ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్‌! వెడ్డింగ్‌ విత్‌ టికెట్‌!

23 Nov, 2023 09:13 IST|Sakshi

కొంతమంది ఎంతోఘనంగా జరుపుకునే తమ పెళ్లి వేడుకల వీడియోలను అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం ఇప్పటి ట్రెండ్‌గా మారింది. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిలానే సెలబ్రెటీ హోదాలేని వారు సైతం విదేశీయులకు పెళ్లి టికెట్లు అమ్మి వెడ్డింగ్‌ పర్యాటకానికి తలుపులు తెరుస్తున్నారు. 

భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే చాలా మంది విదేశీయులు ఇక్కడి సంస్కృతిని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. విదేశాలతో పోలిస్తే ఇండియాలో ఎంతో శాస్త్రోక్తంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ పెళ్లిళ్లను చూసేందుకు విదేశీయులు చాలా ఉత్సాహం చూపుతారు. పెళ్లి సంప్రదాయాలు, రకరకాల రుచికరమైన వంటకాలను టేస్ట్‌ చేసేందుకు తహ తహలాడుతుంటారు.

అందుకే ఏ మాత్రం అవకాశం చిక్కినా వెంటనే వచ్చి ఇండియాలో వాలిపోతుంటారు. ఇందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఈ అభిరుచినే మన భారతీయ జంటలు, వెడ్డింగ్‌ ప్లానర్స్‌ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్లూ నడుపుతున్నారు. వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ను టికెట్‌గా చూపిస్తూ నిశ్చితార్థం నుంచి, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా ఒక్కో వేడుకకి ఒక్కో రేటుని చెబుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారని వెడ్డింగ్‌ ప్లానర్స్‌ చెబుతున్నారు. 

జాయిన్‌ మై వెడ్డింగ్‌...
పెళ్లి చేసుకునే జంట సొంతంగా జాయిన్‌ మై వెడ్డింగ్‌ పేరుతో అకౌంట్‌ను క్రియేట్‌ చేస్తారు. ఈ వెబ్‌సైట్‌లో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరి ఫోటోలు, పెళ్లి తేదీ, ఎన్నిరోజులు వేడుకలు జరుగుతాయి.. ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు... వంటి వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. పెళ్లిలో పెట్టే భోజనం వెజ్, నాన్‌వెజ్, మందు, చిందు ఉంటే అదీ చెబుతారు. ఇవేగాక డ్రెస్‌ కోడ్, అక్కడ మాట్లాడే భాష, వేడుక జరిగే ప్రదేశం అడ్రెస్‌తోపాటు ఫోన్‌ నంబర్, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ను ఇస్తారు. విదేశీ పర్యటనలో ఉన్న వారికి ఈ పెళ్లి తేదీలు జత కుదిరితే టికెట్స్‌ బుక్‌ చేసుకుని వచ్చేసి మరీ పెళ్లి బ్యాండ్‌ బాజా, బారాత్‌లను ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఒక్కరోజుకి పన్నెండు వేలపైనే...
ఎంతో ఆడంబరంగా జరిగే మన వివాహ వేడుకలను చూడడానికి పర్యాటకులు రోజు కోసం 150 డాలర్ల టికెట్‌ను సంతోషంగా కొనేస్తున్నారు. మన రూపాయలలో పన్నెండు వేలకు పైనే. ఇక పెళ్లి పూర్తి తతంగం మొత్తం అంటే రెండు రోజులు చూడాలంటే 250 డాలర్లు చెల్లించాలి (రూ.20 వేలకుపైన). ఒకటీ, రెండూ కాదు ఐదు రోజుల పెళ్లి చూడాలంటే ప్రత్యేక వెడ్డింగ్‌ ప్యాకేజీ టికెట్‌ కొనాల్సిందే. ఇలా పదిమంది విదేశీ అతిథులు పెళ్లికి వచ్చారంటే పెళ్లిలో కొన్ని ఖర్చులకు సరిపడా డబ్బు సమకూడినట్లే! అందుకే ఎక్కువ మంది వెడ్డింగ్‌ టూరిజంపైన ఆసక్తి కనబరుస్తున్నారు.

తొలిసారి...
హంగేరియన్‌– ఆస్ట్రేలియన్‌ సంతతికి చెందిన ఒర్సి పర్కాణి తొలిసారి 2016లో ‘జాయిన్‌ మై వెడ్డింగ్‌’ పేరిట వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేసింది. అప్పుడు ఇది ఒక చిన్న స్టార్టప్‌. కానీ ఇప్పుడు ఇది ట్రెండ్‌గా మారింది. ఈ ఏడాది ఆగస్టు 19న పర్యాటక మంత్రిత్వ శాఖ వెడ్డింగ్‌ టూరిజంను ప్రారంభించింది. వెడ్డింగ్‌ టూరిజం ద్వారా భారతీయులేగాక, విదేశీయులు సైతం ఇక్కడికి వచ్చి ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగా పెళ్లి వేడుకలు జరుపుకోవచ్చని చెబుతూ వెడ్డింగ్‌ టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. బీచ్‌ వెడ్డింగ్, నేచర్‌ వెడ్డింగ్, రాయల్‌ వెడ్డింగ్, హిమాలయన్‌ వెడ్డింగ్‌ థీమ్‌ల పేరిట ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ట్రెండ్‌కు మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం బూస్టర్‌గా పనిచేసి ఇండియాలో వెడ్డింగ్‌ వ్యాపారం వృద్ధిలోకి రాబోతుంది. ఇంకెందుకాలస్యం... మీ ఇంట్లో జరిగే పెళ్లివేడుకలకు వెడ్డింగ్‌ టూరిజంను జోడించి మరింత కలర్‌పుల్‌గా జరుపుకోండి.    

సెర్మనీ గైడ్‌...
విదేశీయులను పెళ్లికి పిలవడమేగాక, వారికి అతిథి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోవడం ఈ వెడ్డింగ్‌ టూరిజం ప్రత్యేకత. వేడుక లో జరిగే ప్రతి విషయం, పర్యాటకులకు వచ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు సెర్మనీ గైడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.‘‘ప్రస్తుతం రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలలో ఈ వెడ్డింగ్‌ టూరిజం పెరుగుతోంది. రాజస్థాన్‌లోని చిన్నటౌన్లలో జరిగే వేడుకలకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. జో«ద్‌పూర్, జైపూర్, జైసల్మేర్, ఉదయ్‌పూర్‌లలో జరిగే రాయల్‌ ఇండియన్‌ వెడ్డింగ్స్‌కు డిమాండ్‌ ఇంకా ఎక్కువగా ఉంది’’ అని వెడ్డింగ్‌ ప్లానర్స్‌ చెబుతున్నారు.  

(చదవండి: ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..)

మరిన్ని వార్తలు