బ్లాక్‌ పెప్పర్‌ వాటర్‌ ప్రతి ఉదయం తాగారంటే.. నెలరోజుల్లోనే..

30 Sep, 2021 15:16 IST|Sakshi

మాటిమాటికీ ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటే మీ ఇమ్యునిటీ సిస్టం బలహీణంగా ఉ‍న్నట్టే! దీనికి పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి రోజూ తాగితే చాలు! ఈ పెప్పర్ వాటర్‌ని కనీసం ఒక నెలపాటు తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. పూజా కోహ్లీ చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.

రోగనిరోధకతను పెంచుతుంది
సులభ మార్గంలో రోగనిరోధకతను పెంచడంలో బ్లాక్‌ పెప్పర్ వాటర్‌ బెస్ట్‌. ఇది శరీర కణాలను పోషించి, వాటి నష్టాన్ని నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ నుంచి, సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది కూడా.

సహజ మార్గాల్లో హానికారక వ్యర్థాలను బయటికి పంపేందుకు..
గట్‌ (పేగుల) హెల్త్‌ పైనే మన పూర్తి శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మిరియాలు కలిపిన వేడి నీరు శరీరంలోని వ్యర్థాలను, రసాయనాలను పూర్తిగా బయటకు పంపివేస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, కడుపులోని పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

బరువు తగ్గేందుకు..
దీనివల్ల వనకూరే మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. బరువును అదుపులో ఉంచుతుంది. మన పూర్వికుల కాలం నుంచి నేటివరకు కూడా ఉదయం పొరకడుపున చిటికెడు నల్లమిరియాల పొడి కలిపిన నీరు తాగే అలవాటు ఆచారంగా పాటిస్తున్నారు. దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయి కాబట్టే. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అధిక క్యాలరీలు ఖర్చు అయ్యేలా ప్రేరేపిస్తుంది. తరచుగా ఈ నీళ్లు తాగడం వల్ల కేవలం ఒక నెలరోజుల్లోనే మీ శరీర బరువులో వచ్చే మార్పును స్పష్టంగా తెలియజేస్తుంది.

తేమగా ఉంచుతుంది
వేడి నీరు, నల్ల మిరియాల పొడి మిశ్రమం గట్‌ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ కణాల పోషణకు తోడ్పడటం ద్వారా ఎ‍ల్లప్పుడూ హైడ్రేటెడ్‌ గా ఉండటానికి సహాయపడుతుంది. చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేకాకుండా, రోజు మొత్తం యాక్టివ్‌ గా ఉండేందుకు ఉపకరిస్తుంది.

మలబద్ధకం నివారణకు దివ్యేషధమే
దీర్ఘకాలికంగా మలబద్దకంతో బాధపడేవారు ఈ నీటిని ప్రతిరోజూ తప్పనిసరిగా తాగాలి. ఇది మీ ప్రేగు కదలికలను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దారితీసేలా చేస్తుంది. క్రమంగా మీ సమస్య తగ్గుముఖం పట్టి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించి, కడుపును తేలిక పరుస్తుంది.

శక్తి నిస్తుంది
మీరు పెప్పర్‌ వాటర్‌ ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీవక్రియ బలం పుంజుకుని మీ శక్తి రెంట్టింపయ్యేటట్లు చేస్తుంది. అంతేకాకుండా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేసి, చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

చదవండి: అలొవెరా జ్యూస్‌తో డల్‌ స్కిన్‌కు చికిత్స..!!

మరిన్ని వార్తలు