National Crime Records Bureau: అయినా భర్త మారలేదు

5 Dec, 2023 00:02 IST|Sakshi

రిపోర్ట్‌

ఎన్ని కథలు రాసినా..ఎన్ని సినిమాలు తీసినా..ఎన్ని చట్టాలు చేసినా హింస వల్ల భార్యాభర్తల బంధానికి ఎంత గట్టి దెబ్బ తగులుతుందో వార్తల ద్వారా నిత్యం చదువుతున్నా భర్త మాత్రం మారడం లేదు. ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ (ఎన్‌.సి.ఆర్‌.బి.) డిసెంబర్‌ 3న విడుదల చేసిన తాజా నివేదికలో భార్యల మీద భర్తల హింస 2021తో పోలిస్తే 2022లో ఇంకా పెరిగిందని తెలిపింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడే రోజున వచ్చిన ఈ నివేదిక ఎన్ని ప్రభుత్వాలు మారినా మగాణ్ణి మార్చలేకపోతున్నాయన్న కఠోర సత్యాన్ని ముందుకు తెచ్చింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న డిసెంబర్‌ 3వ తేదీన ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ (ఎన్‌.సి.ఆర్‌.బి.)  ఏటా దేశంలో జరిగే నేరాలపై ఇచ్చే వార్షిక నివేదికను 2022 సంవత్సరానికి విడుదల చేసింది. 2022లో జరిగిన అన్ని నేరాల్లో భార్యలపై భర్తలు నెరపిన హింసాత్మక చర్యల కేసులే ప్రథమ స్థానంలో నిలిచాయని ఈ నివేదిక చెప్పింది. అంటే పెద్ద చదువులు, భారీ జీతాల ఉద్యోగాలు, చట్టాలు, సంఘపరమైన మర్యాదలు... ఏవీ మగాణ్ణి మార్చలేకపోతున్నాయని అతడు రోజురోజుకూ మరింత తీసికట్టుగా తయారవుతున్నాడని ఈ నివేదిక వల్ల అర్థమవుతోంది.

తానే సర్వాధికారి అన్నట్టుగా ఇంటి యజమాని స్థానంలో ఉంటూ భార్యతో హింసాత్మకంగానే వ్యవహరిస్తున్నాడు. ‘ఇది మగ సమాజం’ అని మగవాడు భావించడమే ఇందుకు కారణం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎంత మంది స్త్రీలకు సీట్లు దక్కాయో, ఎంతమంది స్త్రీలు గెలిచారో గమనిస్తే అవును.. ఇది మగసమాజం అనుకోకుండా ఉండగలరా ఎవరైనా? కాబట్టి ఎన్నికల ఫలితాల రోజే ఈ నివేదిక వెలువడటం యాదృచ్చికం కాదు.

పిల్లలూ బాధితులే
ఈ నివేదికలో మరో బాధాకరమైన వాస్తవం ఏమిటంటే దేశంలో 2022లో స్త్రీల తర్వాత అత్యధికమైన కేసులు నమోదైనవి బాలలకు జరిగిన హానిపై నమోదైనవే. 2022లో పిల్లలపై హింసకు సంబంధించి 1,62,449 కేసులు నమోదయ్యాయి. వీటిలో సగానికి సగం కిడ్నాపులు. మిగిలినవి పోక్సో కేసులు. వీటిలో పిల్లలపై జరిగిన లైంగిక అసభ్యతతో పాటు అత్యాచారాలు కూడా ఉన్నాయి.

గమనించాల్సిన సంగతి ఏమిటంటే భార్యాభర్తల మధ్య హింస చోటు చేసుకుంటున్నప్పుడు పిల్లలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువ. లేదా తల్లిదండ్రుల తగాదాలను చూసి ఇల్లు వీడే పిల్లలు, ఇంట్లో ఉండలేక వేరే చోట ఆడుకోవడానికి వెళ్లి లైంగిక దాడులకు గురయ్యే పిల్లలు అధికంగా ఉంటారు. అంటే గృహహింస వల్ల కేవలం స్త్రీలే కాక పిల్లలు కూడా బాధితులవుతున్నారని తెలుసుకోవాలి. 2022లో స్త్రీలపై, పిల్లలపై జరిగిన నేరాల తర్వాత 60 ఏళ్లు దాటిన వృద్ధులపై ఎక్కువ నేరాలు జరిగాయి. అంటే మన దేశంలో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా హింసను ఎదుర్కొంటున్నారు.

భర్తలూ మారాలి
వివాహం అంటే స్త్రీ పురుషులు కలిసి నడవాల్సిన సమాన వేదిక అనే భావన ఇంకా పురుషుడికి ఏర్పడకపోవడమే స్త్రీలపై నేరాలకు ప్రధాన కారణం. పెళ్లి ద్వారా తనకు భార్య అనే బానిస లేదా సేవకురాలు లేదా తాను అదుపు చేయదగ్గ మనిషి అందుబాటులోకి రాబోతున్నదని పురుషుడు భావిస్తూనే ఉన్నాడు.

పైగా ‘ఇదంతా మామూలే. తాతలు తండ్రులు చేసిందే నేనూ చేస్తున్నాను’ అని తాను నమ్మడమే కాక ‘మీ నాన్న మీ తాత చేస్తున్నదే నేనూ చేస్తున్నాను’ అని భార్యతో అంటున్నాడు. ఇందుకు భార్య అభ్యంతరం పెడితే, తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే, మరొక అభిప్రాయం కలిగి ఉంటే ఆమెపై హింస జరుగుతున్నది. భర్త హింస చేయకపోతే అతని సంబంధీకులు ఇందుకు తెగబడుతున్నారు. గాయపరచడం నుంచి హత్య చేయడం వరకు ఈ దాడులు ఉంటున్నాయి.

నమోదైనవి మాత్రమే
ఎన్‌.సి.ఆర్‌.బి. ఈ నివేదికను నమోదైన కేసుల ఆధారంగానే ఇస్తుంది. మన దేశంలో ఎంతమంది భార్యలు కేసుల వరకూ వెళతారో ఊహించవచ్చు. పది శాతం స్టేషన్‌ దాకా వెళితే 90 శాతం ఇంట్లోనే ఉంటూ ఈ హింసను అనుభవిస్తుంటారు. పురుషులను మార్చడానికి సాహిత్యం, సినిమా, సామాజిక చైతన్యం ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే పురుషుడు మారకపోతే ఎలా? కాఫీ చల్లారిందని, కూర బాగలేదని, కట్నం పేరుతోనో, ఉద్యోగం చేయవద్దనో, మగ పిల్లాణ్ణి కనలేదనో, పుట్టింటికి తరచూ వెళుతోందని, అత్తింటి వారిని అసలు పట్టించుకోవడం లేదనో ఏదో ఒక నెపం వెతికి హింసకు తెగబడితే ఎలా? భర్తలూ ఆలోచించండి.
 

4,45,256 కేసులు
2022లో స్త్రీలకు జరిగిన హానిపై దేశవ్యాప్తంగా 4,45,256 కేసులు నమోదయ్యాయి. 2021 కంటే 2022లో  ఈ నేరాలు 4 శాతం పెరిగాయి. అయితే ఈ మొత్తం నాలుగున్నర లక్షల కేసుల్లో ప్రథమస్థానం వహించినవి భార్య మీద భర్త, అతని సంబంధీకులు చేసిన హింసకు సంబంధించినవే కావడం గమనార్హం. రెండవ స్థానం వహించిన కేసులు స్త్రీల కిడ్నాప్‌. మూడవ స్థానంలో నిలిచిన కేసులు స్త్రీ గౌరవానికి భంగం కలిగించే చర్యలు. నాల్గవ స్థానంలో నిలిచినవి అత్యాచారాలు. అంటే భర్త, కుటుంబ సభ్యుల సంస్కార స్థాయి మెరుగ్గా ఉండి స్త్రీని గౌరవించే విధంగా ఉంటే దాదాపు సగం కేసులు ఉండేవే కావు.

>
మరిన్ని వార్తలు