కమ్మని కాఫీలాంటి కళ

14 Jun, 2023 10:56 IST|Sakshi

యువతరంలో చాలామంది..తమ క్రియేటివ్‌ స్కిల్స్‌ను అభిరుచికి మాత్రమే పరిమితం చేసుకోవడం లేదు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఆసక్తి, అభిరుచులనే కెరీర్‌ ఛాయిస్‌గా తీసుకుంటున్నారు. కాపీరైటర్‌ కావాలనే కల కూడా అందులో ఒకటి. ‘మేకిట్‌ సింపుల్‌. మేకిట్‌ మెమొరబుల్‌’ ‘రైట్‌ వితౌట్‌ ఫియర్‌. ఎడిట్‌ వితౌట్‌ మెర్సీ’... లాంటి మాటలను గుండెలో పెట్టుకొని తమ కలల తీరం వైపు కదులుతున్నారు..

పశ్చిమ బెంగాల్‌లోని చిన్న పట్టణం నుంచి తన కలల తీరమైన ముంబైకి వచ్చింది అనూష బోస్‌. మాస్‌ కమ్యూనికేషన్‌లో పట్టా పుచ్చుకున్న అనూష ఒక అడ్వర్‌టైజింగ్‌ కంపెనీలో చేరింది. జింగిల్స్, డైలాగులు రాయడంలో తనదైన శైలిని సృష్టించుకుంది. మూడురోజుల్లో రాసే టైమ్‌ దొరికినా కేవలం 30 సెకండ్లలో మాత్రమే రాసే అవకాశం ఉన్నా.. ఎక్కడా తడబాటు ఉండకూడదనేది తన ఫిలాసఫీ.

‘ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సానబట్టాలి’ అంటుంది సీనియర్‌ కాపీ రైటర్‌ అయిన అనూష బోస్‌. ట్రైనీ కాపీరైటర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ముంబైకి చెందిన ఆకృతి బన్సాల్‌. చిన్నప్పటి నుంచి తనకు టీవీలో వచ్చే యాడ్స్‌ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనని అడ్వర్‌టైజింగ్‌ ఫీల్డ్‌కు తీసుకువచ్చింది. అది ఏ వ్యాపారానికి సంబంధించినది అనేదానికంటే ఆ యాడ్‌ వెనుక ఉన్న ఐడియా తనకు బాగా నచ్చేది. ‘హోం సైన్స్‌’ చదువుకున్న ఆకృతికి ‘ఎడ్వర్‌టైజింగ్‌ అండ్‌ పబ్లిక్‌రిలేషన్‌’ ఒక సబ్జెక్ట్‌గా ఉండేది. ఆ సబ్జెక్ట్‌ ఇష్టంగా చదువుకున్న తరువాత ‘ఈ రంగంలో నేను ప్రయత్నించవచ్చు’ అనుకుంది. ఫీల్డ్‌కు వచ్చిన తరువాత ప్రతిరోజు, ప్రతి డెడ్‌లైన్‌ను ఒక సవాల్‌గా స్వీకరించింది.

‘చాలెంజ్‌ ఉన్నప్పుడే మజా ఉంటుంది’ అంటుంది ఆకృతి బన్సాల్‌. మరి ఆమె భవిష్యత్‌ లక్ష్యం ఏమిటి? ‘ప్రతిష్ఠాత్మకమైన ఎడ్వర్‌టైజింగ్‌ అవార్డ్‌ తీసుకోవాలి లేదా నా తల్లిదండ్రులు రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి నచ్చిన యాడ్‌ హోర్డింగ్‌ నేను రాసినదై ఉండాలి’ అంటుంది ఆకృతి బన్సాల్‌. రాధిక నాగ్‌పాల్‌ టీనేజ్‌ నుంచి పుస్తకాల పురుగు. భాషలోని సొగసు అంటే ఇష్టం. రాధిక జర్నలిజం కోర్స్‌ చేసింది. అందులో ఒక సబ్జెక్ట్‌ అయిన ఎడ్వర్‌టైజింగ్‌ తనకు బాగా నచ్చింది. రాధిక ఇప్పుడు ‘సోషియోవాష్‌’లో సీనియర్‌ కాపీ రైటర్‌.

‘యాడ్‌ ఏజెన్సీలో పనిగంటలు అంటూ ఉండవు. కాలంతో పరుగెత్తాల్సిందే. బ్రాండ్‌ను అర్థం చేసుకోవడంతో పాటు క్లయింట్‌ ఆశిస్తున్నది ఏమిటి? ఆడియెన్స్‌ను వేగంగా ఎలా చేరుకోవాలి? అనే దానిపై అవగాహన ఉండాలి. మనం చెప్పదల్చుకున్నది సింగిల్‌ లైన్‌లోనే క్యాచీగా చెప్పగలగాలి’ అంటుంది రాధిక. విస్తృతంగా చదవాలి. గత అనుభవాల నుంచి రెఫరెన్స్‌ తీసుకోవడానికి ఎంతో ఉంది’ అనేది ఔత్సాహిక కాపీరైటర్‌లకు రాధిక ఇచ్చే సలహా.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన అంజు న్యూస్‌పేపర్లలో వచ్చే ఎడ్వర్‌టైజింగ్‌లను ఫైల్‌ చేస్తుంటుంది. ఆమె ఎన్నోసార్లు చదివిన పుస్తకం క్లాడ్‌ సీ.హాప్‌కిన్స్‌ రాసిన సైంటిఫిక్‌ ఎడ్వర్‌టైజింగ్‌ (1923). ఈ పుస్తకంలోని సరళమైన భాష అంటే అంజుకు ఇష్టం. ‘జస్ట్‌ సేల్స్‌మన్‌షిప్‌’ ‘ఆఫర్‌ సర్వీస్‌’ ‘హెడ్‌ లైన్స్‌’ ‘బీయింగ్‌ స్పెసిఫిక్‌’ ‘ఆర్ట్‌ ఇన్‌ ఎడ్వర్‌టైజింగ్‌’ ‘టెల్‌ యువర్‌ ఫుల్‌స్టోరీ’ ‘ఇన్‌ఫర్‌మేషన్‌’ ‘స్ట్రాటజీ’ ‘నెగెటివ్‌ రైటింగ్‌’... మొదలైన చాప్టర్ల గురించి అనర్గళంగా మాట్లాడగలదు. అంజు భవిష్యత్‌ లక్ష్యం ‘కాపీ రైటర్‌’ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు!

వీరు కూడా..
ప్రముఖ సినీ నటి రాశీఖన్నా న్యూ దిల్లీ, లేడీ శ్రీరామ్‌ కాలేజీ స్టూడెంట్‌. కాలేజీ రోజుల నుంచి చదవడం రాయడం అంటే ఇష్టం. కాపీరైటర్‌ కావాలనేది తన కల. కలను నిజం చేసుకోవడానికి ముంబైకి వెళ్లింది. అయితే సినిమాల్లో అవకాశాలు రావడంతో తన రూట్‌ మారింది. కాపీరైటర్‌ కాబోయి యాక్టర్‌ అయిందన్నమాట! సినిమారంగంలో ఉన్నప్పటికీ గుడ్‌ కాపీరైటింగ్‌ కోసం వెదుకుతుంది. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌  కాలేజీ చదువు పూర్తికాగానే ఒక యాడ్‌ ఏజెన్సీలో కాపీరైటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు. ఇప్పటికీ చిన్న చిన్న రచనలు చేస్తుంటాడు. 

మన ప్రత్యేకతే మన శక్తి
ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సాన పట్టాలి.
– ఆకృతి బన్సాల్, కాపీ రైటర్‌

ఒక ఐడియా... వెయ్యి ఏనుగుల బలం
ఒక ఐడియా స్ట్రైక్‌ అయ్యేవరకు మనసులో భయంగా ఉంటుంది. తళుక్కుమని ఒక ఐడియా మెరిసిందా...ఇక అంతే. వెయ్యి ఏనుగుల బలం దరి చేరుతుంది! క్రియేటివ్‌ బ్లాక్స్‌ రాకుండా ఉండడానికి పుస్తకాలు చదువుతాను. నచ్చిన పుస్తకాలు మళ్లీ చదువుతాను.
– రాధిక నాగ్‌పాల్, సీనియర్‌ కాపీ రైటర్‌ 

(చదవండి: కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయ్‌! )

మరిన్ని వార్తలు