Uttarkashi Tunnel Accident: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు

22 Nov, 2023 09:17 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోగల సొరంగంలో కూలీలు చిక్కుకుపోయి నేటికి (బుధవారం) సరిగ్గా 11 రోజులు అయ్యింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఈ సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ నేపధ్యంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు.

బాధిత కార్మికులను రక్షించేందుకు ఓన్‌జీసీ, ఎస్‌జేవీఎన్‌ఎల్‌, ఆర్వీఎన్‌ల్‌, ఎన్‌హెచ్‌డీసీఎల్‌ బృందాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశాలోని పూరీ నగరానికి చెందిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రత, రక్షణను కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. దీనికి ప్రతిగా ఇసుకతో ఒక కళాఖండాన్ని రూపొందించారు. 

సొరంగంలో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యత అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా  ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు..
 

మరిన్ని వార్తలు