శరద్‌ పవార్‌ (ఎన్సీపీ లీడర్‌) రాయని డైరీ

4 Jul, 2022 12:52 IST|Sakshi

మాధవ్‌ శింగరాజు

‘‘నన్ను ఆశీర్వదించండి పవార్‌జీ..’ అంటూ వచ్చాడు ఏక్‌నాథ్‌ శిందే. 
అప్పుడు నేను ఆశీర్వదించగలిగిన భౌతికస్థితిలో ఉన్నప్పటికీ, ఆశీర్వదించేందుకు తగిన అనుకూల స్థితిలో లేను. ఫోన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నాడు. 
ఠాక్రే అంటున్నాడు.. ‘‘పవార్‌జీ! ఈ లోకం మీద నాకు విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేలా నన్ను ఆశీర్వదించండి..’’ అని. ఆ టైమ్‌లో వచ్చాడు ఏక్‌నాథ్‌ శిందే! వస్తున్నట్లు ముందుగా చెప్పలేదు. చెప్పకుండా నేరుగా సౌత్‌ ముంబైలో నేనుంటున్న సిల్వర్‌ ఓక్స్‌ బంగళాకే వచ్చేశాడు.

ఈస్ట్‌ బాంద్రాలోని ఠాక్రేల ఇల్లు ‘మాతోశ్రీ’కి, మలబార్‌ హిల్స్‌లోని సీఎం అధికారిక భవంతి ‘వర్ష’కు, ఆ దగ్గర్లోనే ఉండే ప్రభుత్వ అతిథి గృహం ‘సహ్యాద్రి’కి కూడా అతడు ఇలా స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. వేటినీ తనవి కావు అనుకోడు. 

‘‘నన్ను ఆశీర్వదించండి పవార్‌జీ..’’ అన్నాడు మళ్లీ శిందే నాకు మరింతగా దగ్గరకు వచ్చి.. నా ఎదురుగా మోకాలిపై కూర్చుంటూ! నేనప్పుడు కుర్చీలో కూర్చొని ఉన్నాను. 
‘‘లేచి, పైన కూర్చో శిందే...’’ అన్నాను, సోఫా వైపు చూపిస్తూ. 

అతడు లేవలేదు!
‘‘ఎవరు పవార్‌జీ మీ దగ్గర.. శిందేనేనా?’’ అంటున్నాడు అటువైపు ఫోన్‌లో ఉద్ధవ్‌. 
ఎవరో వచ్చినట్లున్నారు.. ఫోన్‌ పెట్టేద్దాం.. అని అతడూ అనుకోవడం లేదు!

‘‘అవును ఉద్ధవ్‌... శిందేనే...’’ అన్నాను.. ఫోన్‌లో ఉద్ధవ్‌ ఉన్నాడని శిందేకు తెలిసేలా. 
‘‘ఏంటట పవార్‌జీ..’’ అన్నాడు ఉద్ధవ్‌!

‘‘ఉద్ధవ్‌ నేను మళ్లీ చేస్తాను. మళ్లీ చేసేంత టైమ్‌ నాకు దొరకడం లేదని నీకనిపిస్తే కనుక నువ్వే నాకొకసారి చెయ్యి..’’ అని, ఉద్ధవ్‌ ఫోన్‌ పెట్టేసే వరకు ఆగాను. 
శిందే ఇంకా మోకాలి మీదే ఉన్నాడు. 

‘‘తిరుగుబాటు చేసినందుకు నా మీద కోపంగా ఉన్నారా పవార్‌జీ..’’ అన్నాడు.
అతడి చెయ్యి మీద చెయ్యి వేశాను. 

శిందే అప్పటికే అనేకమంది ఆశీర్వాదాలు పొంది, ఇక్కడికి వచ్చాడు. ప్రమాణ స్వీకారానికి ముందు.. తన దివంగత రాజకీయ గురువు బాల్‌ ఠాక్రేను, తన స్వర్గీయ ఆధ్యాత్మిక గురువు ఆనంద్‌ డిఘేను తలచుకుని, వారి ఆశీర్వాదాల కోసం ప్రార్థించాడు. మోదీ, షాల ఆశీర్వాదాలకు భక్తి శ్రద్ధలతో తలవొగ్గాడు. వారివే కాకుండా.. అంకెలకు సరిపడినన్ని ఆశీర్వాదాలు ఎప్పుడు విశ్వాస పరీక్ష జరిగితే  అప్పుడు శిందే మీద కురవడానికి సిద్ధంగా ఉన్నాయి. లెక్కకు మిక్కిలిగా అన్ని ఆశీర్వాదాలు ఉండి కూడా, నా ఆశీర్వాదం కోసం వచ్చాడంటే.. అతడు కేవలం ఆశీర్వాదం కోసమే వచ్చాడని. 

‘‘కోపమేం లేదు శిందే. తిరుగుబాటు చెయ్యడం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. అంతకంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా? తిరుగుబాటు చెయ్యకుండా ఉండలేకపోవడం..’’ అన్నాను అతడి తలపై నా అరచేతిని ఆన్చి. 

అప్పుడు లేచాడు శిందే. ‘‘వెళ్లొస్తాను పవార్‌జీ’’ అని చేతులు జోడించాడు. 
అతడటు వెళ్లిపోయాక, నేనిటు నలభై నాలుగేళ్లు వెనక్కి వెళ్లిపోయాను. ఇప్పుడు ఉద్ధవ్‌పై శిందే తిరుగుబాటు చేసినట్లే అప్పట్లో వసంతదాదా పాటిల్‌పై నేను తిరుగుబాటు చేశాను. తప్పలేదు. తప్పనిపించలేదు. 

ఎవరైనా తిరుగుబాటు చేశారంటే వాళ్లు మనిషిగా బతికి ఉన్నట్లు! అవమానాలు భరిస్తూ కూడా ఎవరైనా తిరుగుబాటు చేయలేదంటే.. వాళ్లు ఒక మనిషి కోసం చూస్తున్నట్లు. అందుకే నేను తిరుగుబాటుదారుడిని గౌరవిస్తాను.. అతడు 1857 పాండే అయినా, 2022 శిందే అయినా. 

ఉద్ధవ్‌ మళ్లీ నాకు ఫోన్‌ చేస్తే చెప్పాలి.. లోకం మీద మనకు విశ్వాసం సన్నగిల్లితే లోకానికి పోయేదేమీ లేదని, అవిశ్వాస తీర్మానానికి ముందే మన మీద మనం విశ్వాసం కోల్పోతే లోకం వచ్చి చేసేదేమీ ఉండదని! 

మరిన్ని వార్తలు