Top of Buildings:ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు?

7 Oct, 2023 09:09 IST|Sakshi

మీరు ఎప్పుడైనా  ఏదైనా మహానగరంలో రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని ఎత్తైన భవనాల పైన ఎరుపురంగు లైట్లు కనిపిస్తాయి. ఈ రెడ్ లైట్లు అలంకారం కోసం కాదని, దీని వెనుక ప్రత్యేక కారణం  ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మహానగరాలు కాంక్రీట్ అడవులుగా ఎప్పుడో మారిపోయాయి. ఆ నగరాల్లో ఎత్తైన భవనాలన్నింటిపైనా ఈ తరహా లైట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ లైట్లు భారీ భవనాలపైననే ఎందుకు కనిపిస్తాయి? ఓ మాదిరి భవనాలపై ఎందుకు కనిపించవు? దీని వెనుక ఏదైనా ప్రభుత్వ మార్గదర్శకం ఉందా లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నారా? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

భవనాల పైభాగంలో ఎరుపు రంగు దీపాలను అమర్చడానికి ప్రధాన కారణం విమాన భద్రత. ఈ లైట్లను ఏవియేషన్ అబ్స్ట్రక్షన్ లైట్లు లేదా ఎయిర్‌క్రాఫ్ట్ వార్నింగ్ లైట్లు అని అంటారు. ఆకాశహర్మ్యాలు, కమ్యూనికేషన్ టవర్లు, విండ్ టర్బైన్‌లు తదితర ఎత్తైన నిర్మాణాలు.. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పును కలిగిస్తాయి. ముఖ్యంగా దృశ్యమానత తగ్గినప్పుడు, అననుకూల వాతావరణంలో రెడ్ లైట్లు నిరంతర ఫ్లాషింగ్ సిగ్నల్స్‌ను విడుదల చేస్తాయి. అవి విమాన పైలట్‌లకు సులభంగా కనిపిస్తాయి. ఇది విమానాలకు హెచ్చరికలా పనిచేస్తుంది. విమానయాన అధికారులకు ప్రమాదాలను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి.

ఇటువంటి లైట్ల ఏర్పాటుకు సంబంధించి పలు దేశాలలో కఠినమైన నిబంధనలను ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ భద్రతను నిర్ధారించడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ లైట్లను అమర్చనిపక్షంలో భవన యజమానులు జరిమానాలతో పాటు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. 

ఎత్తైన భవనాలపైన ఉండే రెడ్ లైట్లు విమానాల కోసం నావిగేషనల్ ఎయిడ్స్‌గా కూడా పనిచేస్తాయి. వాటి స్థానాన్ని, దిశను గుర్తించడంలో సహాయపడతాయి. విమాన భద్రతతో పాటు, భవనాలపై  కనిపించే ఎరుపురంగు లైట్లు సమీపంలోని ఎత్తైన నిర్మాణాలకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయి. 
ఇది కూడా చదవండి: దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి?

మరిన్ని వార్తలు