"Kidnap And Wed": ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే!

19 Sep, 2021 13:11 IST|Sakshi

రాక్షస వివాహం.. రుక్మిణిని కృష్ణుడు పెళ్లి చేసుకున్న తీరుకు ఉదాహరణగా చెప్తారు. ఈ కథలో రుక్మిణి కూడా కృష్ణుడిని ఇష్టపడింది.. ఆమె అనుమతితోనే ఆ పెళ్లి జరిగింది. ఇండోనేషియాలోని సుంబా దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే. అమ్మాయిల ఇష్టంతో జరుగుతున్నవి కావు. అబ్బాయిలు బలవంతంగా మనువాడుతున్నవి. ఈ దురాచారం అక్కడ ‘కవిన్‌ టాంగాప్‌’ అనే పేరుతో కొనసాగుతున్నది. నచ్చిన అమ్మాయిని కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి.

అవసరమైతే తన బంధుగణంతో అమ్మాయి ఇంటి మీదకు దండయాత్రకూ వెళ్తాడు. కిడ్నాప్‌ తర్వాత పెళ్లి నుంచి తప్పించుకున్న అమ్మాయిలు చాలా అరుదు. ఒకవేళ తప్పించుకున్నా ఆ అమ్మాయికి సమాజంలో గౌరవం ఉండదు. పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి వారు తగరని వెలివేస్తారు. అవమానకరంగా చూస్తారు. ఆ భయంతో అక్కడి ఆడపిల్లలు కిడ్నాప్‌ చేసినవారినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి యువతుల్లో 28 ఏళ్ల సిట్రా ఒకరు. కానీ ఆమె కిడ్నాప్‌ నుంచి తప్పించుకుంది. ఎలా?

సుంబాలో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది సిట్రా. ఒకరోజు ఆమెను తన తండ్రి తరపు దూరపు బంధువులే కిడ్నాప్‌ చేశారు. ఏదో సమావేశం ఉంది హాజరు కావాలని నమ్మించి, బలవంతంగా కారు ఎక్కించారు. కారు వరుడు ఇంటి ముందు ఆగగానే పెద్దగా గంటలు మోగించి, మంత్రాలు చదువుతూ సిట్రాను ఇంట్లోకి లాక్కెళ్లారు. ఈ విషయాన్ని అతి కష్టం మీద తన తల్లిదండ్రులకు, సన్నిహితులకు మెసేజ్‌ చేసింది సిట్రా. ప్రేమతోనే కిడ్నాప్‌ చేశామని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు.

అయినా సిట్రా లొంగలేదు. 6 రోజులు బందీగానే ఉంది. ఆచారం ప్రకారం ఆ ఇంట్లో వాళ్లు పెట్టింది తింటే పెళ్లికి సిద్ధమైనట్లే. అందుకే సిట్రా 6 రోజుల పాటు వాళ్లు పెట్టింది ఏదీ తినలేదు. దొంగచాటుగా నీళ్లు, ఆహారం తీసుకుని తనని తాను రక్షించుకుంది. మొత్తానికి మహిళా సంఘాలు కలుగజేసుకుని.. పలు చర్చలు జరిపి ఆమెను విడిపించారు. తర్వాత తను ఇష్టపడిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది సిట్రా. ఇలా ఇప్పటి వరకూ సిట్రా సహా ముగ్గురు మాత్రమే తప్పించుకోగలిగారు.


సుంబా ప్రజల ఆచార వ్యవహారాలు

కొన్నిసార్లు ఈ ‘కవిన్‌ టాంగాప్‌’ పెద్దలు కుదుర్చిన పెళ్లిగానూ మారిపోతుందట. గత జూన్‌లో కూడా ఇలాంటి కిడ్నాప్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కఠిన చర్యలు లేకపోవడమే ఈ దురాచారానికి కారణమని.. మహిళా సంఘాలు దుమ్మెత్తిపోశాయి. దాంతో ఈ ఆచారాన్ని నిషేధించే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. 

వింత నమ్మకం
సుంబా ప్రజల ఇతర ఆచారాలూ, నమ్మకాలూ చాలా విచిత్రంగా ఉంటాయి. వీరు ‘మరపు’ అనే ప్రాచీనమతాన్ని కూడా ఆచరిస్తారు. వస్తువులకు ప్రాణం ఉందని నమ్ముతారు. నీళ్లు నుదుటిని తాకితే ఇంట్లోంచి బయటికి వెళ్లకూడదనేది వీరి విశ్వాసం. అందుకే కిడ్నాప్‌ అయిన అమ్మాయిని ఇంట్లోకి లాక్కెళ్లి తలకు నీళ్లు తాకిస్తారు. 

చదవండి: Mystery: న్యోస్‌ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు