దుష్ప్రవర్తనను నిగ్గు తేల్చడమెలా?

17 Nov, 2023 00:28 IST|Sakshi
మహువా మొయిత్రా

విశ్లేషణ

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రమైన దుష్ప్రవర్తనతోపాటు, సభను ధిక్కరించినందుకు గానూ ఆమెను పార్లమెంటు నుండి బహిష్క రించాలని లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సిఫార్సు చేసింది. లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ, దాని పేరు సూచించినట్లుగానే, ఎంపీల అనైతిక ప్రవర్తనను పరిశీలించి తగిన శిక్షలను సిఫారసు చేస్తుంది. నేటి వరకూ, ‘అనైతిక ప్రవర్తన’ అనేదానికి తగిన నిర్వచనం లేదు. ఎంపీల ప్రవర్తన తీరును పరిశీలించి, అది అనైతికమా, కాదా అని కమిటీ నిర్ణయిస్తుంది. ఎథిక్స్‌ కమిటీ చరిత్రలో ఎప్పుడూ ఒక ఎంపీని బహిష్కరించాలని సిఫారసు చేయలేదు. సభ్యులను విచా రించి శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, సత్యాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రక్రియ సమర్థతపై సరైన అంచనా ఇంకా రావలసే ఉంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్రా తీవ్రమైన దుష్ప్రవర్తనతోపాటు, సభను ధిక్కరించినందుకుగానూ ఆమెను పార్లమెంటు నుండి బహిష్కరించాలని లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంటులో ప్రశ్నలను లేవనెత్తడం కోసం ఆమెకు ఇచ్చిన లాగిన్‌ వివరాలు, పాస్‌వర్డ్‌ను దుబాయ్‌కి చెందిన ఒక వ్యాపారవేత్తతో పంచుకున్నారనేది ఆమెపై ఉన్న ప్రధాన అభియోగం. ఆ వ్యాపారవేత్త ఆమె పేరుతో లోక్‌సభకు ప్రశ్నలు పంపడానికి ఆమె లాగిన్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకున్నారు. ఆయన వ్యాపార ప్రయోజనాల సమర్థవంతమైన ప్రమోషన్‌ కోసం ఆమె లాగిన్‌ ఐడీని దుర్వినియోగం చేయడానికి అనుమతించారనేది మొయిత్రాపై ఉన్న అభియోగంలోని ప్రధానాంశం.  

ఎథిక్స్‌ కమిటీ రెండు రోజులపాటు సమావేశమై, మొయిత్రాను దోషిగా నిర్ధారించి, ఆమెను బహిష్కరించాలని కోరింది. లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ, దాని పేరు సూచించినట్లుగానే, ఎంపీల అనైతిక ప్రవర్తనను పరిశీలించి తగిన శిక్షలను సిఫారసు చేయవలసి ఉంటుంది. అయితే, నేటి వరకూ, ‘అనైతిక ప్రవర్తన’ అనేదానికి తగిన నిర్వచనం లేదు. ఎంపీల ప్రవర్తన తీరును పరిశీలించి, అది అనైతికమా కాదా అని కమిటీ నిర్ణయిస్తుంది.

కమిటీ చరిత్రలో లేని బహిష్కరణ
ఎథిక్స్‌ కమిటీ ఇప్పటివరకు పరిశీలించిన కేసులు ఏమంత ఎక్కువగా లేవు. సాధారణ ప్రవర్తనా నియమాలకు భిన్నమైన చిన్న చిన్న అతిక్రమణలతో ఈ కమిటీ వ్యవహరించింది. అటువంటి అతిక్రమణల తీవ్రతను బట్టి శిక్షలు మారుతూ ఉంటాయి: ఉపదేశించడం, మందలించడం, సభా సమావేశాల నుండి నిర్దిష్ట కాలానికి సస్పెండ్‌ చేయడం సాధారణంగా సిఫారసు చేస్తారు. లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ చరిత్రలో ఎప్పుడూ ఒక ఎంపీని సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేయలేదు. పార్లమెంటు నుండి బహిష్కరించడం చాలా తీవ్రమైన శిక్ష.

ఎందుకంటే బహిష్కరించబడిన ఎంపీకి చెందిన నియోజకవర్గ ప్రజలకు సభలో ప్రాతినిధ్యం వహించే హక్కు, అవకాశం లేకుండాపోతాయి. అందువల్ల, బహిష్కరణ చాలా అరుదుగా సిఫారసు చేస్తారు. 1951లో, తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు హెచ్‌డి ముద్గల్, ఒక వ్యాపార సంస్థ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నట్లూ, దానికిగానూ ఆర్థిక ప్రయోజనాలను పొందు తున్నట్లూ గుర్తించి సభ నుండి బహిష్కరించారు. హౌస్‌లోని ప్రత్యేక కమిటీ ఈ కేసును విచారించి, ఆయన బహిష్కరణకు సిఫారసు చేసింది.

అదే విధంగా, 2005లో, 10 మంది ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నలు వేసేందుకు డబ్బును స్వీకరిస్తున్నట్లు ఒక స్టింగ్‌ ఆపరేషన్ లో దొరికిపోయిన సందర్భంలో వారిని లోక్‌సభ నుండి బహిష్కరించారు. ఈసారి కూడా ప్రత్యేక కమిటీ కేసు దర్యాప్తు చేసింది. ఒకరి వ్యక్తిగత ప్రయోజనాలను ప్రోత్సహించడానికి పార్లమెంటరీ పని చేయడం కోసం డబ్బును స్వీకరించడం సభా నియమాలకు సంబంధించి తీవ్ర మైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. కాబట్టి, అటువంటి దుష్ప్రవర్తనకు గాను అంగీకరించిన శిక్ష– బహిష్కరణ. రాజా రామ్‌ పాల్‌ వర్సెస్‌ గౌరవనీయ స్పీకర్, లోక్‌సభ (2007) ఉదంతంలో సుప్రీంకోర్టు... ప్రత్యేక హక్కును ఉల్లంఘించినందుకు సభ్యుడిని బహిష్కరించే సభ అధికారాన్ని ఆమోదించింది.

అధికారం ఉందా, లేదా?
అయితే, (ఆ సందర్భంలో) అటువంటి ప్రత్యేక హక్కు ఉందా లేదా అనే అంశాన్ని కోర్టు నిర్ధారిస్తుంది. అలాంటి హక్కు ఉనికిలో లేదని గుర్తిస్తే, సదరు బహిష్కరణను కొట్టివేస్తుంది. రాజా రామ్‌ పాల్‌ కేసు ప్రాముఖ్యత ఏమిటంటే, ఒక ఎంపీని బహిష్కరించే సభ అధి కారం ఒక ప్రత్యేక హక్కు ఉనికితో నేరుగా ముడిపడి ఉండటం. దాన్ని ఉల్లంఘిస్తే బహిష్కరణ సాధ్యపడుతుంది. అయితే ఇది ఒక ముఖ్య మైన ప్రశ్నకు దారి తీస్తుంది. విశేషాధికారాల కమిటీకి కాకుండా, ఇతర కమిటీకి బహిష్కరణను సిఫార్సు చేసే అధికారం ఉందా? (1951, 2005 సంవత్సరాలలో ఎంపీల బహిష్కరణకు సిఫార్సు చేసిన కమి టీలు నైతిక లేదా విశేషాధికారాల కమిటీలు కావు. నిర్దిష్ట సమస్యలపై విచారణ కోసం సభ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు.)

రాజా రామ్‌ పాల్‌ తీర్పులోని తర్కాన్ని అనుసరించినట్లయితే, విశేషాధికారాల కమిటీ లేదా సభ నియమించిన ప్రత్యేక కమిటీ మాత్రమే విశేషాధికారాల ఉల్లంఘనపై ఎంపీని బహిష్కరించే వ్యవహా రాన్ని నడపగలదు. పార్లమెంట్‌లోని ఏ ఇతర సాధారణ కమిటీ ఆ సిఫారసు చేయలేదు. విశేషాధికారాల కమిటీ ముందుకు తేలేని సమస్యలతోనే ఎథిక్స్‌ కమిటీ వ్యవహరిస్తుంది. ఎథిక్స్‌ కమిటీని ఏర్పాటు చేయడంలోని తర్కం ఏమిటంటే, విశేషాధికారాల కమిటీ ముందుకు తేనక్కరలేనంతటి దుష్ప్రవర్తనలు చాలా ఉన్నాయి.

అయితే అదే సమయంలో అటువంటి ప్రవర్తనతో తగిన విధంగా వ్యవహరించడానికి సభా క్రమశిక్షణా యంత్రాంగం అందుబాటులో ఉండాలి. వివిధ కమిటీల పాత్రల్లోని ఈ వ్యత్యాసం పార్లమెంటు దృష్టిని డిమాండ్‌ చేస్తుంది. తద్వారా పార్లమెంట్‌ శిక్షాస్మృతి అధికారాల కార్యాచరణలో మరింత స్పష్టత తేవడం జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీలు చేసే దర్యాప్తు పరిధి, ప్రయోజనం, దాని స్వభావం కూడా ఇక్కడ దృష్టిలో ఉంటుంది.

తక్షణ అవసరం
స్కామ్‌లు, ఇతర తీవ్రమైన కేసులకు దారితీసే ఆర్థిక దుర్విని యోగానికి సంబంధించిన విషయాలను పార్లమెంట్‌ పరిశోధిస్తుంది. ఇటువంటి పరిశోధనలు భారీ ఆర్థిక మోసాలకు దారి తీసే వ్యవస్థాగత లోపాలను వెలికితీసేంత సమగ్రంగా ఉంటాయి. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) వంటి దర్యాప్తు సంస్థ చేయలేని ఈ విధిని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నిర్వహిస్తుంది. అయితే సభ్యుడిని బహిష్కరించే అధికారంపై ఎటువంటి వివాదం లేనప్పటికీ, విచారణ విధానం గురించి కొన్ని ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి.

ఫిర్యాదుదారు, ప్రతివాది ఎంపీ, ఇతర ప్రమేయం గల వ్యక్తులతో సహా సాక్ష్యం తీసుకోవడం కమిటీ సాధారణంగా అనుసరించే విధానం. వారు రాతపూర్వక పత్రాలను సమర్పించవచ్చు. అలాగే మౌఖిక ప్రకటనలు తీసుకోవచ్చు. ఆధారాలు సేకరించిన తర్వాత, సచివాలయ అధికారులు అటువంటి సాక్ష్యాలను జల్లెడ పట్టి, కనుగొన్న విషయాలు, సిఫార్సులతో కూడిన ముసాయిదా నివేదికను సిద్ధం చేస్తారు.

కాబట్టి, ఒక ఎంపీకి ఇచ్చే అత్యంత తీవ్రమైన శిక్ష అయిన బహిష్కరణను కమిటీలోని మెజారిటీ ఆధారంగా నిర్ణయిస్తారు. పార్లమెంటరీ విచారణ స్వభావాన్ని మనం పరిశీలించినప్పుడు. సాక్ష్యాధారాలను బేరీజు వేసే అధికారుల సామర్థ్యాలు, దర్యాప్తు రంగంలో వారి నైపుణ్యం, మరియు ఎక్కువగా నిపుణులు కాని, న్యాయపరంగా శిక్షణ పొందని కమిటీ సభ్యుల మనస్సును అన్వయించడం వంటి సంబంధిత అంశాలను ఎప్పుడూ పరిగణనలోకి తీసు కోవాలి.

పరిశోధనాత్మక యంత్రాంగాల ద్వారా విధానపరమైన సమగ్ర తను కొనసాగించినప్పుడు మాత్రమే న్యాయం, సత్యం నిర్ధారించ బడతాయి. ఏ తప్పు చేసినా దాని సభ్యులను విచారించి శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, సత్యాన్ని తెలుసుకునేందుకు, న్యాయం చేయడానికి అనుసరించే ప్రక్రియ సమర్థత, దాని పటిష్టతపై సరైన అంచనా అనేది ఇంకా రావలసే ఉంది. మహువా మొయిత్రా కేసు ఈ పనికి సంబంధించిన ఆవశ్యకతను మనకు గుర్తు చేస్తోంది.

పి.డి.టి. ఆచారి 
వ్యాసకర్త లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు