అ‘పూర్వ’గౌరవం..అంతరిక్షానికి అతిథి

4 Jul, 2021 01:45 IST|Sakshi
నాడు – పైలట్‌గా..

బండ్ల శిరీష అంతరిక్షంలోకి పయనమవగానే ఆ వెనకే మేరీ అనే మహిళ ఈ నెల 20 న స్పేస్‌ లోకి వెళుతున్నారు. జెఫ్‌ బెజోస్‌ కంపెనీ ‘బ్లూ ఆరిజిన్‌’ మేరీని గౌరవ అతిథిగా తమ తొలి వ్యోమనౌక లోకి ఎక్కిస్తోంది. 82 ఏళ్ల మేరీ అమెరికన్‌ పైలట్‌. ఆమె కెరీర్‌లో ఎన్నో ‘ఫస్ట్‌’ లు ఉన్నాయి. ఈ వయసులోనూ ఆమె భూమి మీద నడవడం కంటే ఆకాశంలో విహరించడమే ఎక్కువ! ఫ్లయిట్‌ని ఎలా నడపాలో ప్రైవేటు శిక్షణా సంస్థల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతుంటారు. తాజా స్పేస్‌ ట్రావెల్‌తో ఆమె అంతరిక్షంలోకి వెళ్లిన అతి పెద్ద వయస్కురాలిగా (స్త్రీ పురుషులిద్దరిలో) రికార్డును సాధించినట్లవుతుంది.

నేడు –  జెఫ్‌ బెజోస్‌తో మేరీ ఫంక్‌

ఇరవై రెండేళ్ల వయసులో 1961లో ‘మెర్క్యురీ 13’ అనే ప్రైవేటు స్పేస్‌ ప్రాజెక్టుకోసం నాసా ఎంపిక చేసిన వ్యోమగామిగా శిక్షణను పూర్తి చేసుకున్నారు మేరీ వాలీ ఫంక్‌. కానీ ఇంతవరకు ఆమెకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశమే రాలేదు. బహుశా తనొక రికార్డును సృష్టించడం కోసమే ఆ విశ్వాంతరాళం ఆమెను ఇన్నేళ్లపాటు వేచి ఉండేలా చేసిందేమో! తన 82 వ యేట ఈ నెల ఇరవైన ఆమె ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగ్నెట్, ప్రస్తుతం ఈ భూమండలం మీదే అత్యంత సంపన్నుడు అయిన జెఫ్‌ బెజోస్‌ కంపెనీ ‘బ్లూ ఆరిజిన్‌’ గౌరవ అతిథిగా అంతరిక్షానికి రెక్కలు కట్టుకుంటున్నారు! ఆనాడు ‘మెర్క్యురీ 13’ పేరిట వ్యోమయానానికి శిక్షణ పొందిన పదమూడు మంది మహిళ ల్లో మేరీ ఒకరు. అయితే శిక్షణ పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు పక్కన పడిపోయింది.

ఆ గ్రూపులో ఒక్కరు కూడా అంతరిక్షంలోకి వెళ్లలేకపోవడమే కాదు.. ఒక బృందంగా కూడా ఏనాడూ వారు కలుసుకోలేదు. అప్పటి మెర్క్యురీ 13 ని గుర్తు చేస్తూ జెఫ్‌ బెజాస్‌.. ‘‘మళ్లీ ఇప్పుడు మేరీ వాలీ ఫంక్‌కి ఆ అవకాశం వచ్చింది. మా గౌరవ అతిథిగా మేము ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళుతున్నాం’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. మేరీ ఫంక్‌ ఆమెరికన్‌ విమానయానానికి గుడ్‌విల్‌ అంబాసిడర్‌. అక్కడి నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డులో తొలి మహిళా ఎయిర్‌ సేఫ్టీ ఇన్వెస్టిగేటర్‌. తొలి మహిళా ఫ్లయిట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ కూడా. అలాగే అమెరికా ‘ఫెడరల్‌ ఏవియేషన్‌ ఏజెన్సీ’ తొలి మహిళా ఇన్‌స్పెక్టర్‌. మేరీ ఫంక్‌ పైలట్‌గా ఇంతవరకు 19,600 గంటలు విమానాలను నడిపించారు. ఈ నెల అంతరిక్షంలోకి బయల్దేరుతున్న ‘బ్లూ ఆరిజన్‌’ వ్యోమ నౌక ‘న్యూ షెప్పర్డ్‌ క్యాప్సూల్‌’ లో మేరీ ఫంక్‌ అంతరిక్షంలోకి వెళ్లొచ్చినట్లయితే 72 ఏళ్ల వయసులో వ్యోమయానం చేసిన దివంగత వ్యోమగామి జాన్‌ గ్లెన్‌ రికార్డును ఆమె బ్రేక్‌ చేసినట్లు అవుతుంది. న్యూ షెప్పర లో మేరీతో పాటు జెఫ్‌ బెజోస్, ఆయన సోదరుడు కూడా ఉంటారు.
 

మరిన్ని వార్తలు