కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'

16 Oct, 2023 13:01 IST|Sakshi
'పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం' గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆర్కె రోజా

సాక్షి, పత్రికా ప్రకటన: చిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది.

తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు.

సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు.

కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు.

పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు.

అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది.

మరిన్ని వార్తలు