Dangerous Temple: జపాన్‌లోనే అత్యంత ప్రమాదకర ఆలయం

4 Dec, 2022 10:24 IST|Sakshi

జపాన్‌లోని టొట్టోరి ప్రాంతానికి చెందిన మిసాసా పట్టణంలో ఉన్న ఈ పురాతన బౌద్ధ ఆలయం పేరు ‘సాన్‌బుత్సుజి ఆలయం’. ఇది ‘మౌంట్‌ మిటోకు’ కొండ శిఖరం అంచున ఉంది. ఈ ఆలయంలో భాగమైన ‘నగీరెడో హాల్‌’ అయితే, కొండ శిఖరం అంచున వేలాడుతున్నట్లే ఉంటుంది. ఇది జపాన్‌లోనే అత్యంత ప్రమాదభరితమైన ఆలయం. జపాన్‌లో ఇది ‘అత్యంత ప్రమాదభరితమైన జాతీయ నిర్మాణం’గా గుర్తింపు పొందింది.

ఇక్కడకు చేరుకోవడానికి సునాయాసమైన మెట్ల మార్గమేదీ లేదు. సముద్రమట్టం నుంచి దాదాపు మూడువేల అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండ శిఖరానికి చేరుకోవాలంటే, శ్రమదమాదులకోర్చి పర్వతారోహణ చేయాల్సిందే! ఏడో శతాబ్దికి చెందిన బౌద్ధ సన్యాసి, షుగెందో మతస్థాపకుడు ఎన్‌ నో గ్యోజా హయాంలో దీని నిర్మాణం జరిగింది. ఇప్పటికీ ఇది చెక్కుచెదర కుండా ఉండటం ఒక అద్భుతం.

జపాన్‌ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించి, కాపాడుకుంటూ వస్తోంది. ఎగుడుదిగుడు రాళ్ల మీదుగా దీనిని చేరుకోవడం ఒకరకంగా సాహసకృత్యమే అని చెప్పుకోవచ్చు. శీతాకాలంలో సాధారణంగా ఈ కొండ మీద మంచు పేరుకుపోయి, అడుగు వేయడం కూడా కష్టమయ్యే పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఏటా డిసెంబర్‌ నుంచి మార్చి వరకు దీనిని పూర్తిగా మూసి వేస్తారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉన్న కాలంలో సాహసికులైన సందర్శకులు దేశ విదేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. 

మరిన్ని వార్తలు