ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..? ఎందుకు చేస్తారు?

20 Dec, 2023 17:17 IST|Sakshi

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం విపాసన ధ్యానం కోర్సుకు బయల్దేరారు. నేటి నుంచి పది రోజులపాటు ఆయన ధ్యానం కోర్సులో పాల్గొననున్నారు. డిసెంబర్‌ 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కేజ్రీవాల్‌ ప్రతి ఏడాది చలికాలంలో ఈ విపాసన ధ్యానం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో బెంగళూరు, జైపుర్‌ వంటి నగరాల్లో ఆయన ఈ శిక్షణకు హాజరయ్యారు కూడా. అసలేంటి విపాసనా ధ్యానం? ఎందుకు చేస్తారు తదితరాల గురించే ఈ కథనం!.

విపాసనా ధ్యానం అంటే..
విపసనా ధ్యానం అనేది మీ మనస్సును లోతుగా కేంద్రీకరించడానికి సహాయపడే ఒక ప్రత్యేకమైన అభ్యాసం. విపాసన అంటే 'అంతర్దృష్టి' అనే అర్థం వస్తుంది. అంటే విపాసన అభ్యాసం ద్వారా విషయాన్ని సంపూర్ణ ఏకాగ్రతతో లోతుగా అర్థం చేసుకొని, మనశ్శాంతిని సాధించడం. ఇది చంచలమైన మనస్సును నియంత్రించి, ప్రశాంతత చేకూరుస్తుంది. తద్వారా ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరించేలా చేసే స్థితిని కల్పిస్తుంది. వివిధ రకాల ఆలోచనలు చుట్టుముట్టకుండా, మీ అంతరంగాన్ని ఏకాగ్రం చేసి,  స్వీయ పరిశీలనను అభ్యసించడానికి మిమ్మల్ని ఈ మెడిటేషన్ టెక్నిక్ అనుమతిస్తుంది.

విపసనా ధ్యానం అనేది బౌద్ధమతంలో ఆచరించే పురాతన ధ్యాన పద్ధతి. సుమారు 2,400 సంవత్సరాల క్రితం బుద్ధుడు సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ధ్యాన అభ్యాసం ఆగ్నేయాసియా, శ్రీలంకలో చాలా ఎక్కువగా ఆచరిస్తారు. భారతదేశంలో కూడా చాలా చోట్ల విపాసన ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఇది మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.  మానసిక ప్రశాంతతను ఇవ్వడమే గాక  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ ధ్యానంతో కలిగే ప్రయోజనాలు..
విపసనా ధ్యానంతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే దీనికి విశేష జనాదరణ ఉంది. ఇది చేస్తే మెరుగైన ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. 

  • ఒత్తిడిని తగ్గిస్తుంది
  • ఆందోళన తగ్గిస్తుంది
  • మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
  • మాదక ద్రవ్యాల అడిక్షన్‌ నుంచి బయటపడేలా చేస్తుంది

అధ్యయనంలో 40 రోజులు ఈ మైండ్‌ఫుల్‌నెస్‌ టెక్కిక్‌ తీసుకున్న వారిలో ఈ మార్పులన్ని గమనించారు పరిశోధకులు. వారిలో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి ప్రశాంత చిత్తంతో కనిపించారని చెబుతున్నారు. 

ఎలా చేయాలంటే..
ముందుగా సుఖాసంనలో కూర్చొని నడుం నిటారుగా ఉంచి శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండాలి. మీ మనో చిత్తంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ఎలాంటి ఆలోచనలు రాకుండా చేసుకోవాలి. మొదట్లో ఐదు నుంచి 10 నిమిషాలు చేయండి. క్రమేణ పెంచుతూ 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ధ్యానం చేయండి. 

(చదవండి: పొడవాటి జుట్టు లేకపోయినా మిస్‌ ఫ్రాన్స్‌గా కిరీటం దక్కించుకుంది! అందానికి..)

>
మరిన్ని వార్తలు