కోవిడ్‌ తర్వాత గర్భం దాలిస్తే...

16 May, 2021 07:52 IST|Sakshi

మేడం.... నాకు, నా భార్యకు కోవిడ్‌ వచ్చి తగ్గిపోయింది. ఈ ఉత్తరం మీకు రాసేటప్పటికి తగ్గిపోయి 20 రోజులైంది. దాంపత్య జీవితంలో మేం ఎప్పటి నుంచి కలుసుకోవచ్చు? మాకు ఇంకా పిల్లలు కాలేదు. కోవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత గర్భం దాలిస్తే కోవిడ్‌ చికిత్సలో మేం వాడిన మందుల ప్రభావమేమైనా పుట్టబోయే శిశువు మీద ఉంటుందా? కోవిడ్‌ చికిత్సలో భాగంగా నా భార్యకు స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. తనకు 32 ఏళ్లు. మా ఈ సందేహాలను దయచేసి నివృత్తి చేయగలరు.
– వెల్లంకి మనోహర్, మధిర

కోవిడ్‌ వైరస్‌ ప్రపంచానికి పరిచయమయి సంవత్సరంన్నర అవుతోంది. ఇప్పటికి వైరస్‌ అంతర్గతంగా మార్పిడి చేసుకుంటూ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోంది. అలాగే అది కలిగించే లక్షణాల్లో కూడా ఎన్నో మార్పులు ఉన్నాయి. కొందరు ఏ లక్షణాలు లేకుండా కూడా వైరస్‌ వ్యాప్తికి కారకులు అవుతున్నారు. ఇది శాస్త్రవేత్తలు, డాక్టర్లకు కూడా అంతుబట్టని అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం కరోనా వైరస్‌ను త్వరగా తెలుసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకున్నవారిలో దుష్పలితాలు పెద్దగా లేవు. అలాగని డాక్టర్స్‌ అందించే చికిత్స ద్వారా కూడా వందశాతం జబ్బు నయం అవుతుందనే గ్యారంటీ లేదు.

ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి వైరస్‌ కాంప్లికేషన్స్‌ ఆధారపడి ఉంటాయి. ఇక మీ విషయానికి వస్తే, కోవిడ్‌ వచ్చి ఇరవై రోజులు దాటిపోయింది. కాబట్టి నీరసం, అలసట వంటివి ఏమీ లేకపోతే దాంపత్య జీవితం కొనసాగించవచ్చు. కోవిడ్‌లో వాడిన మందుల ప్రభావం నెల దాటిన తర్వాత గర్భంపైన ఏమి ఉండదు. కాకపోతే ఆమె వయసు 32, స్టెరాయిడ్స్‌ వల్ల కొందరి శరీరతత్వాన్ని బట్టి షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులకు తిరగి సాధారణ స్థాయికి చేరుకుంటాయి. బరువు, జన్యుపరమైన కారణాల వలన కూడా కాంప్లికేషన్స్‌ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి, మీరు గర్భం కోసం ప్రయత్నం చేసే ముందు తనకి షుగర్‌ పరీక్షలు చేయించి, సాధారణ స్థాయిలోనే ఉంటే, అప్పుడు ప్రెగ్నెన్సీకీ ప్లాన్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉంటే మందులు ద్వారా అదుపులోకి తెచ్చుకొని తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేయటం మంచిది. కోవిడ్‌ వచ్చిన రెండు నెలల తర్వాత గర్భం కోసం ప్నాల్‌ చేసుకోవడం మంచిది. ఈ లోపల మానసికంగా, శారీరకంగా గర్భం కోసం సన్నిధం అవుతుంది. ఈ రెండు నెలలో ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్, మట్లీ విటమిన్‌ మాత్రలు వాడటం మంచిది. అలాగే ఫోలిక్‌ యాసిడ్‌  గర్భం వచ్చే వరుకు వాడుతూ ఉండటం మంచిది. 

డాక్టర్‌ గారూ... సెర్విక్స్‌ క్యాన్సర్‌ రాకుండా పన్నెండేళ్లు నిండిన ఆడపిల్లలకు టీకా వేయించాలి అని తెలిసింది. ఆ టైమ్‌కి రజస్వల అయినా కాకపోయినా టీకా వేయించవచ్చా? అలాగే ఈ కరోనా సమయంలో ఆ టీకా వేయిస్తే ప్రమాదమేం కాదుకదా?
– చందలూరి అచ్యుత కుమారి, తెనాలి

90 శాతం సర్వెకల్‌ క్యాన్సర్‌ హెచ్‌పీవీ వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వైరస్‌ కలయిక తర్వాత సంక్రమిస్తుంది. ఈ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ను 11 సంవత్సరాల వయసు నుంచి 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. జెనైటిక్‌ వ్యాక్సిన్‌ మాత్రం 5 నుంచి 45 సంవత్సారాల వరకు తీసుకోవచ్చు. ఇది ఎంత త్వరగా తీసుకుంటే దాని ప్రభావం అంటే వైరస్‌ వలన వచ్చే సర్వెకల్‌ క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకునే అవకాశాలు బాగా ఉంటాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలను హెచ్‌పీవీకి వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ పుష్కలంగా ఏర్పడతాయి.

ఇది రజస్వల అవ్వటానికి, ఈ ఇంజెక్షన్‌ తీసుకోవడానికి ఏ సంబంధం లేదు. రజస్వల కాకపోయినా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ వయసులో తీసుకోవడం కుదరకపోయినా కనీసం కలయికకు ఎక్స్‌పోజ్‌ లేదా పెళ్లికి ముందు అయినా తీసుకోవటం వలన చాలా వరకు క్యాన్సర్‌ నుంచి కాపాడుతుంది. అయితే ఇతర కారణాల వలన వచ్చే క్యాన్సర్‌కు ఇది పనిచేయక పోవచ్చు. ఈ వ్యాక్సిన్‌ 15 సంవత్సరాల వయసులో తీసుకుంటే రెండు డోసలు తీసుకోవాలి. కరోనా సమయంలో ఈ వ్యాక్సిన్‌తీసుకోవడం వలన ఏ ఇబ్బంది ఉండదు. ఈ వాక్సిన్‌ వలన జ్వరం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వంటివి చాలా వరకు ఉండవు.

-డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

చదవండి: డేటింగ్‌ యాప్‌లో.. బ్లడ్‌ డోనార్స్‌!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు