బౌలింగ్‌లో స్థిరత్వం.. అతనికి కోట్లు వచ్చేలా చేసింది

13 Apr, 2021 17:52 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌ ట్విటర్‌

చెన్నై: న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కైల్‌ జేమిసన్‌ను ఆర్‌సీబీ రూ. 15 కోట్లు పెట్టి కొన్న సంగతి తెలిసిందే.అతని కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా.. వేలంలో అంత ధర పలకడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జేమిసన్‌ 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌ హీరో హర్షల్‌ పటేల్‌ జేమిసన్‌ ప్రదర్శనపై స్పందించాడు. బౌలింగ్‌లో స్థిరత్వం ఉండడం అతనికి కలిసొచ్చిన అంశం అని అభిప్రాయపడ్డాడు.  

''అతను బౌలింగ్‌ వేసే సమయంలో చూపించే పట్టుదల నాకు బాగా నచ్చింది. ఒక బౌలర్‌గా 6 అడుగుల 8 అంగుళాలు ఉండడం అతనికి కలిసొచ్చింది. కొత్త బంతితో స్థిరంగా బౌన్సర్లు రాబట్టగల నైపుణ్యం అతనిలో ఉంది. అలాగే డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర వేయించుకున్న అతను మరోసారి దానిని ముంబైతో మ్యాచ్‌లో నిరూపించాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో అతను వేసిన యార్కర్‌ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. జేమిసన్‌ పవర్‌ ధాటికి కృనాల్‌ బ్యాట్‌ రెండు ముక్కలైంది. అతని బౌలింగ్‌లో ఉన్న స్థిరత్వమే ఆర్‌సీబీకి వేలంలో కోట్ల రూపాయలకు దక్కించుకునేలా చేసింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్‌ 5 వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై ఈ ఫీట్‌ చేసిన ఏకైక బౌలర్‌గా హర్షల్‌ నిలవడం విశేషం. కాగా ముంబైతో జరిగిన ఆ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ డివిలియర్స్‌ మెరుపులతో ఆఖరిబంతికి విజయాన్ని సాధించింది. కాగా ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 14న చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడనుంది.
చదవండి: ‘వారివల్లే ఆర్సీబీకి..వేలానికి ముందు రోజు జరిగింది అదే’

>
మరిన్ని వార్తలు