కరోనా సెకండ్‌ వేవ్‌: ఆడవాళ్లు ఈ ఆహారం తీసుకోవాలి!

6 Jun, 2021 09:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఈ కరోనా టైమ్‌ లో ఆహారం విషయంలో కానీ, ఇతరత్రా ఆడవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పండి మేడం....
– నూర్జహాన్, గుల్బర్గా

మన భారతదేశంలో సగటున యాభై శాతం మంది ఆడవారు భర్త, పిల్లల ఆలనపాలన చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. పనులలో నిమగ్నమై సమయానికి సరైన ఆహారం తీసుకోకుండా, మిగిలిన వారు తినగా ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా చాలామంది ఆడవారిలో 35 సంవత్సరాలు దాటేకొద్ది పీరియడ్స్, కాన్పులు, పిల్లలకు పాలు ఇవ్వడం వంటి వాటి వల్ల రక్తహీనత, విటమిన్స్, క్యాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది.

అలాగే హార్మోన్ల ప్రభావం వల్ల కూడా కొంచెం కొంచెంగా ఎముకలలో క్యాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఒళ్లు నొప్పులు, నడుం నొప్పులు, నీరసం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. రక్తహీనత ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకితే, వాటిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్ల సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని జయించాలన్నా, తిప్పికొట్టాలన్నా రోగనిరోధక శక్తి చాలా కీలకం.

ఈ సెకండ్‌వేవ్‌లో కుటుంబంలో ఒకరికి కరోనా వచ్చినా, అది కుటుంబంలోని అందరికీ వ్యాప్తి చెందుతుంది. అందులో 90 శాతం మంది సరైన జాగ్రత్తలు పాటిస్తూ, డాక్టర్ల సూచనతో మందులు వాడుతూ ఇంట్లోనే ఉంటే తగ్గిపోతుంది. ఈ సమయంలో కుటుంబంలోని అందరూ ఒకరికి ఒకరు తోడుగా ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా కలసి అన్ని పనులూ చేసుకుంటూ, ఆందోళన చెందకుండా ఉంటే కరోనాను జయించవచ్చు. పది శాతం మందికి మాత్రం ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అయినా సరే, మన దేశంలో చాలామంది ఆడవాళ్లు వాళ్లకు కూడా సమస్య ఉన్నా, మిగతావారికి విశ్రాంతినిచ్చి, వారే అన్ని పనులూ చేస్తూ, వారికి సపర్యలు చేస్తూ ఉంటారు.

ఇలాంటప్పుడు వారి ఆరోగ్యం ముందు నుంచే సరిగా ఉండి, రోగనిరోధక శక్తి బాగా ఉంటే వారికి సమస్య తీవ్రతరం కాకుండా చిన్నచిన్న లక్షణాలతో బయటపడి కరోనాను జయించవచ్చు. అలాగే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. కాబట్టి ఆడవారు ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఆహార నియమాలు పాటించడం మంచిది. పొద్దున నిద్రలేవగానే గ్లాసుడు గోరువెచ్చని మంచినీళ్లు– కావాలంటే అందులో నిమ్మకాయ పిండుకుని, తేనె కలుపుకొని తాగవచ్చు. ఉదయం తొమ్మిదిగంటల సమయానికి బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ/ దోశ/ ఉప్మా/పాలు/ఓట్స్‌/గుడ్డు వంటివి తీసుకోవచ్చు.

పదకొండు గంటలకు స్నాక్స్‌లో ఏదైనా పండు/మొలకెత్తిన గింజలు/డ్రైఫ్రూట్స్, మధ్యాహ్న భోజనంలో కొద్దిగా అన్నం/రోటీ/పప్పు/ఆకుకూర/కూరగాయలు/పెరుగు, మాంసాహారులు చికెన్‌/మటన్‌ వంటివి తీసుకోవచ్చు. సాయంత్రం 4–5 గంటలకు స్నాక్స్‌ రూపంలో కొద్దిగా మసాలా టీ/సూప్‌/ ఉడికించిన గింజలు వంటివి, రాత్రి భోజనంలో చపాతీ, ఆకుకూరలు/కూరగాయలు/ పెరుగు/రాగిజావ వంటివి, పడుకునే ముందు వేడి పాలు తాగడం మంచిది. రోజూ పది పన్నెండు గ్లాసుల మంచినీరు (రెండు లీటర్లు) తాగవలసి ఉంటుంది. ఇలా అందరూ తమకు అందుబాటులో ఉన్న పోషక పదార్థాలతో రోజును ఆరుసార్లుగా విభజించుకుని ఆహారం తీసుకోవడం మంచిది. అన్ని రకాల పండ్లు (డయాబెటిక్‌ పేషెంట్లు అరటిపళ్లు, మామిడి, సపోట తక్కువగా తీసుకోవాలి) మజ్జిగ, కొబ్బరినీళ్లలాంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

మా ఆడపడుచుకి 52 ఏళ్లు. ఈ మధ్యనే కుడి రొమ్ములో లంప్‌ ఏర్పడి, అది తర్వాత క్యాన్సర్‌ గా మారే ప్రమాదం ఉందని కుడి రొమ్ము తొలగించారు. ఇప్పుడు ఆమెకు సెర్విక్స్‌ క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది.  తొలి దశలోనే ఉంది ప్రమాదమేం లేదన్నారు. అయినా మాకు భయంగానే ఉంది. రొమ్ములో గడ్డ గర్భసంచి వరకు వ్యాపించి ఉండొచ్చంటారా? యేడాదిలోపే ఇక్కడిదాకా వచ్చింది.
– మంజుల రాణి, ఆత్మకూరు

కొందరిలో కొన్ని జన్యువులలో మార్పుల వల్ల వారి శరీర తత్వాన్ని బట్టి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటిలో రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్, అండాశయాలలో క్యాన్సర్, పేగులలో క్యాన్సర్‌ వంటివి ఉంటాయి. వీటిలో సెర్వైకల్‌ క్యాన్సర్‌ అరుదుగా ఉంటుంది. మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే రొమ్ములో గడ్డకు, సెర్వైకల్‌ క్యాన్సర్‌కు సంబంధం ఉన్నట్లు అనిపించడం లేదు. సందేహం ఉంటే రొమ్ములోని గడ్డకు సంబంధించిన బయాప్సీ రిపోర్టును, సెర్విక్స్‌ నుంచి తీసిన బయాప్సీ రిపోర్టును పరీక్ష చేసి చూడవచ్చు. సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌ నుంచి క్యాన్సర్‌ కణాలు ఊపిరితిత్తులు, లివర్, ఎముకలు, అండాశయాలకు, మెదడుకు వ్యాప్తి చెందవచ్చు. సెర్విక్స్‌కు పాకే అవకాశాలు చాలా తక్కువ.
- డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

చదవండి: 

మరిన్ని వార్తలు