Natural Skills: సహజ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి

20 Dec, 2022 12:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సందర్భం

ఈ మధ్యన ఒకటి–రెండు సందర్భాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న ఒకరిద్దరు చురుకైన విద్యార్థులను కలవడం సంభవించింది. వాళ్లతో మాటా–మాటా కలిపి, వారి–వారి ప్రొఫెషనల్‌ విద్యాభ్యాసంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నారూ, అధ్యాపకులు ఏం నేర్పిస్తున్నారనీ ప్రశ్నిస్తే, వారిదగ్గర నుండి ఆశించిన సమాధానం రాలేదు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి అయిన తరువాత ఏరకమైన మెషిన్లమీద పనిచేస్తావని ప్రశ్నిస్తే తెలియదని అమాయకంగా వచ్చింది జవాబు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ తరువాత సరాసరి ఏదైనా ప్రోగ్రామింగ్‌ చేయగలరా అంటే దానికీ జవాబు లేదు. సివిల్‌ ఇంజనీరింగ్‌ తరువాత ఎలాంటి ప్రాజెక్టులలో పనిచేయాలని అనుకుంటున్నావని అడిగితే అసలే అర్థం కాలేదు. అందరూ విద్యార్థులూ ఇలాగేనా అంటే కావచ్చు, కాకపోవచ్చు. స్వతహాగా తెలివైన కొందరి విషయంలో మినహాయింపు ఉండవచ్చు. ఇంజనీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులన్నీ ఇటీవల కాలంలో ‘నాలెడ్జ్‌ బేస్డ్‌’ (అంతంత మాత్రమే) తప్ప ‘స్కిల్‌ బేస్డ్‌’ కాకపోవడమే బహుశా దీనికి కారణం కావచ్చు.  

ఇదిలా ఉంటే ఎలాంటి ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ లేకుండా రకరకాల వృత్తి నిపుణులు మన దేశంలో, రాష్ట్రంలో కోకొల్లలు. వారంతా స్వయంశక్తితో వారి వారి వృత్తుల్లో ఎలా ప్రావీణ్యం సంపాందించుకున్నారో అనేది కోటి రూకల ప్రశ్న. వారిలో గ్రామీణ వృత్తులు మొదలుకుని, పట్టణాలలో, నగరాలలో పనిచేస్తున్న వాహనాలు, ఎయిర్‌ కండీషన్‌లు వంటి వాటిని బాగుచేసే మెకానిక్కులు చాలామందే ఉన్నారు. వీరు రిపేర్లు చేయడానికి వచ్చేటప్పుడు తమ వెంట ఒక జూనియర్‌ కుర్రవాడిని తీసుకు వస్తారు. అతడు కొంతకాలానికి సీనియర్‌ అయిపోతాడు. అందుకే ఇటువంటివారు నేర్చుకున్న విద్య భావితరాలవారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధానం ప్రవేశపెట్టాలి. వీరికి సంబంధిత విద్యార్హతలు లేకపోయినా ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ చెప్పేటప్పుడు ఉపయోగించుకునే విధానం రూపొందిస్తే మంచిదేమో! యాభై, అరవై ఏళ్ల అనుభవంతో చేస్తున్న సూచన ఇది.

చేతి గడియారం పనిచేయకపోతే, కంపెనీ షోరూమ్‌కు పోయి ఇస్తే బాగుచేసి ఇవ్వడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే, ఆలవాటున్న ఒక రిపేర్‌ షాప్‌కు పోయాను ఇటీవల. ఆ చిన్న షాప్‌లో ఎప్పటిలాగే ఇద్దరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ కూర్చున్నారు. ఆ ఇద్దరిలో సీనియర్‌ వ్యక్తి (బహుశా) బ్యాటరీ కొత్తది వేయాలని చెప్పి రూ. 220 అవుతుందన్నాడు. నేను సరే అనగానే ఐదు నిమిషాలలో ఆ పని కానిచ్చి నా చేతిలో పెట్టాడు. గత ఏభై ఏళ్లుగా... తన తండ్రి కాలం నుంచి అక్కడే రిపేర్లు చేస్తున్నామనీ, గడియారాలు రిపేరు చేసే విద్య ఎప్పటినుంచో తనకు వచ్చనీ, ఎలా అబ్బిందో తెలియదనీ, ఎక్కడా నేర్చుకున్నది కాదనీ అన్నాడు. 

ఇటీవల మనం వాడుకునే వస్తువులు చెడిపోయినప్పుడు ఎక్కువగా కంపెనీల సర్వీసింగ్‌ మెకానిక్‌లను పిలవకుండా స్వంతంగా నేర్చుకున్న పనితనంతో తక్కువ ధరకు సర్వీసు చేసి పోతున్న లోకల్‌ టాలెంట్‌లనే వినియోగదారులు ఆశ్రయించడం వీరికి ఉన్న విశ్వసనీయతను తెలియ జేస్తోంది. ఇటువంటి నేచురల్‌ టాలెంట్‌ ఉన్న వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. 

మా చిన్నతనంలో ఖమ్మం పట్టణంలో మేమున్న మామిళ్ళ గూడెం బజారులో (లంబాడి) రాము అని ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేస్తున్న వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువు కోలేదు. కాని అద్భుతమైన రీతిలో మెకానిజం తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో ఖమ్మంలో కార్లు, జీపులు బహుశా చాలా తక్కువ. వాటికి కానీ, లారీలకు కానీ ఏ విధమైన రిపేర్‌ కావాలన్నా రామునే దిక్కు. రాముకు సహజ సిద్ధంగా అబ్బిన విద్య అది. అప్పట్లో హైదరాబాద్‌లో మా బంధువు లబ్బాయి ఒకడిది అద్భుతమైన మెకానికల్‌ బ్రెయిన్‌. ఇంకా కంప్యూటర్లు ప్రాముఖ్యం చెందని రోజుల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లలో నైపుణ్యం సంపాదించాడు. ఎట్లా నేర్చుకున్నాడో, ఎవరికీ తెలియదు. ఇంటర్మీడియేట్‌ చదవడానికి ప్రయత్నం చేశాడు. కుదరలేదు. స్నేహితుల సహాయంతో అమెరికా చేరుకున్నాడు. చిన్నగా హార్డ్‌వేర్‌ మెకానిజంలో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కంపెనీలు అప్పట్లో అతడి మీద ఆధారపడేవి. అంచెలంచెలుగా ఎదిగి ఫార్మల్‌ డిగ్రీలు లేకపోయినా నైపుణ్యం ప్రాతిపదికగా అక్కడ స్థిరపడిపోయాడు. అతడా విద్య ఎలా నేర్చుకున్నాడు?

చాలా కాలం క్రితం ఆంధ్రాబ్యాంక్‌లో కొఠారి చలపతి రావు అనే ఆయన పనిచేసేవారు. అక్కడ చేరడానికి ముందర కొన్ని చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశాడు. ఇంకా అప్పటికి కంప్యూటర్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. కేవలం మామూలు గ్రాడ్యుయేట్‌ మాత్రమే అయిన కొఠారి చలపతిరావు స్వయంగా నేర్చుకుని ఆంధ్రా బ్యాంక్‌ కంప్యూటర్‌ సిస్టం ఏర్పాటు చేశాడు. ఆయన్ని అంతా కంప్యూటర్‌ భీష్మ పితామహుడు అని పిల్చేవారు. ఆయన ఆ విద్య ఎలా నేర్చుకున్నాడు? 

వీరిలాంటి అనేకమంది సహజ నైపుణ్యం ఉన్నవారిని ప్రొఫెషనల్‌ కోర్సుల కాలేజీలలో క్వాలిఫికేషన్‌ లేకపోయినా అయినా ఉపయోగించుకోవాలి. అప్పుడే సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు మంచి నైపుణ్యం అందుబాటులోకి వస్తుంది. (క్లిక్ చేయండి: గట్టివాళ్లే చట్టానికి గౌరవం)


- వనం జ్వాలా నరసింహారావు 
చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వం

మరిన్ని వార్తలు