ప్రకతి వ్యవసాయం.. ఏటీఎం మోడల్‌తో ప్రతి నెల రూ.25వేల వరకు లాభాలు

12 Sep, 2023 10:22 IST|Sakshi

‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం నిజంగానే‘ రైతును రాజు’ గా మార్చుతుందంటున్నారు ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌–చైర్మన్, ఎక్స్‌అఫీషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ టి. విజయకుమార్‌. ప్రపంచవ్యాప్తంగా రసాయనాల్లేకుండా జరుగుతున్న సాగు 1% కాగా, ఏపీలో 14% కావటం విశేషం. ఏటీఎం మోడల్‌లో 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తూ ప్రతి నెలా కనీసం రూ. 10–25 వేలు ఆదాయం పొందే మార్గం ఉంది. చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ ఇది వరం లాంటిదని ఆయన అంటున్నారు.. ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. 


సాక్షి సాగుబడి: ఆంధ్రప్రదేశ్‌లో తామర తంపరగా విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం విశేషాలు..?
విజయకుమార్‌: ఏపీలో ప్రకృతి వ్యవసాయం ప్రభుత్వ సహకారం, మహిళా సంఘాల తోడ్పాటుతో విస్తృతంగా అమలవుతోంది. 2023 మార్చి నాటికి 3,800 గ్రామ పంచాయతీలు, 3 వేల రైతు భరోసా కేంద్రాల్లో విస్తరించింది. 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో పాల్గొంటున్నారు. అంటే, ఎన్‌రోల్‌ అయ్యారు. వీరిలో 2,70,000 మంది రైతులు పూర్తిగా రసాయనాలు వాడటం మానుకున్నారు.

రైతుల ఎన్‌రోల్‌మెంట్‌ దృష్ట్యా మన దేశంలోనే ఇది అతిపెద్ద కార్యక్రమం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో పాల్గొనటం మరే దేశంలోనూ జరగటం లేదు. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తి క్రమంగా జరిగే పని. ఒక రైతుకు రెండెకరాలు ఉంటే.. ముందు అరెకరంలో ప్రయత్నిస్తారు.  ఏ రైతూ రిస్క్‌ తీసుకోరు. అరెకరాలో సక్సెస్‌ సాధిస్తే.. తర్వాత సంవత్సరం విస్తీర్ణం పెంచుతారు.

ఎంత ఖర్చయ్యింది, ఎంత దిగుబడి వచ్చింది, నికరాదాయం ఎంత వచ్చింది, భూమిలో మార్పేమి వచ్చింది.. ఇవీన్న చూసుకొని విస్తీర్ణాన్ని పెంచుకుంటారు. సగటున మా అనుభవంలో రైతులు ప్రకృతి వ్యవసాయంలో అన్ని విషయాలు అనుభవపూర్వకంగా అలవాటు చేసుకోవడానికి 4 ఏళ్లు పడుతుంది. అందుకని ఆ నాలుగేళ్లు ప్రభుత్వం తరఫున మేం వారికి మద్దతుగా నిలుస్తున్నాం. ఈ విధంగా 2,70,000 మంది రైతులు దాదాపు 1,40,000 హెక్టార్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది 3 జైవిక్‌ ఇండియా పురస్కారాలు వచ్చాయి. వీటితో పాటు.. వ్యక్తిగతంగా మీకు ‘డా. ఎమ్మెస్‌ స్వామినాధన్‌ ప్రకృతి పరిరక్షణ పురస్కారం’ లభించిన శుభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు... జైవిక్‌ ఇండియా పురస్కారాల ప్రాధాన్యం ఏమిటి?

అంతర్జాతీయంగా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ను ప్రోత్సహించే సంస్థ ‘ఐఫోమ్‌’ ఈ జైవిక్‌ ఇండియా పురస్కారాలు ఇస్తుంటుంది. ఐఫోమ్‌కు ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్‌.ఎ.ఓ., తదితర సంస్థలతో సన్నిహిత సంబంధాలుంటాయి. ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం, సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వానికి 2023లో ఉత్తమ రాష్ట్ర పురస్కారం ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా రైతుకు, ఎఫ్‌పిఓకు కూడా ఇచ్చారు.   

ప్రభుత్వప్రోత్సాహం ఎలా ఉంది..?
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో ఏపీ ప్రభుత్వానికి చాలా ప్రత్యేకతలున్నాయి. రైతు భరోసా కేంద్రాలన్నిటి పరిధిలోనూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇప్పుడు 28% రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమం అమల్లో ఉంది. మున్ముందు గ్రామాలన్నిటికీ విస్తరించాలన్నది లక్ష్యం. ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖనే సీఎం ఏర్పాటు చేయటం విశేషం. దీంతో మంచి ఊ΄÷చ్చింది. ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.  

ప్రపంచవ్యాప్తంగా  పరిస్థితి ఏమిటి..?
రీజనరేటివ్‌ అగ్రికల్చర్‌ అనండి, ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ అనండి.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటికీ చేస్తున్నది 1% మంది రైతులు మాత్రమే. అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 14% మంది రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తమకున్న పొలం మొత్తంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు 5% ఉన్నారు. అందుకే ప్రపంచంలో ఏపీ అనుభవం ఎంతో విశిష్టమైనది.

రైతులతో రసాయనాలు వాడే అలవాటు మాన్పించడం చాలా కష్టం. బలంగా ఉన్న మహిళా సంఘాల వ్యవస్థ ఇందులో పాల్గొనటం వల్ల రైతులకు క్షేత్రస్థాయిలో నైతిక మద్దతు ఇవ్వటం సాధ్యమైంది. ఈ సామాజిక తోడ్పాటు ఎంతో ఉపయోగపడుతోంది. సేద్యంలోనే కాదు, వైవిధ్యపూరితమైన ప్రకృతి పంటల దిగుబడులు కుటుంబాల ఆరోగ్యానికి చాలా అవసరమని మహిళలు గుర్తించటం కూడా ఇది వ్యాప్తి చెందడానికి ఉపయోగకరంగా ఉంది. 

ఏయే పంటల్లో అధిక దిగుబడి..?
మా అనుభవంలో అన్ని పంటల్లోనూ ఫలితాలు బాగా వస్తున్నాయి. ఖర్చు తగ్గించడం, దిగుబడి పెంచటం, ఎక్కువ వర్షాలు పడినా/ వర్షాభావ పరిస్థితులొచ్చినా పంట తట్టుకునే శక్తి, చీడపీడలను తట్టుకునే శక్తి.. చాలా పంటల్లో అనుకున్న దానికన్నా దిగుబడులు రాబట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో రాగి పంట దిగుబడి ఎకరానికి వచ్చే దిగుబడి 400–600 కిలోల నుంచి 1200–1800 కేజీలకు పెరిగింది. ఖర్చు సగానికి సగం తగ్గింది. వరిలోనూ అంతర పంటలపై ప్రయోగాలు చేస్తున్నాం. గట్ల వెడల్పును పెంచి కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేయమని.. పంటల వైవిధ్యం పెంచడానికి.. రైతులకు సలహా ఇచ్చాం.    

పవన్‌ సుఖదేవ్‌ అధ్యయనం గురించి..?
పవన్‌ సుఖదేవ్‌ అంతర్జాతీయంగా పేరున్న పర్యావరణవేత్త. పర్యావరణంలో నోబెల్‌ వంటి టేలర్‌ అవార్డు గ్రహీత. వీరి జిస్ట్‌ సంస్థ స్వతంత్రంగా జరిపిన అధ్యయనంలో 11% అధిక దిగుబడి, 54% అధిక నికరాదాయం, పంటల వైవిధ్యం రెండింతలు పెరిగిందని వెల్లడైంది.

మార్కెటింగ్‌లోకి అమూల్‌ ప్రవేశిస్తోందట..?
అవును. ఏపీలో 80% విస్తీర్ణంలో పత్తి సహా 8 రకాల ఆహార పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి. ఇప్పటికే టీటీడీ 12 రకాల ఆహారోత్పత్తుల్ని కొనుగోలు చేస్తోంది. బియ్యం, పప్పులు, వేరుశనగలు తదితరాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడానికి అమూల్‌తో ఒప్పందం చేసుకోబోతున్నాం. మండల స్థాయిలో ప్రాసెసింగ్‌ సదుపాయాలు కూడా వస్తాయి. ఇది మార్కెటింగ్‌లో పెద్ద ముందడుగు అవుతుంది.

ఏటీఎం మోడల్‌లో ఆశ్చర్యకరమైన ఫలితాలు ఎలా..?
అవునండి.. నిజం. ప్రకృతి వ్యవసాయ విధానాలను సక్రమంగా అమలు చేస్తే రైతే రాజని రుజువు చేయొచ్చు. అది నిజంగా జరుగుతుంది. రైతులకు సంవత్సరానికి ఆదాయం ఒక్కసారే ఎందుకు రావాలి? ప్రతి రోజూ రావాలి.. ప్రతి వారం రావాలి.. అందుకు ఏటీఎం మోడల్‌ ఉపయోగపడుతుంది. అనంతపురం జిల్లాలో ఈ నమూనా తొలుత ప్రయత్నించి సత్ఫలితాలు సాధించాం. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలకూ విస్తరింపజేస్తున్నాం. 85%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు పెరటి తోటలు/ ఇంటి పంటలుగా సాగుకు కూడా ఏటీఎం మోడల్‌ ఒక వరం లాంటిది. 20 సెంట్లను కౌలుకు తీసుకొనైనా సాగు చేస్తే.. ప్రతినెలా ప్రతి రైతూ రూ.10,000 నుంచి 25,000 సంపాదించే అవకాశం ఉందని మా అంచనా.  

మరిన్ని వార్తలు