బడ్జెట్‌ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్‌ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే!

1 Feb, 2024 12:37 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 1న)వరుసగా ఆరవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌తో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును సమం చేశారు నిర్మలాసీతారామన్‌. అంతేగాదు వరుసగా ఐదు బడ్జెట్‌లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్‌ కూడా చేరిపోవడమేగాక ఈ ఏడాది ప్రవేశపెడుతున్న ఆరో బడ్జెట్‌తో సరికొత్త రికార్డుని నెలకొల్పబోతున్నారు కూడా. ఇక సీతమ్మ బడ్జెట్‌ అనంగానే గుర్తొచ్చేది ఆమె చీరలే. ప్రతి ఏటా సీతారామన్‌ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆమె ధరిస్తున్న చీరలదే ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఈసారి 2024 బడ్జెట్ సందర్భంగానూ ఆమె ప్రత్యేక రంగు చీరలో వచ్చారు కూడా. అయితే ఇంతవరకు ఆమె ప్రతి  ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎలాంటి చీరలు ధరించారు? వాటి విశేషాలేంటో చూద్దామా!. 

2019లో..
2019లో తొలిసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆ సమయంలో ఆమె గులాబీ రంగు, బంగారు అంచు మంగళ గిరి చీరను ధరించారు. అలాగే ఆ ఏడాదే సంప్రదాయ బ్రీఫ్ కేస్ స్థానంలో బహీ ఖాతాను ప్రవేశపెట్టి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు ఆర్థిక మంత్రి. ఈ బహీ ఖాతా కోసం ఎరుపు రంగు సిల్క్ క్లాత్‌తో బడ్జెట్ పేపర్లను చుట్టారు.

2020లో
2020 బడ్జెట్‌ సమర్పణ కోసం నిర్మలా సీతారామన్ పసుపు రంగు సిల్క్ చీరతో పార్లమెంట్‌కు వచ్చారు. నీలం రంగు అంచుతో పసుపు- బంగారు రంగు చీరను ధరించారు. పసుపును సంప్రదాయానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. చాలా మంది ప్రత్యేక రోజుల్లో ఈ రంగు చీరలను ధరిస్తుంటారు.

2021 బడ్జెట్‌లో..
2021 బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి తెలంగాణలోని పోచంపల్లికి చెందిన చీరను కట్టుకున్నారు. ఎరుపు- హాఫ్ వైట్ సమ్మేళనం అయిన ఇక్కత్ సిల్క్ పోచంపల్లి చీరను ధరించారు. ఈ చీరకు పల్లు ఇక్కత్ పాటర్స్‌తో సన్నటి గ్రీన్ బార్డర్ ఉంటుంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీర తయారైంది.

2022 బడ్జెట్‌లో..
2022 బడ్జెట్ సమర్పణ సందర్బంగా బ్రౌన్ కలర్ చీర ధరించి పార్లమెంట్ కు వచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఒడిశాలో ఈ చీరలు తయారవుతాయి. రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ రంగు బార్డర్, సిర్వర్ కలర్ డిజైన్ ఉంది. బ్రౌన్ కలర్ రక్షణ, భద్రతలను సూచిస్తుంది. రెడ్ కలర్ పవర్ను సూచిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉన్న చీరను ధరించి 2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు.

2023లో..
2023లో ఐదో సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్‌.. ఎరుపు రంగు టెంపుల్ బార్డర్ చీర ధరించారు. దీని మీద ఎరుపు, నలుపు కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ ఉంది. ఈ చీరలు ముఖ్యంగా కాటన్ లేదా సిల్క్‌లో మాత్రమే లభిస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో మహిళలు వీటిని కట్టుకునేందుకు ఇష్టపడుతుంటారు. మరోవైపు.. ఇదే ఏడాది బహీ ఖాతా స్థానంలో ఎరుపు రంగు డిజిటల్ టాబ్లెట్‌తో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్‌.

2024లో..
ఈ ఏడాది ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్‌ సమర్పణ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్లూ కలర్‌ కాంతా వర్క్ టస్సార్ చీరను ధరించారు. ఈ చీర పశ్చిమ బెంగాల్‌లో తయారైంది. ఇక​ ఈ నీలం రంగు  నీలం మంచి ఆరోగ్యానికి ప్రతీక. పైగా ఇది రక్షణకు, అధికారం, విశ్వాసం,మేధస్సు, ఐక్యత, స్థిరత్వలను సూచిస్తుంది. 

ఇక ఆర్థిక మంత్రి సీతమ్మకు చేనేత చీరలంటే మహా ఇష్టం. జనవరి 26న, నార్త్ బ్లాక్‌లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె ఎక్కువగా సంబల్‌పురి, ఇకత్, కంజీవరం చీరలలో కనిపిస్తుంది. చాలా వరకు ఆమె నలుపు రంగుకు దూరంగా ఉంటారని సమాచారం.

(చదవండి: నిర్మలమ్మ చీర ప్రత్యేకత ఇదే..)

whatsapp channel

మరిన్ని వార్తలు