శాస్త్ర విజ్ఞానంలోనూ రాజకీయాలా?

9 Nov, 2023 00:10 IST|Sakshi

విశ్లేషణ

దేశంలో గడచిన దశాబ్దాల్లో అంతరిక్షం, అణుశక్తి, వాతావరణం వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా ఉంచారు. రాజకీయ నేతలు కూడా ఈ విషయంలో ఆరోగ్యకరమైన, స్పష్టమైన విభజనను పాటించారు. అయితే రాజకీయ మద్దతుకూ, సైన్స్ను రాజకీయం చేయడానికీ మధ్య చాలా తేడా ఉంది. శాస్త్ర పరిశోధనలకు కావాల్సినన్ని నిధులు సమకూర్చేందుకు రాజకీయ వర్గాల మద్దతు అవసరం.

దేశ విస్తృత ప్రయోజనాలు, లక్ష్యాలు, ఆర్థిక వృద్ధికీ, పరిశోధనలకూ మధ్య పొంతన కుదరాలన్నా ఇది అవసరమే. కానీ చంద్రయాన్‌ –3 విజయం 2014 తరువాతి ఘనతగా కీర్తించడం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దశాబ్దాలుగా విజయవంతంగా అనుసరిస్తున్న ప్రాజెక్టు ప్లానింగ్‌ పద్ధతులను అవమానించడమే! 

దేశంలోని చాలా శాస్త్రీయ సంస్థలు, పరిశో ధన సంస్థలు ఇటీవలి కాలంలో ‘సెల్ఫీ పాయింట్‌’లు ఏర్పాటు చేశాయి. ఇక్కడ సందర్శకులు సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ రీళ్లు, ఫేస్‌బుక్‌ స్టోరీల కాలంలో ప్రభుత్వ సంస్థలు ఇలాంటి గిమ్మిక్కులకు తెగబడటం ఎక్కువైంది. అయితే పరిశోధన సంస్థల విషయంలో ఉద్దేశం వేరు. సెల్ఫీ కేంద్రాలను ఒక నిర్దిష్ట శైలిలో నిర్మించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రతిదాంట్లో ప్రధాని ఛాయాచిత్రం ఒకపక్క, ఆ సంస్థ విజయాలు ఇంకోపక్క ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. 

ప్రాథమిక జ్ఞానం ఉన్నవారికి కూడా దీని వెనుక మతలబు ఏమిటో అర్థం అవుతుంది. ఆయా సంస్థల విజయాలు ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాలని పరోక్షంగా చెప్పే ప్రయత్నం ఇది. శాస్త్రీయ పరి శోధన సంస్థలు కూడా సులభంగా ఇందుకు అంగీకరించడం ఆశ్చర్య కరమైన విషయం కాదు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి చిన్న పోస్టర్ల స్థానంలో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేశారు. 

భారతీయ సైన్స్కు ప్రధాని దైవదూత అన్న మాదిరిగా సందేశాలివ్వడం కేవలం సెల్ఫీ పాయింట్లకే పరిమితం కాలేదు. వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా హాండిల్స్, సైంటిఫిక్‌ ల్యాబ్స్‌తోపాటు పాఠ్య పుస్తకాల్లోకీ చేరుతోంది. ‘ఎన్సీఈఆర్‌టీ’ గత నెలలో విడుదల చేసిన ‘చంద్రయాన్  ఉత్సవ’ పుస్తక శ్రేణిలోనూ ఇది కనిపించింది. పది పుస్తకాలతో కూడిన ఇవి వేర్వేరు తరగతులకు ఉద్దేశించారు.

అన్నింటి లోనూ ప్రధాన ఇతివృత్తం చంద్రయాన్ –3 విజయానికి ప్రధాన సూత్ర ధారి ప్రధాని అని చూపడమే. అది కూడా 2019 నాటి చంద్రయాన్ –2 వైఫల్యం తరువాత! సెకండరీ స్టేజ్‌ (కోడ్‌ 1.4ఎస్‌)లో ‘గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాల ఫలితంగానే చంద్రయాన్ –3 విజయం సాధించింది’ అని స్పష్టంగా చెప్పారు.

చంద్రయాన్ –2 పాక్షిక విజయంపై విశదీకరిస్తూ... ‘వనరులు, శ్రమ, డబ్బు నష్టపోయినా ప్రధాని నిరుత్సాహ పడలేదు. బదులుగా మరింత ఆత్మవిశ్వాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రజలను చైతన్యవంతులను చేశారు. సరికొత్త దార్శనికత ప్రదర్శించారు’ అని రాశారు.ఇందులో ప్రధాని ప్రస్తావన తొమ్మిది సార్లుంది. కానీ 2008లో చంద్ర యాన్ –1 ద్వారా జాబిల్లిపై నీటి ఉనికిని మొదటిసారిగా గుర్తించిన కీలకమైన విషయాన్ని మాత్రం విస్మరించారు.

ఆత్మ విశ్వాసానికి దెబ్బ...
చంద్రయాన్‌–3 విజయం 2014 తరువాతి ఘనతగా కీర్తించడం భారత్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ దశాబ్దాలుగా విజయవంతంగా అనుసరిస్తున్న ప్రాజెక్టు ప్లానింగ్‌ పద్ధతులను అవమానించడమే. ఓ ప్రాజెక్టు విజయానికి రాజకీయ నేతలను కర్తలుగా చేస్తూ పొగడటం సైన్స్ను రాజకీయం చేయడమే అవుతుంది. రాజకీయ మద్దతుకూ, సైన్స్ను రాజకీయం చేయడానికీ మధ్య చాలా తేడా ఉంది. శాస్త్ర పరిశోధనలకు కావాల్సినన్ని నిధులు సమకూర్చుకునేందుకు రాజ కీయ వర్గాల మద్దతు అవసరం.

దేశ విస్తృత ప్రయోజనాలు, లక్ష్యాలు, ఆర్థిక వృద్ధికీ, పరిశోధనలకూ మధ్య పొంతన కుదరాలన్నా ఇది అవసరమే. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా దేశ శాస్త్ర పరి శోధన రంగాల తీరుతెన్నులను పర్యవేక్షించారు. సైన్స్లో పెట్టుబడుల ఆవశ్యకత గురించి అటు ప్రజలకు, ఇటు అధికారులకు, పార్లమెంటేరియన్లకు అర్థమయ్యేందుకు కృషి చేశారు. ఇవన్నీ ఆయన వెసులు బాటు కల్పించే వాడిగా చేశారు కానీ, నేరుగా పరిశోధన కౌన్సిళ్ల వ్యవహారాల్లో తలదూర్చలేదు.

గడచిన కొన్ని దశాబ్దాల్లోనూ అంతరిక్షం, అణుశక్తి, వాతావరణం వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా ఉంచారు. రాజకీయ నేతలు కూడా ఆరోగ్యకరమైన, స్పష్టమైన విభజనను పాటించారు. శ్రీహరికోట నుంచి జరిగిన ముఖ్యమైన ప్రయోగాల్లో అప్పట్లో ప్రధాని రాజీవ్‌ గాంధీ రాజకీయంగా బద్ధ శత్రువైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావును వేదిక పైకి ఆహ్వానించిన విషయం గుర్తుచేసు కోవాలి. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా చంద్రయాన్ –1 ఆలోచన రూపుదిద్దుకుంది. కానీ పలు పార్లమెంటరీ కమిటీల్లో దీనిపై చర్చలు జరిగిన తరువాత గానీ ఆమోదించలేదు.

తన పంద్రాగస్టు ప్రసంగంలో వాజ్‌పేయి చంద్రయాన్ –1 గురించి తొలిసారి ప్రకటించారు. ఇస్రో ఈ ప్రాజెక్టుకు సోమయాన్  అని పేరు పెడితే వాజ్‌పేయి దాన్ని చంద్రయాన్  అని మార్చారు. అయితే దీన్ని ఎప్పుడూ ఆయన తన వ్యక్తిగత విజయంగా చెప్పుకోలేదు. భారత్‌– అమెరికా అణు ఒప్పందం తుది దశ చర్చల వివరాలు ప్రతిపక్షాలకూ అందించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్  సింగ్‌ తన సీనియర్‌ సలహాదారును నియమించారు. అలాగే ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులను వాతావరణ మార్పులపై జరిగే సదస్సులకు హాజరయ్యే ప్రతినిధి బృందాల్లో భాగస్వాములను చేశారు. 

జోక్యంతో ప్రమాదం...
శాస్త్ర పరిశోధనల విషయంలో రాజకీయాలు ప్రమాదకరం. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్‌ పలుమార్లు తన బాస్‌ అయిన ప్రధాని మోదీ నేతృత్వం కారణంగానే 2014 తరువాత శాస్త్ర రంగంలో అనేక విజయాలు నమోదయ్యాయని పదేపదే చెప్పుకొన్నారు. ఇదే ఇప్పుడు ఎన్సీఈఆర్‌టీ పుస్తకాల్లోనూ వ్యక్తమైంది. ఇలాంటి ప్రకటనలు ఏళ్లుగా పని చేస్తున్న శాస్త్రవేత్తల నిబద్ధతను తక్కువ చేసి చూపుతాయి. చంద్రయాన్  –1 ఆలోచనకు బీజం 1999లో పడితే వాస్తవరూపం దాల్చింది 2008లో.

దీని తరువాత చేపట్టిన ప్రయోగాలు... ఉదాహరణకు చంద్రయాన్ –3, ఆదిత్య ఎల్‌–1 కూడా 2014కు ముందే మొదలైనవి. వీటి విజయాలకు 2014 తరువాతి రాజకీయ నేతృత్వం కారణమని చెప్పుకోవడం అత్యంత కచ్చితత్వంతో ఎంతోకాలంగా విజయవంతంగా ఇస్రో అమలు చేస్తున్న ప్రాజెక్ట్‌ ప్లానింగ్, మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలను అవమానించడమే. 2014 కంటే ముందు ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యను, తరువాతి సంఖ్యను పోల్చడం కూడా సరికాదు. 2014 తరువాత ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యధికం మైక్రో శాటిలైట్ల మార్కెట్‌ పెరగడం పుణ్యంగా వచ్చినవి అని గుర్తుంచు కోవాలి. 

ఇంకో విషయం... సైన్స్ విషయాల్లో రాజకీయ జోక్యం పరిశోధన సంస్థల స్వతంత్రత తగ్గిపోయేందుకూ కారణమవుతుంది. ఇది కేంద్రీ కృత నిర్ణయాల అమలును ప్రోత్సహిస్తుంది. పరిశోధనల దిశను మారుస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఇప్పుడు కేటాయిస్తున్న నిధులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇలాంటి చర్యల వల్ల రాజకీయ సిద్ధాంతాలకు నప్పని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను తొక్కిపెట్టడం వంటివి జరగొచ్చు.

జోషీమఠ్‌కు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఇస్రో తన వెబ్‌సైట్‌ నుంచి తొలగించాల్సి రావడం గమనించాలి. సైన్స్ అవార్డులను ప్రస్తుత గవర్నమెంటు రద్దు చేసింది. గుట్టుచప్పుడు కాకుండా అనేక పరిశోధన కేంద్రాలను కూడా మూసేసింది. ఫ్యామిలీ హెల్త్‌ సర్వేల ఇన్ ఛార్జ్‌ శాస్త్రవేత్తను ఇటీవలే సస్పెండ్‌ చేసి,  రాజీనామా చేసేలా చేశారు.

జన్యుమార్పిడి పంటల విషయంలో గతంలో స్వతంత్రంగా వ్యవహరించిన ‘ద ఇండియన్  నేషనల్‌ సైన్స్‌ అకాడమీ’ కూడా ఇప్పుడు సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు సంతోషంగా అంగీకరిస్తోంది. ఎగిరే యంత్రాల విషయంలో భారతీ యుల జ్ఞానానికి డాక్యుమెంటరీ రుజువుగా వైమానిక శాస్త్రాన్ని ఎన్సీఈఆర్‌టీ ప్రస్తావిస్తే శాస్త్రవేత్తలు నోరెత్తకుండా ఉన్నారు. ఇవన్నీ సైన్స్ పురోగతికి ఏమాత్రం మేలు చేసేవి కావు.

దినేశ్‌ శర్మ 
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు