మరపురాని కవిసమ్మేళనం.. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’

18 Jan, 2023 12:44 IST|Sakshi
జ్ఞాపిక తీసుకుంటున్న వ్యాసకర్త

జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సర్వభాషా కవిసమ్మేళనానికి హాజరు కావటం జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం. ఏటా ఆలిండియా రేడియో – భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన 22 భాషల నుంచి 23 మందిని (ఒక్క హిందీ భాష నుంచి మాత్రం ఇద్దరు) సెలెక్ట్‌ చేసి, ఏదో ఒక నగరంలో ఈ సమ్మేళనం ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం ఢిల్లీలో నిర్వహించిన సర్వభాషా కవిసమ్మేళనానికి తెలుగు భాష నుంచి నా కవిత ‘అమృతోపనిషత్‌’ ఎన్నికైంది. 

మొదటిరోజు (9వ తేదీ) ఢిల్లీ ఆకాశవాణి సమావేశ మందిరంలో రిహార్సల్స్‌ చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రసారభారతి ఉన్నతాధికారులు హాజరై ప్రతి కవినీ జ్ఞాపిక, శాలువాలతో సగౌరవంగా సత్కరించారు. రెండోరోజు (10వ తేదీ) తొలుత మూలభాషలో కవిత చదివించి, వెంటనే హిందీ అనువాదం వినిపించారు. ప్రతి కవినీ ఆహ్వానించే ముందు ఆ కవి గురించి హిందీలో పరిచయం చేశారు. నేను సాహిత్యంలో చేసిన కృషి, ప్రచురించిన పుస్తకాలు, చేస్తున్న ఉద్యోగంతో పాటు... మా నాన్న స్మృత్యర్థం స్థాపించిన ‘మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌’ తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి కూడా యాంకర్‌ స్వచ్ఛమైన హిందీలో చెప్పి నప్పుడు నా భావోద్వేగం తారస్థాయికి చేరుకుంది.

ఆ పెద్ద హాలులో తెలుగు తెలిసిన ఒక్కరూ లేకపోయినా, నా మట్టుకు నేను సీరియస్‌గా కవితను (ఆలిండియా రేడియో రికార్డింగ్‌ కోసం) చదివాను. ఆ తర్వాత డాక్టర్‌ పుష్పాసింగ్‌ నా కవితకు హిందీ అనువాదం చదివినప్పుడు, మంచి స్పందన వచ్చింది. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’ సభలో సందడి చేశాయి. ఆమె మంచి ఫ్రెండ్‌ అయ్యారు. ఈ అరుదైన సందర్భంలో అన్ని రాష్ట్రాల కవులతో పాటు ప్రత్యేకించి గోవా, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులను కలవటం ప్రత్యేక అనుభూతి. వారి అనుభవాల్ని గ్రహించటం సాహిత్యంలో సరికొత్త పాఠాలు నేర్చుకోవటమే. 

పంజాబీ కవి గురుతేజ్‌తో ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం దొరికింది. ఇండో–పాక్‌ బోర్డర్‌లో ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సింగ్‌ అనేక విషయాలు నాతో పంచుకున్నారు. కశ్మీరీ కవి డాక్టర్‌ గులామ్‌ నబీ హలీమ్‌ చలాకీగా తిరుగుతూ అందరినీ అల్లుకుపోయాడు. ఈ ఇద్దరూ నా ఇతర కవితల ఆంగ్లానువాదాలు తమకు పంపమని, వాటిని తమ భాషల్లోకి తర్జుమా చేస్తామని అడిగారు. నేను వేదిక దిగగానే ఢిల్లీకి చెందిన మరో ముగ్గురు మహిళలు కూడా ఇదే అభ్యర్థన చేశారు. ఇవి నాకు సరికొత్త ద్వారాలు.

నా రూమ్మేట్‌ అయిన మరాఠీ కవి అనిల్‌ సబాలే, పక్క గదిలో దిగిన సంథాలీ కవి గౌరు ముర్ము, పోలీస్‌ డిపార్ట్‌మెంటులో పనిచేసే మణిపురి కవి క్షేత్రి రాజన్‌ తదితరులతో ఎక్కువగా చర్చించే అవకాశం దొరికింది. నా సాహిత్యపు డైరీలో కొత్త మిత్రులు చేరారు. నా కవిత 21 భాషల్లోకి తర్జుమా అవుతుందన్న సంతోషం మరింత కిక్కిచ్చే అంశం. ఈ సర్వ భాషా కవిసమ్మేళనం జనవరి 25వ తేదీ రాత్రి 10 గంటలకు అన్ని రేడియో స్టేషన్ల నుంచి ప్రసారమవుతుంది. (క్లిక్ చేయండి: ప్రెస్‌ – పిక్చర్‌ – ప్లాట్‌ఫాం!)
    
– ఎమ్వీ రామిరెడ్డి, రచయిత

మరిన్ని వార్తలు