Karthika Masam 2023: కార్తీకమాసంలో అతి ముఖ్యమైన పండుగలు ఇవే, ఇలా పూజిస్తే మహాపుణ్యం

16 Nov, 2023 10:47 IST|Sakshi

మాసాల్లో కార్తీకం..యుగాల్లో కృత యుగం..శాస్త్రాల్లో వేదం..తీర్థాల్లో గంగానదికి సమానమైనవి లేవన్నది పురాణ వచనం. అంతటి మహత్యం గల కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైది. అందుకే భక్తులు వేకువనే చన్నీటి స్నానాలు.. జప, తప నియమాలు..పూజలు.. ఉపవాసదీక్షలు చేస్తారు. కార్తీక మాస విశిష్టతపై ప్రత్యేక కథనం.

చిత్తూరు రూరల్‌: కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండడంతో ఈ నెలకు ఆ పేరు వచ్చింది. ఈ నెల శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ నేపథ్యంలో ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రి వేళల్లో వదీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నెల రోజులు శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్తుల సందడితో కిటకిటలాడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,197 దేవాలయాలున్నాయి. వీటిలో శివాలయాలు 45 వరకు ఉన్నాయి. ఈ ఆలయాల్లో కార్తిక పూజలు శ్రేష్టంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆయా ఆలయ నిర్వాహకులు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా దీపారాధన చేసేందుకు పనులు పూర్తి చేశారు.

కార్తీక స్నానం

కార్తీక మాసమంతా తెల్లవారుజామునే లేచి కృతికా నక్షత్రం అస్తమించేలోపు నది, చెరువు, కాలువల్లో కానీ, ఈ వనరులు అందుబాటులో లేకుంటే ఇంట్లో కానీ తలస్నానం చేయాలి.అప్పుడే కార్తీక స్నానం అవుతుంది. ఈ నియమంతో స్నానం చేసి, శివుడు, విష్ణువు, మరే దైవాన్ని అయినా ధ్యానించి, అర్ఘం ఇవ్వడంతో గంగానది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతాయి. సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం.

పుణ్యప్రదం.. కార్తీక దీపం

భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో దీపారాధనకే ప్రథమ స్థానం. అందుకే ఇంట్లోకానీ, శివాలయంలో కానీ ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేస్తారు. ఎవరైనా తెలిసికానీ, తెలియకుండా కానీ ఎక్కడైనా సరే దీపం పెడితే వారి పాపాలు హరిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి. దీపం, బంగారం, నవధాన్యాలు, అన్నం దానం చేస్తే సీ్త్రలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీపారాధనతో పాటు శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం, లక్షబిల్వార్చ, అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపిస్తారు.

వన భోజనం

ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అప్యాయతలను పంచుకునే అపురూప సందర్భం వనభోజనం కార్తిక మాస ప్రత్యేకం. ఐక్యత సాధనకు ఇది ఎంతో ఉపకరణం. కలిసిమెలసి మసలుకునే తత్త్వం వనభోజన సంబరాలతో అలవడుతుంది. ఈ కార్యక్రమం వనాలపై మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ భోజన సంబరంలో పూర్తి సాత్విక వంటకాలనే భుజిస్తారు.

కార్తీకం.. ఆచరణ ఇలా

  • కార్తిక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి.
  • తేలికైన ఆహారం భూజించాలి.
  • ఉల్లి, వెల్లుల్లి తినకూడదు.
  • పాలు, పండ్లు భుజించవచ్చు.
  • రాత్రి భోజనం చేయకూడదు. అబద్ధాలు, దైవదూషణ చేయకూడదు.
  • తప్పుడు పనులు చేస్తే పాపమని పురాణాలు చెబుతున్నాయి.

పుణ్యఫలం సిద్ధిస్తుంది

కార్తీక మాసంలోని ప్రతి రోజు కూడా అత్యంత శ్రేష్టమైనది. కార్తిక మాసం శివకేశవులకు చాలా ప్రీతపాత్రమైనది. తెల్లవారుజామునే ఆలయాలను దర్శించుకుని పూజలు చేయాలి. ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతులు కావాలి. ఈ నెలలో 17న నాగుల చవితి, 18న స్కంధషష్టి, 26న కార్తీకదీపం అతిముఖ్యమైన పండుగలు.

–సుధాకర్‌ గురుక్కల్‌, వేదపండితులు, చిత్తూరు

మరిన్ని వార్తలు