మూలాలన్నీ ఆదిమ సమాజంలోనే!

18 Nov, 2022 00:24 IST|Sakshi

ప్రస్తుత ఆధునిక ప్రపంచం ఈ స్థితికి చేరడానికి కారణం తరతరాల పూర్వీకులు కూడబెట్టిన జ్ఞాన సంపదే. ఆ జ్ఞానం ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం  కావచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నదీ, అనుభవిస్తున్నదీ మాత్రమే జ్ఞానం కాదు. ఇప్పటికీ లిపి లేని ఎందరో ఆదిమ జాతుల వారు జీవనం సాగిస్తున్నారు. వారిది మౌఖిక విజ్ఞానం. ప్రకృతితో మమేకమవ్వటం, దాని పరిరక్షణ, దానిని ఉపయోగించుకోవడంలో వారు అగ్రగణ్యులు. సోకాల్డ్‌ ఆధునిక సమాజాలవారు ఈ జ్ఞానాన్ని గ్రహించి మరింతగా పురోగమించవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్కృతి బహు ముఖంగా విస్తరిస్తోంది. ఈ విద్యా సంస్కృతీ వికాసానికి మూలమైన తాత్త్వికులు లిఖిత విద్యనే ప్రమాణంగా తీసుకోలేదు. భారతదేశంలో గిరిజనులు మౌఖిక జ్ఞాన సంపన్నులు. దేశీయ భాషల్లో జీవం ఉంటుంది. నేల, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, చెట్టూ, పుట్టా అన్నింటి విలువలు వీరి జ్ఞానంలో ఒదిగి ఉన్నాయి. అయితే వారి నుండి మనం పూర్తి జ్ఞానాన్ని పొంద లేదు. ఆ విజ్ఞానం మన జీవితాన్ని సుసంపన్నం చేయాలంటే మౌఖిక జ్ఞాన సంపద లోతుల్లోకి మనం వెళ్ళాలి. 
ప్రపంచ విజ్ఞానమంతా ప్రకృతిలో దాగి ఉంది. వృక్ష, జంతు, భూగర్భ శాస్త్రముల వంటి వన్నీ విస్తృతి చెందాలంటే మానవ సమాజ జీవన వ్యవస్థల లోతుల్లోకి ఇంకా పరిశోధనలు వెళ్ళాలి. మనం మన కళ్ళముందు ఉన్నదాన్ని గ్రహించ లేక మన జీవన వ్యవస్థల్లో భాగంగా ఉన్న భాష మీద ఆధిపత్యం లేక ఉపరితల అంశాల మీదే దృష్టి పెడు తున్నాం. మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది? సమస్త జ్ఞానం ఇంద్రి యానుభవం ద్వారానే సిద్ధిస్తుందా? ఈ తాత్త్విక, భౌతిక దృష్టి లోపించి ప్రయోజనవాద దృష్టి పెరిగింది. ఇది మానవులకు ఉప యుక్తం కాదు. మనిషి తప్పక వాస్త వాన్ని అంగీకరించే ధోరణి లోకి రావాలి. వాస్తవం ప్రకృతిలోనూ, ప్రాకృతిక జీవుల్లోనూ ఎక్కువ ఉంటుంది. తాత్త్విక దృక్పథం లేని వాళ్ళే భూమి పొరలను చీల్చి భూగర్భ ఖనిజాలను అమ్ముకుంటున్నారు. ప్రపంచం అంతా ఈ రోజు అస్తవ్యస్తం కావ డానికి ప్రపంచం మీద, దేశం మీదా అవగాహన లేని అవిద్యాపరుల భావనలే.

మనిషి స్వార్థపరుడు కావడానికి కారణం జ్ఞాన శూన్యతే. ప్లేటో చెప్పినట్టు వృక్షత్వం భావన నుంచి చెట్టు మూలం తెలుస్తుంది. చెట్టు  మూలం తెలియని వాడు దాని వేర్లు నరుకుతాడు. చెట్టు  మూలం తెలియని వాడు చెట్టు పెంచడు. కాగా, చెట్టు మూలం తెలిసిన వాడు దాని ఆకులోని ఔషధ గుణాన్ని స్వీకరిస్తాడు. చెట్టుకి మానవ సమా జానికి ఉన్న అంత స్సంబంధం తెలియని వాడు జ్ఞాని కాదు. నిజమైన జ్ఞానం వస్తువుకు మనకు ఉండే అంతస్సంబంధం నుండే జనిస్తుంది. చాలామంది తన చుట్టూ ఉన్న పరిసరాల మీద అవగాహనను పెంచు కోలేదు. తాము చూడని, కనని, వినని అజ్ఞాత దైవాల మీద, తమకు అనుభవం కాని కులం మీద, తాము అనుభవించని సంపద మీదా ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు మూఢ విశ్వాసు లుగా మారతారు. జ్ఞానానికి వారు అవరోధులు. మౌఖిక జాతుల జీవన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారానే మనం భారతదేశాన్ని సుసంపన్నం చేయగలం. అనేక జాతులలో నిక్షిప్తమైయున్న జ్ఞానాన్నీ, విద్యనీ, సంస్కృతినీ మనం అర్థం చేసుకొనే క్రమం నుండే మన దేశాన్ని మనం కాపాడుకోగలం. 

ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో ఎంతో విలువైన ఖనిజ సంపద వుంది. ఎన్నో వృక్ష జాతులున్నాయి. గిరిజనులు ఈ ప్రకృతి సంపద పట్ల ఎంతో అవగాహన కలిగి సంరక్షించుకుంటూ ఉంటారు. ఈనాడు భారతదేశం సంక్షోభంలో వుండటానికి కారణం గిరిజనుల జ్ఞాన సంపదను అర్థం చేసుకోలేకపోవడమే. గిరిజనులు రక్షిస్తున్న అటవీ సంపదను బట్టి వారి నీతినీ, నిజాయితీనీ, వ్యక్తిత్వాన్నీ, రక్షణ స్వభావాన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. గిరిజనులే నిజమైన మాన వులు. వారు ప్రతి ఆకునూ ప్రేమిస్తారు. ప్రతి జంతువు స్వభావాన్నీ అధ్యయనం చేస్తారు. మాతృస్వామిక స్వభావం గలవారు. అందుకే శాస్త్రవేత్తలు లిఖిత భాషలోనే కాదు, అలిఖిత జాతులలో కూడా జ్ఞానం వుందని చెబుతున్నారు.

అరిస్టాటిల్‌ ప్రకృతి గురించి చెప్తూ... శుద్ధద్రవ్యం మొదటగా నాలుగు మూల పదార్థాలు –  మట్టి, నీరు, గాలి, అగ్నిగా మారుతుం దన్నాడు. ఇంతవరకు అరిస్టాటిల్‌కు పూర్వులైన గ్రీకులు కనిపెట్టినవే. కాని, అతడు అయిదవ మూల పదార్థం ఈథర్‌ కూడా ఉంటుందని ఊహించాడు. భారతీయ భౌతికవాదులు సాంఖ్యులు భూమి, నీరు గాలి, అగ్ని, శూన్యాలను కనిపెట్టారు. ఈ శూన్యంలో కూడా ఈథర్‌ అనే పదార్థం ఉంటుందని నేటి భౌతికవాదులు చెప్తున్నారు. అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుందని అంటున్నారు. అన్ని వస్తువులు పంచ భూతాల నుండే ఏర్పడతాయి. పదార్థ జ్ఞానాన్ని ఆదిమ వాసులు విస్తృతంగా అర్థం చేసుకొన్నారు. దేన్నైనా జీవితావసరం మేర మాత్రమే వాడుకుంటారు. కాని సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ స్వభావం వున్న వాళ్ళే వాటిని వ్యాపార దృక్పథంతో స్వార్థం కోసం ఉపయోగించు కొంటారు. 

భౌతిక తత్వశాస్త్రం మొత్తం ఆదిమ జాతుల నుండే వచ్చింది. సాంఖ్య దర్శన రూపకర్త కపిలుడు దళితుడే. దళితజాతులు ఆదిమ జాతులకి దగ్గరగా వుంటాయి. గిరిజనుల్లో చాలాకాలం ప్రజలకు లిపి తెలియదు కాని, వారికి మనకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా వుండేది. వారు పాతకాలపు అద్భుత గాథలను చెప్పేవారు. వారు పోయినా ఆ గాథలు మాత్రం పోలేదు. ఆనోటా ఆనోటా ఆ గాథలు మారుతూ వుంటాయి. వాటిలో కొత్త సంగతులు చేరుతుంటాయి. నీరు పారి పారి రాళ్ళు నునుపు దేరినట్టు ఆ గాథలు రాను రాను నయం గానూ, నాజూకు గానూ అవుతూ ఉంటాయి. పరాక్రమ వంతుడైన ఒకానొక కులపెద్ద కథ కాలక్రమాన నీటికీ, నిప్పుకూ, బాణానికీ, బళ్లేనికీ భయపడని వాడూ; సింహంలాగా అడవంతా పెత్తనం చెలాయించి డేగలాగ ఆకాశంలో ఎగిరిపోయేవాడూ అయిన ఏమాయా మానవుని వీరగాథ గానో మారుతుంది. 

గిరిజనులు, దళితులు ఇంకా ఇతర మౌఖిక ఉత్పత్తికారులు మన  సంస్కృతీ వికాసానికి, తత్వానికీ మూల ప్రకృతులు. మన కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలే కాక, మన విశ్వ విద్యాలయాలు, పరిశోధకులు, జ్ఞానులు, విద్యావంతులు మన మూల ప్రకృతులైన ఆదిమవాసులు, దళితులను అధ్యయనం చేయాలి. ఈ నేల పుత్రుల జీవన గాథలనూ, సాంస్కృతిక వికాసాన్నీ  పునర్నిర్మించుకోవడానికి దళిత గిరిజన విశ్వ విద్యాలయాలను నిర్మించుకోవలసి వుంది. లిఖితేతర సమాజం వైపు నడపడమే నిజమైన శాస్త్ర దృష్టికి మూలం. ఆ వైపు నడుద్దాం.

డా.కత్తి పద్మారావు, వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు ‘ 9849741695 

మరిన్ని వార్తలు