‘ఆడుదాం ఆంధ్ర’తో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సాహం | Sakshi
Sakshi News home page

‘ఆడుదాం ఆంధ్ర’తో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సాహం

Published Sun, Dec 3 2023 1:34 AM

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాలరెడ్డి, జేసీ రాజకుమారి  - Sakshi

నెహ్రూనగర్‌: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్ని ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్ని నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాలరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం ఆయన సంయుక్త కలెక్టర్‌ జి. రాజకుమారితో కలసి పోటీలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చురుకై న జీవన శైలిని అవలంబించడానికి, ఆరోగ్య పరమైన జీవన విధానాన్ని ఆచరించడానికి జరుగుతున్న ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు డిసెంబరు 15 నుంచి జిల్లాలో ప్రారంభమవుతాయని తెలిపారు. క్రీడాకారుల నమోదు 2023 నవంబరు 27 నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. సచివాలయాల్లోను, వలంటీర్ల ద్వారా, 1902కు కాల్‌ చేసి లేదా htt ps://aadudamandhra.ap.gov.in/ వెబ్‌సైట్‌లోనూ డిసెంబరు 13వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల నమోదుపై ఇప్పటికే ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయం యూనిట్‌గా, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయం యూనిట్‌గా క్రీడల్ని నిర్వహించనున్నట్లు వివరించారు. సచివాలయ స్థాయిలో గెలుపొందిన వారికి మండల స్థాయిలోను అక్కడ గెలుపొందిన వారికి నియోజకవర్గ స్థాయిలో, తదుపరి జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను పోటీల్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల్లో 15 సంవత్సరాలు వయస్సు దాటిన యువతీ, యువకులు పాల్గొనవచ్చని చెప్పారు. క్రికెట్‌, బాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ క్రీడాంశాలలో పోటీలు ఉంటాయని వివరించారు. గెలుపొందిన జట్లకు నియోజకవర్గ స్థాయి నుంచి నగదు బహుమతులు అందించనట్లు పేర్కొన్నారు.

బహుమతులు ఇలా...

● క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో , వాలీబాల్‌ క్రీడాంశాలకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.35,000, రూ.15,000, రూ. 5000, జిల్లా స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ. 60,000, రూ.30,000, రూ.10,000, రాష్ట్ర స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5,00,000, రూ. 3,00,000, రూ. 2,00,000గా నిర్ణయించినట్లు వెల్లడించారు.

● బాడ్మింటన్‌ క్రీడాంశానికి నియోజకవర్గ స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.20,000, రూ. 10,000, రూ. 5,000, జిల్లా స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ. 35,000, రూ. 20,000, రూ. 10,000, రాష్ట్ర స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ. 2,00,000, రూ. 1,00,000, రూ. 50,000 అందించనున్నట్లు తెలియజేశారు.

● సచివాలయ స్థాయి పోటీలు డిసెంబరు 15 నుంచి 2024 జనవరి 1 వరకు, మండల స్థాయి పోటీలు జనవరి 2 నుంచి జనవరి 15 వరకు, నియోజక వర్గ స్థాయి పోటీలు జనవరి 16 నుంచి జనవరి 21 వరకు, జిల్లా స్థాయి పోటీలు జనవరి 22 నుంచి జనవరి 28 వరకు, రాష్ట్రస్థాయి పోటీలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతాయని కలెక్టర్‌ వివరించారు.

క్రీడల నిర్వహణకు కమిటీలు

వాలీబాల్‌ టీంకు 12 మంది సభ్యులు, ఖోఖో టీంకు 15 మంది సభ్యులు, కబడ్డీ టీంకు 12 మంది సభ్యులు, బాడ్మింటన్‌ టీంకు ఇద్దరు (2) సభ్యులు, క్రికెట్‌ టీంకు 16 మంది సభ్యులు తప్పనిసరిగా ఉండాలన్నారు. క్రీడల నిర్వహణకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలోను కమిటీల్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ , నోడల్‌ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ క్రీడల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. ఇప్పటికే జిల్లాకు క్రీడా సామగ్రి సరఫరా చేశామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 568 గ్రామ, వార్డు సచివాలయాలు, 18 మండలాలు, ఏడు నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. క్రీడల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, 244 ప్రాంగణాలతో పాటు 312 పీఈటీలు, పీడీలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు మినహా జిల్లాలోని 15 సంవత్సరాల వయస్సు నిండిన మహిళలు, పురుషులు క్రీడలలో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. తొలుత ఆడుదాం ఆంధ్ర (కృష్ణ జింక)తో రూపొందించిన క్రీడల ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డి. వెంకటేశ్వర్లు, స్టెప్‌ సీఈవో ఎస్‌. పల్లవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణలో కలెక్టర్‌ ఎం వేణుగోపాలరెడ్డి

Advertisement
Advertisement