది గుర్తు చేసుకుంటే చేయాల్సిన కృషి, సాధించాల్సిన పురోగతి అవగతమవుతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంతంలోని రైతు కొడుకు, ముంబయ్‌లో కూరలమ్మే వాళ్ళ కూతురు లాంటి మన ఏషియాడ్‌ పతకాల వీరుల విజయగాథలెన్నో ఆ లక్ష్యం దిశగా మనకిప్పుడు ఆశాదీపాలు! 

మరిన్ని వార్తలు