విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?

26 Jul, 2022 14:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని 1350 జైళ్లలో ప్రస్తుతం సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరి స్వేచ్ఛగా జీవించే రాజ్యాంగ హక్కును దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ‘సతేందర్‌ కుమార్‌ అంతిల్‌ వర్సెస్‌ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’ (సీబీఐ) కేసు తీర్పులో పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. నిందితులకు, విచారణలో ఉన్న ఖైదీలకు బెయిల్‌ జారీ చేసే విధానాన్ని సరళతరం చేసే ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని ఆదేశించింది. అలాగే పోలీసు అధికారులు ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసే క్రమంలో సీఆర్‌పీసీలో తెల్పిన సెక్షన్‌ 41, 41ఏలోని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, గతంలో సుప్రీంకోర్టు అర్నేష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసు తీర్పులో తెల్పిన నిబంధనలను పాటించాలని పేర్కొంది. 

జైలు జీవితం గడుపుతున్న విచారణ ఖైదీలు, వారు చేసిన నేరా నికి విధించే శిక్షా సమయంలో 50 శాతం పూర్తి చేసిన వారిని దేశవ్యాప్తంగా ఉన్న మేజిస్ట్రేట్‌ కోర్టులు, హైకోర్టులు వారి బెయిల్‌ దరఖాస్తులను పరిశీలించి ఇతర న్యాయపరమైన నిబంధనలను పరిగణలోకి తీసుకొని తగు ఆదేశాల ద్వారా వారికి రెండు వారాల్లో బెయిల్‌ మంజూరు చెయ్యాలని ఆదేశించింది. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన నిందితుల దరఖాస్తులను కూడా పరిశీలించి ఆరు వారాల్లో తగు ఆదేశాలను జారీ చేయాలని సూచించింది. 

దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పోలీసు వ్యవస్థలోనే జరుగుతున్నవని గుర్తించి, అనేక సందర్భాల్లో ప్రతిష్ఠాత్మకమైన తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించింది. 2015లో ‘డీకే బసు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌’ కేసు తీర్పులో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నేరాలు పోలీస్‌ స్టేషన్లలోనే జరుగుతున్నట్లు గుర్తించి, దేశంలోని అన్ని పోలీస్‌ ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతకుముందు 2014లో ‘అర్నేశ్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌’ కేసు తీర్పులో... ఏడు సంవత్సరాల వరకు శిక్షపడే అన్ని నేరాలకు సంబంధించిన నిందితులను ఉన్నట్లుండి అరెస్టు చేసి జైలుకు పంపకూడదని ఆదేశించింది. ఒకవేళ అలాంటి కేసుల్లో నిందితులను అరెస్టు చేయాలంటే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని ఆదే శించింది. సంబంధిత పోలీస్‌ అధికారులు సదరు కోర్టుతీర్పు నిబంధనలను అతిక్రమించినట్లయితే కోర్టుధిక్కార నేరం కింద వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని హైకోర్టులను ఆదే శించింది.

కోర్టుల్లో కేసుల విచారణకు ఎక్కువ కాలం పట్టడం వల్ల నేరం చేసినవారూ, అమాయకులూ కూడా అన్యాయానికి గురవుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం. అలాగే పోలీసు వ్యవస్థ, కేసుల నమోదు ప్రక్రియ, కోర్టుల్లో విచారణ వంటివాటిపై ప్రాథమిక అవగాహన కల్పించే పాఠ్యాంశాలు విద్యలో భాగం కాకపోవడమూ మరోకారణం. అందుకే ప్రభుత్వాలు తక్షణం ఈ దిశలో చర్యలు తీసుకుని పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడాలి. (క్లిక్‌:  ‘నడమంత్రపు’ ఎన్నికలకు సన్నాహాలా!)


- కోడెపాక కుమారస్వామి 
సామాజిక కార్యకర్త 

మరిన్ని వార్తలు