Weather Report: అమృత్‌సర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు.. ఎంతంటే..

19 Dec, 2023 07:36 IST|Sakshi

దేశంలోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రతను మరింత పెంచుతోంది. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రతపెరిగింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కూడా ఏర్పడుతోంది.

వాతావరణ శాఖ ‘ఎక్స్’ హ్యాండిల్‌లో అందించిన సమాచారం ప్రకారం హర్యానా, పంజాబ్, చండీగఢ్, అస్సాం, మేఘాలయలో రాబోయే ఐదు రోజుల పాటు ఉదయం దట్టమైన పొగమంచు ఏర్పడనుంది. డిసెంబర్ 21 వరకు ఇదేవిధమైన వాతావరణం ఉండనుంది. కాగా గత 24 గంటల్లో హర్యానా, పంజాబ్, చండీగఢ్, యూపీ, ఢిల్లీ, వాయువ్య రాజస్థాన్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బీహార్, మధ్యప్రదేశ్‌లలో ఐదు నుంచి 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. 

రానున్న 2-3 రోజుల్లో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. గత 24 గంటల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలుగా నమోదైంది. యూపీలోని బరేలీలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని రేవా, ఉమారియాల్లో 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఇదిలావుండగా గత 24 గంటల్లో దక్షిణ తమిళనాడులో 39 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ తమిళనాడులోని చాలా చోట్ల తేలికపాటి నుండి  ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్‌లో తెలిపింది. డిసెంబర్ 19న కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 7.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్‌లో సగటు ఉష్ణోగ్రత కంటే ఒక డిగ్రీ తక్కువ. మంగళవారం పాక్షికంగా ఆకాశం మేఘావృతమై, పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా జమ్మూకశ్మీర్‌లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో మైనస్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది కూడా చదవండి: లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్‌, ప్రియాంక పోటీ?

>
మరిన్ని వార్తలు