BDD Disorder: అదేపనిగా అద్దంలో చూసుకుంటూ పింపుల్స్‌ గురించి ఫీల్‌ అవుతున్నారా? బీడీడీకి దారితీస్తుంది

21 Aug, 2023 10:19 IST|Sakshi

‘బేబీ... పొద్దున లేచిందగ్గర్నుంచీ అద్దం ముందేనా? త్వరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్లు’ అని అరిచింది అరవింద. ‘వెళ్తాలేమ్మా’ అని సమాధానమిచ్చింది మానవి. కానీ అద్దం ముందు నుంచి కదల్లేదు. తన మొహంపై మొటిమలు అసహ్యంగా ఉన్నాయని బాధపడుతూ కూర్చుంది. ‘బేబీ... కాలేజీ బస్‌ వచ్చిందమ్మా’ అని కేకేశాడు ఆనంద్‌. ‘వస్తున్నా డాడీ... కాస్త ఆగమని చెప్పు’ అని హడావుడిగా తయారై బస్సెక్కింది. 
∙∙ 
‘హాయ్‌... బేబీ’ అని పలకరించింది అర్పిత. ‘హాయ్‌.. అర్పీ’ ‘హేయ్‌... కరోనా పొయ్యి ఏడాదైందే. ఇంకా ఆ మాస్క్‌ ఏంటే బాబూ?’ ‘ఏం చెప్పమంటావే... మొహమంతా పింపుల్స్‌. ఎన్ని రకాల క్రీమ్స్‌ వాడినా తగ్గడంలేదు. డాక్టర్ని కలిసి మెడిసిన్స్‌ కూడా వాడా. అయినా నో రిలీఫ్‌.’ ‘హ్మ్‌... వాటి గురించి అంత ఆలోచనెందుకే బాబూ! ఆ పింపుల్స్‌తో నువ్వు సాయిపల్లవిలా కనిపిస్తున్నావ్‌ తెలుసా?’ ‘నా మొహంలే’ అని బలవంతంగా నవ్వింది మానవి. క్లాసులో కూర్చుందన్న మాటే కాని మనసంతా పింపుల్స్‌ చుట్టూనే తిరుగుతోంది. వాటివల్లనే తాను అందంగా కనిపించడంలేదని, వాటివల్లనే తనను ఎవ్వరూ చూడటం లేదని అనుకుంటోంది. ఎలాగోలా క్లాసులు పూర్తిచేసి ఇంటికి వచ్చింది. ‘బేబీ.. త్వరగా స్నాక్స్‌ తిని రెడీ అవ్వు. మావయ్య వాళ్లింట్లో ఫంక్షన్‌ ఉంది, వెళ్దాం’ అని చెప్పింది అరవింద. 

‘నువ్వెళ్లు మమ్మీ... నేను రాను.’‘అదేంటే.. అన్నిటికీ, నేను రాను, నేను రాను అంటావ్‌. నువ్వు రాకపోతే మావయ్య ఫీలవుతాడు. మీ అత్త నిష్టూరమాడుతుంది.’
‘వాళ్లతో నేను ఫోన్‌లో మాట్లాడతాలే, నువ్వెళ్లు.’‘ఏవిటో ఇది.. ఎక్కడికీ రానంటుంది’ అనుకుంటూ వెళ్లింది అరవింద. 
∙∙ 
పింపుల్స్‌ సమస్య చిన్నదే. టీనేజ్‌లో చాలామంది అనుభవించేదే. కానీ మానవికి మాత్రం అదో పే...ద్ద సమస్యగా మారింది. ఎవ్వరూ ఏమీ అనకపోయినా, దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌, సెల్ఫ్‌ ఎస్టీమ్‌ తగ్గిపోయాయి. నిత్యం ఆందోళనగా ఉంటోంది. దాన్ని అధిగమేంచేందుకు విపరీతంగా తింటోంది. దానివల్ల బరువు పెరుగుతోంది. దానివల్ల మళ్లీ ఆందోళన. ఇదో అందులేని నెగెటివ్‌ సైకిల్‌గా మారిపోయింది. పలకరిస్తే ఏడుస్తోంది. దీనికేదో అయ్యిందని అరవింద.. మానవిని కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చారు. 

లేని సమస్య గురించే ఆలోచనలు
మానవితో అరగంట మాట్లాడేసరికి... ఆమె మనసంతా మొటిమలపైనే ఉందని అర్థమైంది. మానవికి ఉన్న సమస్యను బాడీ డిస్మార్ఫిక్‌ డిజార్డర్‌ (బీడీడీ) అంటారు. అంటే శరీరంలో ఇతరులకు కనిపించని లోపం ఉందని భావిస్తూ, దాని గురించే ఆలోచిస్తూ ఉండటం. ఇదో రకమైన మానసిక రుగ్మత. ఓసీడీలో ఇదో రకం. మానవి మొటిమల గురించి ఆలోచిస్తే, ఇంకొకరు ముక్కు గురించి లేదా రంగు గురించి లేదా బరువు గురించి లేదా ముడతల గురించి లేదా వక్షస్థలం కొలత గురించి ఆలోచించవచ్చు. టీనేజ్‌ కుర్రాళ్లు జుట్టు పలచబడటం లేదా రాలిపోవడం లేదా కండలు లేకపోవడం గురించి బాధపడుతూ ఉండవచ్చు. ఈ ఆలోచనలను నియంత్రించడం కష్టం.

కారణాలు అనేకం...
బీడీడీ ఎలా, ఎందుకు వస్తుందో నిర్దిష్టంగా తెలియదు. జెనెటిక్స్‌ నుంచి కల్చర్, మీడియా వరకూ రకరకాల కారకాలు ఉంటాయి. బీడీడీ ఉన్న కుటుంబ సభ్యులుంటే ఇది వచ్చే అవకాశం మూడు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ. కల్చర్, మీడియా, మూవీస్‌ కలిసి ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. బాల్యంలో ఎవ్వరూ పట్టించుకోకపోవడం లేదా బెదిరించడం లేదా ఆటపట్టించడం లాంటివి కూడా కారణం కావచ్చు. 

బీడీడీ సంకేతాలు, లక్షణాలు
ఇతరులకు కనిపించని లేదా మైనర్‌గా అనిపించే లోపాల గురించే ఆలోచిస్తూ ఉండటం .మీ రూపాన్ని అగ్లీగా మార్చే లోపం ఉందని బలమైన నమ్మకం 
మీ రూపాన్ని ఇతరులు ఎగతాళి చేస్తారనే నమ్మకం.
తరచూ అద్దంలో చూసుకోవడం ∙స్టైలింగ్, మేకప్‌ లేదా దుస్తులతో లేని లోపాలను దాచడానికి ప్రయత్నించడం 
మీ రూపాన్ని నిరంతరం ఇతరులతో పోల్చడం ∙లోపాన్ని సరిదిద్దుకునేందుకు విస్తృతంగా కాస్మెటిక్స్‌ వాడటం ∙మీలో లోపం ఉందని, ఫంక్షన్స్‌కు వెళ్లకుండా తప్పించుకోవడం.

సైకోథెరపీతో చెక్‌ పెట్టొచ్చు
మొదటి సెషన్‌లో సైకో డయాగ్నసిస్‌ ద్వారా మానవి సమస్యను నిర్ధారణయ్యాక, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ (సీబీటీ) ద్వారా చికిత్స ప్రారంభించాను. ప్రతికూల ఆలోచనలు, ఎమోషనల్‌ రియాక్షన్స్‌, ప్రవర్తనలు సమస్యకు ఎలా కారణమవుతాయో తెలుసుకోవడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పింపుల్స్‌ గురించి ఉన్న ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి, సరైన ఆలోచనా విధానాన్ని నేర్చుకునేలా చేస్తుంది. తరచూ అద్దం చూసుకోవడం, కాస్మెటిక్స్‌ తగ్గించడంలో, ప్రత్యామ్నాయ మార్గాలను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుంది. అలా పది సెషన్లలో మానవి సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు తాను మొటిమల సమస్యను పక్కకు నెట్టేసి, కాన్ఫిడెంట్‌గా అన్ని ఫంక్షన్స్‌కు హాజరవుతోంది. 

  -సైకాలజిస్ట్‌ విశేష్‌
psy.vishesh@gmail.com

మరిన్ని వార్తలు