కొత్తిమీర తాజాగా, పకోడీలు క్రిస్పీగా, క్రంచీగా: ఈ టిప్స్‌ పాటించండి! | Sakshi
Sakshi News home page

కొత్తిమీర తాజాగా, పకోడీలు క్రిస్పీగా, క్రంచీగా: ఈ టిప్స్‌ పాటించండి!

Published Thu, Feb 8 2024 11:26 AM

check these amazing tips for crispy pakodas - Sakshi

వంట చేసేటపుడు కొన్ని చిట్కాలు పాటించడమో, లేదా  కొన్ని ఇంగ్రీడియంట్స్‌  అదనంగా కలపడమో  తప్పని సరి. లేదంటే ఎంత కష్టపడి చేసిన వంట అయినా రుచిని కోల్పోతుంది.  అలాగే ముఖ్యమైన పోషకాలను  కోల్పోతాం.  లేదా ఒక్కోసారి అసలు టేస్టే లేకుండా పోతుంది.   అందుకే ఈ టిప్స్‌ ఒకసారి చూడండి.

♦ పకోడీలు మెత్తబడకుండా ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండాలంటే పావు కేజీ శనగపిండిలో గుప్పెడు మొక్కజొన్న పిండి కలపాలి.
♦  పూరీలు నూనె తక్కువ పీల్చుకుని,   పొంగి కరకరలాడాలంటే పూరీలు వత్తేటప్పుడు బియ్యప్పిండి చల్లుకోవాలి. 
♦ కూరగాయలను తొక్క తీసి, తరిగిన తర్వాత నీటిలో శుభ్రం చేస్తే అందులోని పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్‌లను నష్టపోతాం. కాబట్టి తొక్క తీయడమైనా, తరగడమైనా నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అలాగే తరిగిన వెంటనే వండాలి.  పై నియమాన్ని వంకాయలకు పాటించడం కష్టం. ఎందుకంటే తరిగిన వెంటనే నీటిలో వేయకపోతే వంకాయ ముక్కలు నల్లబడడంతోపాటు చేదుగా మారతాయి. కాబట్టి ముందుగా వంకాయలను ఉప్పు నీటిలో కడిగి ఆ తర్వాత తరిగి మళ్లీ నీటిలో వేయాలి. 
♦ యాపిల్‌ను కట్‌ చేసి, ఆ ముక్కలను ప్లేట్‌లో అమర్చి సర్వ్‌ చేసే లోపే ముక్కలు రంగు మారుతుంటాయి. కాబట్టి కట్‌ చేసిన వెంటనే ఆ ముక్కల మీద నిమ్మరసం చల్లితే ముక్కలు తాజాగా ఉంటాయి. చాకును నిమ్మరసంలో ముంచి కట్‌ చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది.
♦ కొత్తిమీరను పలుచని క్లాత్‌ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Advertisement
Advertisement