Anupama Anjali: ఐఏఎస్‌ అనుపమ అంజలి సక్సెస్‌ మంత్ర ఇదే..

10 Sep, 2021 11:25 IST|Sakshi
ఐఏఎస్‌ అనుపమ అంజలి(ఫొటో: డీఎన్‌ఏ)

ఐఏఎస్‌ ఎందరికో కల. కానీ కొందరు మాత్రమే విజయతీరాలను చేరగలుగుతారు. యూపీఎస్సీ ప్రతియేటా నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు క్లియర్‌ చేయడం అంతసులువేంకాదనే విషయం మనందరికీ తెలిసిందే! అందుకు చదువుతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యం కూడా కీలకమే. ఎందుకంటే.. అభ్యర్ధులు మానసికంగా, శారీరకంగా ఎప్పుడైతే దృఢంగా ఉండగలుగుతారో ప్రిపరేషన్‌పై మరింత ఫోకస్‌ చేయగలుగుతారు. 2018 బ్యాచ్‌కి సంబంధించిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ అనుపమ అంజలి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. సివిల్స్‌ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు, సలహాలు ఇవే..

విద్యాభ్యాసం
అనుపమ అంజలి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. రెండో ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను క్లియర్‌ చేశారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా.

కుటుంబ నేపథ్యం
అనుపమ తండ్రి కూడా సివిల్‌ సర్వెంటే. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా భోపాల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 


ఫొటో కర్టెసీ: డీఎన్‌ఏ

విజయ సూత్రం ఇదే
సివిల్స్‌ ప్రిపరేషన్‌లో అభ్యర్ధులు బోర్‌గా ఫీలవడం సర్వసాధారణం. అనుపమ ఏం చెబుతున్నారంటే.. ఇటువంటి సందర్భాల్లో అభ్యర్ధులు తమని తాము పునరుత్తేజ పరచుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిపాటి విరామాలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా నూతన ఉత్సాహం నిండి, ప్రిపరేషన్‌ కొనసాగించడానికి ప్రోత్సాహకంగా ఉంటాయి. అలాగే శారీరక వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా ప్రతి అభ్యర్థికి ఎంతో ముఖ్యం. ఇది మిమ్మల్ని దృఢంగా, సానుకూలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

సెల్ఫ్‌ మోటివేషన్‌ లేదా స్వీయ ప్రేరణ
సుదీర్ఘ యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో వ్యతిరేక ఆలోచనలు రావడం సాధారణమే. అయితే అనుపమ ఏమంటారంటే..  ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్ధులు తరచుగా ఒత్తిడికి గురై, నిరాశకు లోనవ్వడం జరుగుతుంది. ఏదేమైనా పాజిటివ్‌గా ఉండటం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే ఈ విధమైన ధోరణి అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి దోహదపడుతుంది.

ప్రతికూల ఆలోచనలను అధిగమించకపోతే విజయం సాధించడం చాలా కష్టం. కాబట్టి పరీక్షలు సమర్ధవంతంగా రాయాలనుకునే అభ్యర్ధులు స్వీయ ప్రేరణను అలవరచుకోవాలి. ప్రేరణ పొందడానికి కొంత కృషి కూడా అవసరమౌతుంది. ఎందుకంటే.. మీ ప్రిపరేషన్‌ సజావుగా కొనసాగేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

సివిల్స్‌ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు
యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు అన్నిరకాల ఆటంకాలకు/ఆందోళనలకు దూరంగా ఉండాలి. ఫ్యామిలీ ఫంక్షన్లు, ఫ్రెండ్స్‌ పార్టీలకు కూడా దూరంగా ఉండాలి. అలాగే కుటుంబ బాధ్యలకు దూరంగా ఉంటే మంచిది. యూపీఎస్సీ పరీక్షలను క్లియర్‌ చేయడానికి ఈ సూచనలు ఎంతో సహాయపడతాయి.

చదవండి: Trupti Gaikwad: రెండేళ్ల కిందట అలా మొదలైంది.. పూజ తర్వాత

మరిన్ని వార్తలు