అకృత్యం – దుష్కృత్యం

29 Jan, 2024 00:14 IST|Sakshi

మంచిమాట

అకృత్యం, దుష్కృత్యం అనే రెండు పదాలని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు సాధారణంగా. నిఘంటువు ననుసరించి రెండింటి మధ్య తేడా ఉన్నా  వ్యవహారంలో మాత్రం సమానార్థకాలే. నిజానికి రెండు చేయకూడని పనులే. కాని రెండింటికీ మధ్య అతిసన్నని గీత వంటి తేడా ఉంది.

కృత్యం అంటే చేయబడినది, పని అని అర్థం. అకృత్యం అనగానే వ్యతిరేకార్థం కనుక చేయబడనిది అని అర్థం చెప్పేస్తారు వ్యవహారజ్ఞానం తక్కువైన పండితులు. వ్యాకరణ రీత్యా ఆ విధంగా పదాన్ని సాధించవచ్చు. కాని దాని అర్థం మాత్రం చేయకూడని పని అని. చేయబడనిది అనే అర్థంలో అకృత్యం అనవలసి ఉంటుంది. దుష్కృత్యం అంటే చెడ్డపని. అకృత్యం అంటే చేయకూడని పని చేయటం వల్ల ఆ వ్యక్తికి నష్టం కలగ వచ్చు, కలగక పోవచ్చు. అది ఆ వ్యక్తి స్వభావాన్ని సూచిస్తుంది.  కాని, దుష్కృత్యం అంటే చెడ్డపని వల్ల వ్యక్తికి ఇతరులకి, సమాజానికి కూడా హాని కలుగుతుంది.

మానవుడు ఏ పని చేయకుండా కొద్దిసేపైనా ఉండలేడు. ఏమీ చేయటం లేదు అన్న వ్యక్తి కూడా ఆ క్షణం చేయటం లేదు అనే మాటని పలికాడు కదా! అది పనేగా! గాలి పీల్చటం, మానలేదుగా. ఆహారం తినటం, నీళ్ళు తాగటం ఆపలేదే. ఇవన్నీ ప్రయత్న పూర్వకంగా చేయటం లేదు. అసంకల్పిత చర్యలుగా సాగుతుంటాయి. కనక, నేను ఏమీ చేయటం లేదు అనటానికి వీలు లేదు.

చేయటం తప్పనప్పుడు ఉపయోగ పడేది ఏదైనా చేయవచ్చు కదా! చేయాలని ఉండి, ఏం చేయాలో సరిగా తెలియక అనవసరమైన పనికిరాని పని చేయటం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా చేయక పోయినా, సాధారణంగా చేయకూడని పని వల్ల ఏదో ఒక హాని ఉంటుంది. అందుకే దానిని చెడ్డపనితో సమానంగా భావించటం జరుగుతుంది. కాని, దుష్కృత్యం అంటే, ఉద్దేశపూర్వకంగా, కావాలని ఇతరులకి హాని కలగాలని చేసే పని.

దుష్కృత్యం వెనుక దురుద్దేశం ఉంటుంది. కావాలని బాధించటానికి చేసే పని. క్రూరత్వం కాఠిన్యం ఉంటాయి. అది ఒకరకమైన మానసిక స్థితి. నలుగురు ఆనందం గా ఉంటే చూడలేక పోవటం, ఏడుస్తూ ఉంటే ఆనందించటం, ఏదైనా వ్యవస్థ సవ్యంగా నడుస్తూ ఉంటే చూడలేక పోవటం మొదలైన దుర్బుద్ధులు ఉన్నవారు చేసేవి ఈ పనులు.

నలుగురు కలిసి ఏదో వేడుక జరుపుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని చూసి ఓర్వ లేక చెడగొట్టటానికి విధ్వంసకచర్యలు చేయటం దుష్కృత్యం కాదా! అదే సామర్థ్యాన్ని, తెలివితేటలని పదిమంది సంతోషానికి ఉపయోగించవచ్చు కదా! ఒక దేశం కాని జాతి గాని పురోగమిస్తున్నప్పుడు ప్రగతి నిరోధక వ్యవహారాలు, మాటలు, ప్రచారాలు దుష్కృత్యాలే. పరాయి దేశాలపై దండయాత్రలు, దోపిడీలు, దోచుకోటాలు చేయతగిన పనులా?   

ఒకరకంగా చూస్తే ఇవి మానసిక జాడ్యాలు అని చెప్పవచ్చు. పైశాచిక, రాక్షసానందాలు. మందులతో తగ్గకపోతే శస్త్రచికిత్స తప్పదు. సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒక దానితో అదుపు చేయవలసి ఉంటుంది.

వ్యక్తిగతమైన కక్షలు, అసూయా ద్వేషాలతో చేసే హానికారకమైన పనుల నుండి, జాతి, మత విద్వేషాలతో చేసే దురాగతాల వరకు ఇటువంటివి మనకు ఎన్నో కనపడుతూ ఉంటాయి. సంఘవిద్రోహకచర్యలు, హత్యలు, అత్యాచారాలు మొదలైననవి అన్నీ దుష్కృత్యాలే. ఒక్కమాటలో చెప్పాలంటే పాపకృత్యాలు అని చెప్పవచ్చు. పాపం అన్న దానికి కూడా చక్కని నిర్వచనం ఇచ్చారు పెద్దలు.

‘‘..పాపాయ పరపీడనం..’’ అని. ఇతరులని బాధించటమే పాపం. అందులోనూ కావాలని బాధించటం. అనుకోకుండా తాము చేసిన పని వల్ల ఇతరులకి బాధ కలిగితే అది పొరపాటు అవుతుంది కాని, దుష్కృత్యం అవదు. దానిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది.

– డా. ఎన్‌. అనంత లక్ష్మి

whatsapp channel

మరిన్ని వార్తలు