టపాకాయలు కాల్చొద్దు... తినండి

14 Nov, 2020 04:37 IST|Sakshi

త్రిపురలో మహిళలు వెదురు క్యాండిళ్లకు రూపకల్పన చేశారు... రాజస్థాన్‌లో మహిళలు ఆవు పేడతో ప్రమిదలు తీర్చిదిద్దారు... బెంగళూరులో ఒకామె ‘టపాకాయలు కాల్చొద్దు... తినండి’ అంటూ టపాకాయల షేపులో చాక్లెట్‌లు తయారు చేశారు. కోవిడ్‌ వేళ స్వస్థత కోసం సురక్షత కోసం మహిళలు ప్రత్యామ్నాయ దీపావళిని ప్రతిపాదిస్తున్నారు. శుభ వెలుతురుల భవిష్యత్తును ఆకాక్షిస్తున్నారు.

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ రెండు రోజుల క్రితం స్వయంగా అక్కడి స్వయం సహాయ మహిళా బృందాలు తయారు చేసిన ‘వెదురు కొవ్వుత్తు’లను తన చేతుల మీదుగా ఆవిష్కరించి ‘పర్యావరణ దీపావళి’ని ఆకాక్షించారు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలో ఉండే సెపాహిజలా జిల్లాలో స్వయం సహాయ మహిళా బృందాలు ఈసారి కోవిడ్‌ వల్ల కుంటు పడిన తమ వివిధ ఉపాధులకు ప్రత్యామ్నాయంగా వెదురు కొవ్వొత్తులను తయారు చేశారు. త్రిపురలో 21 రకాల వెదురు జాతి చెట్లు ఉన్నాయి.

అక్కడి 15 వేల హెక్టార్లను ప్రభుత్వం వెదురు వనాల వృద్ధికి వదిలి పెట్టింది. వాటిని స్వయం సహాయ బృందాలకు అందుబాటులోకి తెస్తే వారు ఈ కొత్త తరహా కొవ్వొత్తులను తయారు చేశారు. ‘వ్యర్థాలు మిగలని దీపావళి’ జరుపుకున్నప్పుడే అది పర్యావరణ స్నేహిత దీపావళి అవుతుంది. వెదురు కొవ్వొత్తులలో వ్యర్థం అంటూ మిగలదు. కొవ్వొత్తి కాలిపోయాక వెదురును వంట చెరుకుగా వాడుకోవచ్చు. వెదురు కొవ్వొత్తుల వల్ల వెదురు ఉత్పత్తులను వినిమయంలోకి తెచ్చినట్టయ్యిందని అక్కడి సి.ఎం. ప్రశంసించారు. ఒక సెట్‌ వెదురు కొవ్వొత్తులను మహిళలు రూ.240కు అమ్ముతున్నారు.


ఆవు పేడ ప్రమిదలు
ఉత్తరాదిన ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో మహిళా బృందాలు ఈసారి ఆవు పేడతో ప్రమిదలు విస్తృతంగా ఉనికిలోకి తెచ్చారు. మట్టితో తయారు చేసే ప్రమిదలతో పోలిస్తే ఆవు పేడ ప్రమిదలు తక్కువ డబ్బుకు దొరుకుతాయని వారు చెప్పారు. రాజస్తాన్‌లోని జైసల్మార్‌ వంద మహిళల బృందం కలిసి రోజుకు వెయ్యి ప్రమిదలను ఈ దీపావళి సందర్భంగా తయారు చేస్తోంది. ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఆవు పేడ ప్రమిదలకు రంగులు కూడా వేసి ఆకర్షణీయం చేస్తున్నారు. ఆ స్త్రీలకు తాము ఏమి తయారు చేస్తున్నారో తమకు తెలుసు. ‘చైనా సరుకు వల్ల కాలుష్యం.

మన ఆవు పేడ సులభంగా మన వాతావరణంలో కలిసిపోతుంది’ అని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో గోశాలలకు తోడ్పాటు కలిగేలా ‘కామధేను దివాలి అభియాన్‌’ పేరుతో స్వయం సహాయ మహిళా బృందాలు గోమయంతో  దీపావళి ఉత్పత్తులను తయారు చేసేలా ప్రోత్సాహం అందుతోంది. ఈసారి అయోధ్యలో దీపావళి సందర్భంగా గోమయ ప్రమిదలనే ఉపయోగించనున్నారు.

టపాకాయలు కాల్చొద్దు... తినండి
కాలుష్యం నేపథ్యంలో టపాకాయలు కాల్చడం గురించి కోర్టులు ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల వాయు కాలుష్యాన్ని అనుసరించి టపాకాయలను నిషేధించాయి. మరో వైపు కోవిడ్‌ శ్వాస సంబంధమైన, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే వ్యాధి. టపాకాయల కాలుష్యం కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపేదే. అందుకే ఈ సరికి టపాకాయలకు దూరంగా ఉండటమే మేలని పర్యావరణవేత్తలు, హెల్త్‌ ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు. కాని సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ దీపావళి. ముఖ్యంగా పిల్లలైనా పెద్దలైనా ప్రమాదాలు, పెద్దపెద్ద శబ్దాలు లేని తేలిక రకం దీపావళి సామాగ్రి కాల్చాలనుకుంటారు. వారి మనసు చిన్నబుచ్చకోకుండా ఉండటానికి బెంగళూరుకి చెందిన చాక్లెట్‌ తయారీదారు ప్రియా జైన్‌ అచ్చు టపాకాయలను పోలిన చాక్లెట్‌లను తయారు చేశారు.

ఇవి బెంగళూరులో ప్రస్తుతం ఫుల్లుగా జనాన్ని ఆకర్షిస్తున్నాయి. చిచ్చుబుడ్లు, ఆకాశచువ్వలు, విష్ణుచక్రాలు, భూచక్రాలు... అన్నీ చాక్లెట్లే. పైగా అవి ఒక ఫ్లేవర్‌లో కాదు. ఒక్కోటి కాలుస్తుంటే.. సారీ కొరుకుతూ ఉంటే ఒక్కో ఫ్లేవర్‌లో నోరు తీపి అవుతుంది. ‘పిల్లలు నిరుత్సాహ పడకుండా ఈ టపాకాయల చాక్లెట్లు మంచి ప్రత్యామ్నాయం. అలాగే కాలుష్యానికి కూడా’ అని వీటి రూపకర్త ప్రియా జైన్‌ అంటున్నారు. వీటి గురించి తెలుసుకున్న బెంగళూరు వాసులు డోర్‌ డెలివరీ ఉందా అని ఫోన్లు కూడా కొడుతున్నారు.

నిజానికి ఈ దీపావళి ఎన్నో కఠినమైన సమయాలను దాటుతున్న సమయాన వచ్చింది. ఎన్నో వొత్తిళ్లను, నష్టాలను, కష్టాలను ప్రపంచం, దేశం చూస్తున్న సమయాలలో వచ్చింది. ఈ చెడు అంతా ఈ దీపావళి వెలుతురులో దగ్ధమైపోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలు కోరుకుంటున్నారు. పురుషులతో పాటు స్త్రీలకూ తిరిగి ఉపాధి మెరుగు పడాలని, కుటుంబాలు స్వస్థతతో ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. నిరాశ నిస్పృహలు ఈ దీపావళి నాడు ఇంటి ముందు వెలిగే ప్రమిదల వెలుతురులో తరిమికొట్టబడాలని కోరుకుంటున్నారు.అందరి ఆకాంక్ష అదే. హ్యాపీ దీపావళి. సేఫ్‌ దీపావళి. స్వస్థ దీపావళి. – సాక్షి ఫ్యామిలీ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు