కుప్పకూలిన ఆక్టోపస్‌ కానిస్టేబుల్‌

3 Dec, 2023 10:37 IST|Sakshi

మంగళగిరి: ఫిజికల్‌ యాక్టివిటీ టెస్ట్‌లో పాల్గొన్న ఆక్టోపస్‌ కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన నగరంలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మంగళగిరి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాల్తేరుకు చెందిన గురుగుబెల్లి సోమేశ్వరరావు(33) ఆక్టోపస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం నగర పరిధిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో ఉన్న పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఫిజికల్‌ యాక్టివిటీ టెస్ట్‌లో పాల్గొని అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.

గమనించిన తోటి కానిస్టేబుల్స్‌ హుటాహుటిన ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమేశ్వరరావు మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్‌ఐ క్రాంతికుమార్‌ ఎయిమ్స్‌కు చేరుకుని సోమేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా స్వగ్రామానికి తరలించారు. ఆక్టోపస్‌ ఏఎస్‌ఐ ఎం. ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు సోమేశ్వరరావు భార్య, కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు