ఫ్యామిలీ వ్యాన్‌ లైఫ్‌

3 Mar, 2024 00:36 IST|Sakshi

వైరల్‌

ఒక ఎస్‌యువి ఉంటే భ్రమణకాంక్ష ఉన్న జీవిత భాగస్వామి దొరికితే ఆ వెహికల్‌నే ఇల్లుగా మార్చుకుని దేశంలోని అందమైన ప్రకృతిని చూస్తూ గడిపేయవచ్చా?
చిక్కి, కపిల్‌ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రయాణాలకు తగ్గట్టుగా మార్చుకున్న  వాహనంలో ఇలాగే తిరుగుతున్నారు. వైరల్‌ అయిన వారి ‘ఫ్యామిలీ వ్యాన్‌ లైఫ్‌’ గురించి...

తిరిగే వాళ్లు ఎలాగైనా తిరుగుతారు. కాని కొందరు స్పెషల్‌. సొంతగా క్రెటా, మహింద్రా 400, ట్రైబర్‌... లాంటి పెద్ద బండి ఉంటే దానిని కస్టమైజ్డ్‌ ఇంటీరియర్స్‌తో క్యాంపర్‌ వ్యాన్‌గా మార్చుకుని కుటుంబం మొత్తం తిరిగే బృందాలు ఇప్పుడు ఇండియాలో పెరిగాయి. క్యాంపర్‌ వ్యాన్‌ ఉంటే రిజర్వేషన్లు అక్కర్లేదు. హోటల్‌ రూమ్‌లు అవసరం లేదు. సమయానికి చేరుకోకపోతే ఫ్లయిట్‌ మిస్‌ అవుతామన్న ఆందోళనా లేదు. బండే బస. బండే ప్రయాణ సాధనం.

చిక్కి, కపిల్‌ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సొంత ఫ్యామిలీ వ్యాన్‌లో దేశమంతా తిరుగుతూ, ‘ఘుమ్మక్కడ్‌ బగ్స్‌’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌లో వీడియోలు పోస్ట్‌ చేస్తూ పాపులర్‌ అయ్యారు. వీరికి ఐదు లక్షల మంది ఫాలోయెర్స్‌ ఉన్నారు. మహింద్రా 500 వాహనం డిక్కీని వీరు పూర్తి స్థాయి కిచెన్‌గా తయారు చేయించుకున్నారు. లోపలి సీట్లను బెడ్స్‌గా మార్చుకునేలా ఆల్టర్‌ చేయించారు. ఇవి కాకుండా  హాల్ట్‌ చేసిన చోట బండి మీద టాప్‌ టెంట్‌ వేసుకుంటారు.

బండికి ఆనుకుని చేంజింగ్‌ రూమ్‌ ఫాలిథిన్‌ కవర్స్‌తో ఏర్పాటు చేసుకుంటారు. దూరంగా గుంత తవ్వి చుట్టూ పాలిథిన్‌ çకవర్స్‌తో లావెటరీ ఏర్పాటు చేసుకుంటారు. బండిలోనే గ్యాస్, వంట దినుసులు, కూరగాయలు అన్నీ పెట్టుకునే వీలుంటుంది. కపిల్‌ బండి నడిపితే ఆగిన చోటల్లా చకచకా వంట ముగిస్తుంది చిక్కి.

బయటి తిండి వల్ల ఆరోగ్యం పాడవడం ఒక్కటే కాదు.. సమయానికి తిండి దొరక్కపోతే ఇబ్బంది కనుక ఈ ఏర్పాటు. అందుకే వీరు దిగులూ చింతా లేకుండా తిరుగుతూ ఉంటారు. వీరి పాపులారిటీ చూసి మరికొన్ని కుటుంబాలు తమ క్యాంపర్‌ వ్యాన్‌లతో వీరిని కలుస్తుంటాయి. అందరూ కలిసి గ్రూప్‌ క్యాంపింగ్‌ చేసి సరదాగా వొండుకుంటూ, ప్రకృతిని చూస్తూ. అక్కడే నిద్రపోతూ హాయిగా గడిపేస్తుంటారు.

 జీవితం అంటే అందమైన ప్రయాణం. చిక్కి, కపిల్‌ వీడియోల మీద ఆదాయం గడించడమే కాదు... గ్రూప్‌ క్యాంపింగ్‌ నిర్వహిస్తూ అలా కూడా డబ్బు గడిస్తున్నారు. టెన్‌ టు ఫైవ్‌ ఆఫీసుకు వెళుతూ సంపాదించేవారు ఎక్కువ మందైతే ఇలా రోజుకో కొత్త ప్రాంతంలో గడుపుతూ సంపాదించడం భిన్నమే కదా.

whatsapp channel

మరిన్ని వార్తలు